Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె స్వరం చల్లగా వీచే పిల్లగాలి... మండు వేసవిలో వెన్నెలను కురిపించే జాబిలి.. ఓ మలయమారుతం... గలగలా పారే సెలయేరు... 'నాంపల్లి స్టేషను కాడీ' అంటూ శ్రమ జీవుల జీవితాన్ని శ్రావ్యంగా వినిపించినా.. 'మాటే మంత్రము.. మనసే బంధమూ' అంటూ ప్రేమ కావ్యాన్ని సృజించినా.. 'ఈ పాదం ఇలలోన నాట్యవేదం' అంటూ నృత్యాన్ని కీర్తించినా.. 'ప్రియతమా నీవచట కుశలమా' అంటూ ప్రేమ లేఖను పలికించినా.. 'లాలుదర్వాజ లస్కరు' అంటూ తెలంగాణ యాసలో అదరగొట్టినా ఆమెకు ఆమే సాటి. ఆమే ప్రముఖ నేపథ్య గాయిని ఎస్పీ శైలజ. అమృతలత అపురూప అవార్డు అందుకునేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమెతో సోపతి చిట్‌చాట్...
మీరు పుట్టి పెరిగింది ఎక్కడ?
మా సొంత ఊరు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మ పేట. నాన్న సాంబమూర్తి హరికథా కళాకారుడు. అమ్మ శకుంతలమ్మ. తను కూడా చాలా బాగా పాటలు పాడుతుంది. నాకు నలుగురు అక్కలు, ఇద్దరు అన్నలు. ఇంట్లో అంతా సంగీత వాతావరణమే.
అమ్మ ప్రభావం మీపై ఎలా ఉండేది?
అమ్మ దగ్గర నేను పెరిగింది తక్కువే. నాకు పదేండ్లు వచ్చేటప్పటికి అన్నయ్య (చెన్నై) దగ్గరకు వెళ్ళిపోయాను. అయితే ఈ రోజు నేను ఓ సింగర్‌గా ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం అమ్మనే. ఎందుకంటే అప్పట్లో నాన్నకు ఆడపిల్లలు బయటకెళ్ళి పాడటం పెద్దగా ఇష్టం లేదు. మా అక్కలు సంగీతం నేర్చుకున్నా కేవలం ఇంటికే పరిమితమయ్యారు. అయితే మా అమ్మ ఒక్క ఆడపిల్లైనా స్టేజ్‌పై పాడితే బాగుండు అనుకునేది. నాన్నకు తెలియకుండా కచేరీలకు, పాటల పోటీలకు తీసుకెళ్ళేది. చాలా చిన్నపిల్లని కావడంతో నెల్లూరు జిల్లాలోని కళాకారులందరూ చాలా ప్రోత్సహించేవారు.
మీ మాట తీరు, విధానం చూస్తే క్రమశిక్షణకు మారు పేరుగా కనిపిస్తారు..?
ఇది కూడా అమ్మ దగ్గరే నేర్చుకున్నా. క్రమ శిక్షణతో పాటు ముఖ్యంగా పట్టుదల. ఏదైనా ఓ పని చేయాలనుకుంటే ఆపకుండా చేయడం. అయితే ఎంత క్లోజ్‌గా ఉన్నా అమ్మను చూస్తే భయం వేసేది. తను ఒక్క చూపు చూస్తే చాలు నేను చేసిన పని అమ్మకు నచ్చలేదు అంటే నేను తప్పు చేస్తున్నాను అని అర్థమయ్యేది. అమ్మ మా అందరినీ ఓపిగ్గా, క్రమశిక్షణతో పెంచింది. అదే ఇప్పటి వరకు నన్ను ఇలా నిలబెట్టింది.
అన్నయ్య (బాలూ)తో కలిసి ఎన్నో పాటలు పాడారు. అప్పట్లో మీ ఫీలింగ్ ఎలా ఉండేది?
అప్పటికే అన్నయ్య పెద్ద సింగర్. ఆయనతో పాడాలంటే భయం వేసేది. మరీ ముఖ్యంగా డ్యూయట్ పాడాలంటే ఇబ్బందిగా అనిపించేది. ''ఇది ప్రొఫెషన్. వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు. పాట పాడే వరకు నేను అన్నయ్యను అని మర్చిపో. ఇద్దరం కేవలం సింగర్స్ మాత్రమే'' అని ధైర్యం చెప్పేవారు. మరీ ఇబ్బంది కరమైన పాటలైతే అన్నయ్య వద్దనే వారు.
బాలుగారు ఏమైనా సలహాలు ఇచ్చేవారా?
