Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ వాడు అక్కడ నీల్గుతాడు. నేనే నంబర్‌ఒన్ అంటూ డిక్టేటర్లా వ్యవహరిస్తాడు. కంటి చూపుతో కాల్చేస్తాడు. ఒంటిమీద చెమట వరదలు పారిస్తాడు. వాడి అఘాయిత్యాన్ని రౌడీయిజాన్ని తట్టుకోలేక మా కాళ్ళూ గడ్డమూ పట్టుకుని బతిమాలి మా చేత ఊడిగం చేయించుకుంటారు. అవసరం వున్నంతకాలం మమ్మల్ని మస్కా కొడుతుంటారు.
మనిషి అటునించి ఇటు తిరిగి పడుకున్నాడు.
నా మాటలు వినపడ్డం లేదు నీకు. వినపడ్డా వినపడనట్టు ఏక్టింగ్ చేస్తున్నావా? మీ మనుషులంతా గొప్ప నటులేరా. ఉద్యోగస్తులయితేనేం, డాక్టర్లయితేనేం, రాజకీయనాయకులయితేనేం. మనుషులంతా తమ పబ్బం గడుపుకోడానికి నటించేవాళ్ళే. ఏం నటిస్తార్రా!
మనిషి ఇటునుంచి అటు తిరిగి పడుకున్నాడు.
నా మాటలు వినపడుతున్నవి కదా. అయినా నిద్ర పోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావురా! నిన్నటిదాకా నేనంటే ఎంత ప్రేమ, ఎంత భక్తి, ఎంత గౌరవం చూపించావు. అచ్చం రాజకీయ నాయకుడిలానే. ఎలెక్షన్ల ముందు ఓటర్లంటే వాళ్ళకీ ప్రేమ, భక్తి, గౌరవం పుట్టుకొస్తాయి.
మనిషికి నిద్రాభంగం అయింది. ఎవడ్రా ఒకటే నస. చెవిలో జోరీగ జొరబడినట్టు అంటూ లేచి కూచున్నాడు.
ఆగకుండా అంతూపొంతూ లేకుండా అదేపనిగా గుండ్రంగా, గిరగిరా తిరిగి, వేడెక్కి పొగలూ సెగలూ కక్కుతున్నా పట్టించుకోవేం?
ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు మనిషికి. గదిలో ఉన్నది తను ఒక్కడే. గదికి ఉన్న ఒకే ఒక్క కిటికీకి అవతలి పక్క గిర్రున తిరుగుతున్నది ఒక్క కూలరే.
గుండ్రంగా గిరగిరా తిరిగి అన్నమాటలు మనిషి చెవుల్లో మరొక్క మారు రిపీటయ్యేయి. కొంపదీసి కూలర్ గానీ మాటాడ్డం లేదు కదా అనుకున్నాడు.
మనిషి మనసులోని మాట పట్టేసినట్టుంది, ఇందాకట్నించీ అదే పనిగా తిరుగుతూ మాట్లాడుతున్న కూలర్.
అవున్రా నేనే! మాట్లాడుతున్నది. నువ్వు కిటికీ వెనకాల దాదాపు రెన్నెల్ల కింద నుంచి నిలబెట్టిన 'కెన్‌స్టార్' కూలర్‌నే.
మనిషి ముక్కుమీద వేలు వేసుకోవాలనే విషయం కూడా మరిచిపోయి నోరు తెరిచాడు.
నేనేనోరు! మెట్లకింద దుమ్మూధూళీ పేరుకుపోయి వున్నప్పుడు దుమ్ము దులిపి శుభ్రం చేసి కొత్త గడ్డి తడకలతో అలంకరించి కిటికీ దగ్గర నిలబెట్టావు కదా నన్ను.
బిత్తరపోయి చూస్తున్నాడు మనిషి.
రోజూ రెండుమూడుసార్లు నా కడుపు నిండా నీళ్ళు నింపి 'తిరుగూ తిరుగూ తిమ్మప్పా' అన్నావు. తిరిగానా లేదా? రెండు మూడు రోజుల నుంచీ చూస్తున్నా. ఇది వరకులా నీళ్ళు నింపడం లేదు ఏంటి సంగతి?
మనిషి ముఖం ఇబ్బందిగా పెట్టాడు..
చల్లని నీళ్ళతో పైపుల్తో ఒళ్ళంతా తడుపుకుంటూ నీకు రోజూ కూల్ ఎయిర్ ఇచ్చానా లేదా! నీకేం నువ్వు హాయిగా ఎంజారు చేశావు. కానీ నా వెనకాల నిలబడి చూశావా ఎంత వేడిగా వుంటుందో! నా శక్తినంతా నీ కోసం ధారపోశాను కదరా! అసలు నాకు తెలీకడుగుతాను, ఈ లోకంలో వుండే చరాచర వస్తువులన్నీ నీకు ఊడిగం చెయ్యడానికేనట్రా ఉన్నది... గురగురమంది కూలర్లో ఉన్న ఫ్యాను. ఆ పక్క గదిలో ఒకడు ఏసీ పెట్టుకుని రాజవైభోగం అనుభవిస్తున్నాడు. ఏసీ వీపు వేడెక్కి విమానం మోత మోగుతున్న సంగత్తెలుసా వాడికి. ఇంతా చేసి ఏం సాధిస్తున్నార్రా మీరు. స్వచ్ఛమైన గాలి వీచే చెట్లని మూకుమ్మడిగా హత్య చేసి మీథేన్, ఇథేన్, ప్రొఫేన్ ల ద్వారా విడుదలయ్యే కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్లతో గాలిని కలుషితం చేస్తున్నారు కదరా! దీనివల్ల ఓజోను నాశనం, మీ ఆరోగ్యమూ సర్వనాశనం. మీరు బాగుపడిరా పడరు అనరిచింది కూలర్.
మనిషి ఏదో నిర్ణయానికి వచ్చినవాడిలా లేచి నిలబడ్డాడు.
నాకు తెల్సురా. నువ్వు నీళ్ళు పోయడం మానేశావంటే వేసవి కాలం ముగుస్తున్నదన్నమాట. నన్ను మోసుకుపోయి మెట్లకింద పడేస్తావు. మళ్ళీ మార్చి నెలదాకా దుమ్మూ ధూళీ నా నెత్తినవేస్తావు. కానీ కానీ.. నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కుంటున్నావు అని మౌనంగా వుండిపోయింది కూలర్.
- చింతపట్ల సుదర్శన్,
9299809212