Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ అమెరికన్ కుటుంబం మదర్స్ డేని జరుపుకోవడానికి న్యూయార్క్‌లోని జోన్స్ బీచ్ ద్వీపానికి వెళ్లింది. అక్కడ అచ్చంగా పిచ్చుకల్లా ఉండే 'పైపింగ్ ప్లవర్స్' అనే చిన్న పక్షుల కుటుంబం వారి దృష్టిని ఆకర్షించింది. గుడ్ల నుంచి కొన్ని గంటల క్రితమే బయటికి వచ్చి రెక్కలార్చుతున్న పిల్లలకు ఇక గూడు వదలి వెళ్లవలసివచ్చిందని, ఎట్లా ఎగరాలో శిక్షణ ఇస్తున్నాయి తల్లి, తండ్రి పక్షులు. అదిగో ఆ దృశ్యాన్ని ఫొటో తీశారు వారు. తమ గుడ్లు, లేదా చిన్న పిల్లలను కాపాడుకోడంలో ఈ పక్షులు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. గుడ్లను పొదిగే సమయంలో నక్కలు, పిల్లులు వంటి జంతువులు తమ గుడ్లను లేక చిన్న పిల్లలను తినకుండా ఉండేందుకు వాటి దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తాయి. ఆ జంతువులు ఇసుకలో తమ గూడు ఉన్న ప్రాంతానికి వస్తూ కనిపిస్తే గూడును వదిలి కొద్దిగా దూరంగా పోయి రెక్క కాని, కాలుకాని విరిగిపోయినట్లు కుంటుతూ నడుస్తుంటాయి ఈ పక్షులు. ఈ స్థితిలో చూసిన నక్కలు వాటిని గుటుక్కున నోట్లో వేసుకోవచ్చనే ఆశతో వాటిదగ్గరకు పరుగెత్తుతాయి. దగ్గరకు వచ్చిన నక్కను చూసి పక్షులు తుర్రుమని ఎగిరిపోతాయి. ఉసూరుమంటూ నక్కలు లాంటి హానికలిగించే జంతువులు వేరే దిక్కుకు కదిలిపోతాయి. ఈ చిన్ని పక్షుల్లో తమ సంతానాన్ని కాపాడుకోవడంలో ఎంత తెలివి నిక్షిప్తమై ఉందో!