ఇచ్చేవారు. అలాగనీ మరీ ఎక్కువ జోక్యం చేసుకోరు. చిన్నప్పటి నుండి సుశీల గారి పాటలు వింటూ పెరిగాను. ఆవిడ ప్రభావం నాపై బాగా ఉండేది. ఆమెలా పాడటానికి ప్రయత్నం చేసేదాన్ని. అప్పుడు మాత్రం ''నువ్వు సుశీల గారిలా పాడాలంటే ఇండిస్టీకి అవసరం లేదు. ఎలాగో ఆవిడ ఉన్నారు. నువ్వు నీలా పాడితేనే మంచిది'' అని సలహా ఇచ్చారు. అలాగే తమిళంలో కూడా పాడాల్సి వచ్చేది. తెలియని భాష కావడంతో నా ఒరిజినల్ వాయిస్‌తోనే పాడటం మొదలుపెట్టాను. ఇది నాకు భవిష్యత్‌లో బాగా ఉపయోగపడింది.
మిమ్మల్ని ఓ సింగర్‌గా నిలబెట్టిన పాటలు...?
చాలా చిన్న వయసులోనే ఇండిస్టీకి వచ్చాను. కాబట్టి అన్ని రకాల పాటలు పాడే అవకాశం వచ్చింది. 'నాంపల్లి స్టేషన్' పాటైతే అంత హిట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఆ తర్వాత ''సాగర సంగమం'' నన్ను నిలబెట్టింది. ఈ సినిమా తర్వాతనే శైలజ ఇలాంటి పాటలు కూడా పాడగలదు అనే పేరు తెచ్చుకున్నా. ఆ తర్వాత 'లాలూ దర్వాజ' మంచి హిట్ ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
సాగర సంగమంలో నటించారు. అప్పటి అనుభవాలు మాతో పంచుకుంటారా?
నటించడం ఇష్టం లేదు. మా నాన్నకు ఆడపిల్లలు పాటలు పాడటమే ఇష్టం లేదు. ఇక సినిమాలకు ఏం ఒప్పుకుంటారు. అందుకే మా నాన్న ఒప్పుకోరు అని చెప్పాను. కానీ విశ్వనాథ్‌గారు ముందు నాన్నను ఒప్పించి తర్వాత నన్ను ఒప్పించారు. పాట అయితే ఆ రోజు వరకు వెళ్ళి పాడి ఇంటికి వచ్చేయవచ్చు. కానీ సినిమా అలా కాదు. నెలల తరబడి డేట్స్ ఇవ్వాలి. అక్కడే ఉండాలి. అంత ఓపిక నాకు లేదు. ఆర్టిస్టులను చూస్తే అదే అనిపిస్తుంది. ఎంత ఓపిక వాళ్ళకని. చివరకు విశ్వనాథ్‌గారి కోసం 'సాగర సంగమం'లో నటించాను. కానీ కమల్‌హాసన్ గారితో దురుసుగా మాట్లాడడం కష్టంగా ఉండేది. అయితే విశ్వనాథ్‌గారు ''ఆయన కమల్‌హాసన్ అని మర్చిపో. నువ్వు ఓ ఆర్టిస్టువీ, ఆయన ఓ ఆర్టిస్ట్ అంతే'' అని నచ్చజెప్పేవారు. ఎలాగో నటిస్తున్నాను కాబట్టి ఇందులో పాడే అవకాశం కూడా అన్నయ్య మాట్లాడి ఇప్పించారు. అలా ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
అశ్లీలత ఉన్న పాటలు పాడనని బాలు గారు ఓ సారి ఓపెన్‌గానే చెప్పారు. మీరూ అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నారా?
నేనూ, అన్నయ్య ఇద్దరం అలాగే అనుకున్నాం. అలాంటి పాటల్ని రిజెక్ట్ చేశాం కూడా. అయితే దురుసుగా చెప్పకుండా మంచితనంగానే ఈ పాట పాడలేం అని చెప్పేవాళ్ళం.
ఈ మధ్య సినిమాల్లో పాడటం బాగా తగ్గించినట్టున్నారు?
అవును. నేను ముందే చెప్పినట్టు చిన్న వయసులోనే వచ్చాను. అన్ని రకాల పాటలు పాడాను. సింగర్‌గా చాలా తృప్తిగా ఉన్నాను. అయితే ఎప్పటి కప్పుడు కొత్త తరం వస్తుంటారు. కొత్త తరాన్ని ప్రోత్సహించాలి. అవకాశాలు ఇవ్వాలి. ఇండిస్టీ కూడా కొత్త గొంతు కోసం ఎప్పుడూ వెదుకుతూ ఉంటుంది. అయితే మంచి పాట పాడే అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా పాడుతున్నా.
