Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవులకు అనుబంధాలు మరో మనిషితోనే ఏర్పడాలనే సూత్రం ఏమీ లేదు. మన పరిసరాలతో ఏర్పడవచ్చు. రోజూ వాడుకునే కొన్ని నిత్యావసర వస్తువులతో ఏర్పడవచ్చు. మనం వేసిన పూల మొక్కతో, దానికి పూసే పూలతో ఏర్పడవచ్చు. మనల్ని ఆహ్లాదపరిచే ప్రకృతితో, ప్రకృతికి మార్పులు తెచ్చే రుతువులతోటీ మనం అనుబంధం పెంచుకోవచ్చు. మన మనసులోని సుఖదు:ఖాలను అనుభూతుల ద్వారా మనం ఏర్పరచుకున్న అనుబంధాలతో పంచుకుని ఆనందించవచ్చు. లౌకిక, అలౌకిక విషయాలపై కూడా బంధాలు పెంచుకోవడం మానవ నైజం.
నందితాదాస్ చిత్రాలు ఈ విషయంపై ఆధారపడి వున్నాయి. ఈమె చిత్రాలు స్వీయ చరిత్రకు సంబంధించినవి కావు. కానీ రకరకాల మనుషుల, రకరకాల అనుబంధాల అవగాహనపై ఆధారపడి వున్నాయి. అయితే ఆమె చిత్రాలు స్తీ ఆలోచనల ఆధారంగా ఉంటాయి. స్త్రీలలోని అనేక ఆనంద, ఉద్రేక, ఉదాసీనతలను, మనోభావాలను చూపించ ప్రయత్నిస్తుంది. మనకు ఏదైనా భావోద్రేకం కలిగినప్పుడు, ఎవరితోనైనా పంచుకుని ఆనందిస్తాం, లేదా మనసు తేలిక పరచుకుంటాం. ఆ భావాలను పంచుకోవడానికి మనుషులే ఎందుకు! మనం అనుబంధం కల్పించుకున్న అనేక పరిసరాలు కావచ్చు కదా! అవే నందితాదాస్ చిత్రాలు.
1975లో కలకత్తాకి దగ్గరి గ్రామంలో జన్మించిన ఈమె 1998లో రవీంద్రభారతి యూనివర్సిటీలో గ్రాఫిక్ ఆర్ట్‌లో మాస్టర్ డిగ్రీ పొందింది. కలకత్తా వాస్తవ్యురాలైన ఈమె వెరమౌంట్ స్టూడియోలో రెసిడెన్సీ చేసి బౌంటన్ అవార్డ్ గెలుచుకుంది. అలాగే సిరామిక్స్, మురల్స్, టెక్స్టైల్స్, టెర్రకోట వంటి వివిధ కళల్లో వున్న అభిరుచితో వర్క్‌షాప్‌ల్లో పాల్గొంది. ఎన్నో ప్రదర్శనల్లోనూ పాల్గొంది.
ఆమె గ్రాఫిక్ ఆర్ట్‌లో పట్టా పొందినా, ఆ మీడియంలో విక్రయం తక్కువ కాబట్టి విస్తారంగా అమ్మకం జరిగే పెయింటింగ్ మీడియంలో పనిచేస్తుంది. కానీ ఆమె చిత్రాల్లో గ్రాఫిక్ కళాపద్ధతులు కానవస్తాయి. ఒకదానిపై మరొక వరుస పెయింట్స్ వుంటాయి. కొన్ని ఆలోచనల ప్రకారం, అనుకున్న బొమ్మ కోసం రంగుల గీతలు గీస్తున్నా, అకస్మాత్తుగా చిత్రం వేస్తున్న సమయంలో వచ్చే ఆలోచనల కారణంగా చేర్చిన విషయ వివరణలు స్పష్టంగా ఆమె బొమ్మల్లో కనిపిస్తాయి. చిత్రంలో మూలం స్త్రీ మనో భావాలు, అనుభూతులు. వాటిని ఆ స్త్రీ చుట్టుపక్కల వేసిన ప్రతీకలతో తెలియజేస్తుంది. కొన్ని చిత్రాలు పురుష ప్రధాన చిత్రాలూ వేస్తుంది. ఏ చిత్రమైనా మనుషులు తమ అంతరంగంలోకో, అంతరంగాన్ని ప్రతిబింబించే శూన్యంలోకో చూస్తూ, ఆలోచనలతో నిండి పరిసరాలలోకి చూస్తూనో కనిపిస్తారు. ఏ చిత్రాలూ మనతో సంభాషించవు. - - డా||ఎం.బాలామణి,
81067 13356