అప్పటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పు..?
అప్పట్లో మేం పాడేటప్పుడు ఆ పాటను రాసే కవి, మ్యూజిక్ డైరెక్టర్ మాతోనే ఉండేవారు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే సరిచేసేవారు. సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండా చూసుకునేవారు. ఇప్పుడైనా మీరు వినండి... పాత పాటల్లో సాహిత్య పరంగా తప్పులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు నేను ఓ పాట పాడుతున్నానంటే కో సింగర్ ఎవరో కూడా తెలియని పరిస్థితి.
సాహిత్యంతో పాటు, సంగీతంలో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. దాని గురించి మీరేమంటారు?
ఇప్పటి యువత ఇలాంటి పాటలే కోరుకుంటున్నారు. అయితే పది అర్థం కాని పాటలు వస్తే ఒక మంచి పాట కూడా వస్తుంది. అది కచ్చితంగా హిట్ అవుతుంది. మా అబ్బాయి ఇప్పటి పాటలు బాగా వింటుంటాడు. అలాగే అప్పుడప్పుడు పాత పాటలు విని ''ఇప్పటి పాటలు ఎన్ని విన్నా పాత పాటలు కాసేపు వింటే చాలు ప్రశాంతంగా ఉంటుందమ్మా'' అంటాడు.
డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ అనుభవాలు?
డబ్బింగ్ కూడా అనుకోకుండా వచ్చిన అవకాశమే. డబ్బింగ్ వల్ల గొంతుకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా 'వసంత కోకిల' సినిమాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా కష్టంగా
అనిపించింది. శ్రీదేవి గారికి చిన్న పిల్ల వాయిస్‌లా చెప్పాలి. అప్పట్లో శ్రీదేవి గారు హిందీలో చాలా బిజీగా ఉన్నారు. లేదంటే ఆవిడే చెప్పుకునేవారు. 'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా కోసం కొత్త గొంతు కావాలని రాధిక గారికి చెప్పించారు. అలాగే 'గుణ' సినిమాలో రేఖకు, 'మాస్టర్' సినిమాలో సాక్షి శివానంద్‌కు, 'మురారి' సోనాలీ బింద్రే, 'ఆదిత్య 369'లో మోహినికి, 'తెనాలి'లో దేవయాని, 'భామనే సత్యభామనే'లో హీరా, రవీనా టాండన్ ఇలా కొంత మందికి డబ్బింగ్ చెప్పాను. అయితే సెలెక్టెడ్‌గానే చెప్పాను.
ఇప్పుడు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లలు పాడుతుంటే ఎలా అనిపిస్తుంది?
చిన్న పిల్లల్ని, కొత్త సింగర్లను పరిచయం చేయడం చాలా బాగుంటుంది. పిల్లలు పాడుతుంటే ఎంత సేపైనా అలా వినాలనిపిస్తుంది. అయితే చిన్న పిల్లలు కాబట్టి పాడేటప్పుడు కాస్త భయం ఉంటుంది. దాంతో కొన్ని తప్పులు చేస్తారు. అయినా స్టేజ్‌పైన నిలబడిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. అందుకే తప్పులకన్నా వాళ్ళను ఎంకరేజ్ చేయడానికే ఇష్టపడతాను.
పెండ్లి తర్వాత మీ కెరీర్‌కు ఇబ్బంది కాలేదా?
లేదు. సుధాకర్ చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇద్దరం ఒకటే ఫీల్డ్ కావడం వల్ల టైం ఎడ్జెస్ట్ చేసుకునేవాళ్ళం. మా బాబు శ్రీకర్ పుట్టిన తర్వాత బయట ఊళ్ళకు వెళ్ళాల్సి వస్తే ఇద్దరిలో ఒకరు ఇంట్లో ఉండి బాబును చూసుకునేట్టు ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఇద్దరం తప్పక వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రం బాబును కూడా మాతో తీసుకొని వెళ్ళేవాళ్ళం. బాబు కూడా అస్సలు అల్లరి చేసేవాడు కాదు. కాస్త ఊహ తెలిసిన తర్వాత మా కష్టాన్ని బాబు అర్థం చేసుకునేవాడు. ''నేను ఇంట్లో ఉంటాను. మీరు వెళ్ళిరండి'' అనేవాడు.
సుధాకర్ గారు ఇంట్లో ఎలా ఉంటారు?
చాలా సరదాగా ఉంటారు. ఇంట్లోనే కాదు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అల్లరే. నిజం చెప్పాలంటే మా అబ్బాయి ఫాదర్‌లా గంభీరంగా ఉంటాడు. ఈయనేమో చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తారు. ఇంట్లో పని వాళ్ళు కూడా 'సార్ ఉంటే ఇల్లంత సందడిగా ఉంటుంది' అంటారు.
కొత్తగా వచ్చే గాయకులకు మీరేం చెబుతారు?
నా దృష్టిలో కొత్తగా వచ్చే వారికంటే కూడా మ్యూజిక్ డైరెక్టర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మా అప్పడు చక్రవర్తి గారు నన్ను ఓ సినిమాకు పరిచయం చేస్తే నేను ఓ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకునే వరకు ఆయన తీసే ప్రతి సినిమాలో ఒక్కో పాట పాడే అవకాశం ఇచ్చే వారు. అప్పట్లో డైరెక్టర్లందరూ ఇలా బాధ్యత తీసుకొని మమ్మల్ని ప్రోత్సహించేవారు. నిజం చెప్పాలంటే అప్పట్లో సినీ ఫీల్డ్కి రావడమంటే చాలా కష్టం. ఎలా అప్రోచ్ కావాలలో తెలియక ఇబ్బంది పడేవారు. ఇప్పడు రియాల్టీ షోల వల్ల అవకాశాలు పెరిగాయి. కానీ అవకాశాలు మాత్రం తక్కువ వస్తున్నాయి. దాంతో ఇప్పటి సింగర్లు స్టేజ్ షోలు, రియాల్టీ షోలపై ఆధారపడుతున్నారు. దీని గురించి మ్యూజిక్ డైరెక్టర్లు జాగ్రత్త తీసుకోవాలి.
నేటి యువతకు మీరిచ్చే సూచనలు?
మనకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. వాటిని గుర్తించాలి. ప్రస్తుతం యువత ఏది కోరుకుంటే అది కచ్చితంగా దక్కాల్సిందే. లేదంటే భరించలేకపోతున్నారు. అనుకున్నది దక్కకపోతే ఇక జీవితమే వేస్ట్ అనుకుంటున్నారు. ఫెయిల్యూర్ని భరించలేకపోతున్నారు. ఇది మంచిది కాదు. అలాగే ఏ విషయమైనా పిల్లలు తల్లిదండ్రులతో షేర్ చేసుకునే వాతావరణం ఇంట్లో ఉండాలి. మరీ ముఖ్యంంగా ఆడపిల్లలకు. ఈ విషయంలో సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యం ఉండాలి. అలాగే ఏదైనా దాడి జరిగితే ఇక జీవితం అయిపోయినట్టు కాదు. అదో యాక్సిడెంట్ అనుకోవాలి. మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా బతుకుతున్న వారు మన కండ్ల ముందు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి గురించి చదవాలి. స్ఫూర్తి నింపుకోవాలి. ధైర్యంగా బతకాలి.
పుస్తకాలు బాగా చదువుతారని విన్నాం. మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాలు?
చాలా పుస్తకాలు ఉన్నాయి. అన్ని రకాల పుస్తకాలు చదువుతాను. ఇది నాన్న నుండి అలవాటయింది. కొడవటిగంటి కుటుంబరావు గారి 'చదువు' పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది. అలాగే 'ఒక యోగి ఆత్మ కథ' కూడా. నా ఫ్రెండ్స్ కూడా నాకు గిఫ్టుగా పుస్తకాలే ఎక్కువగా ఇస్తుంటారు. సంగీతం తర్వాత నేను బాగా ఇష్టపడేది పుస్తకాలే.
మీ మిగిలిన జీవితం ఎలా గడపాలనుకుంటున్నారు?
ప్రశాంతమైన వాతావరణంలో. అత్తయ్య, మామయ్య మాతోనే ఉంటారు. వాళ్ళను చూసుకుంటూ ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాను. బాబును మానవత్వం కలిగిన మనిషిగా పెంచి సమాజానికి అందివ్వాలి అనుకున్నాం. ఈ విషయంలో మేం సక్సెక్ అయ్యామనే అనుకుంటున్నాం. ఎందుకంటే బాధ్యత తెలిసిన వ్యక్తి. ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడు. నేను మాత్రం ఏదైనా చారిటీ కోసం అడిగితే కచ్చితంగా పాడుతుంటాను. అలాంటి ప్రోగ్రామ్స్‌కే ఎక్కువగా వెళుతుంటాను. నా గురించి నేను ఒక్క మాటలో చెప్పుకోవాలంటే హౌం బర్డ్ అని చెప్పుకోవాలి.
- ఇంటర్వ్యూ : సలీమ
ఫొటోలు : రమేష్