Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రపంచంలో ఏ పరిణామమూ, ఏ మార్పూ హఠాత్తుగా సంభవించదు. చాపకిందనీరులా నిరంతరం జరుగుతుంది. 'కైజెన్' సూత్రాల ప్రకారం చిన్న చిన్న మార్పులతో, కొద్దిపాటి సర్దుబాట్లతో గొప్ప ఫలితాలను ఎలా సాధించవచ్చో ఆ సూత్రం మనకు వివరిస్తుంది. వ్యక్తిగత జీవితం నుంచి, ఏ రంగంలోనైనా మార్పు సాధ్యమని కైజెన్ నిరూపించింది. అందుకే మన దేశంలో అనేక సంస్థలు కైజెన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఇంతకీ కైజెన్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? ఒక సారి పరిశీలిద్దాం.
జపనీస్ భాషలో కై అంటే మార్పు. జెన్ అంటే మంచి. మంచి మార్పుతో నిరంతరం మెరుగుపడుతూనే ఉండటం ఈ సూత్రం ముఖ్యోద్దేశం. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ మారి తీరాలన్న బలీయమైన ఆకాంక్షే కైజెన్కు ఊపిరి. నూతన విషయాలను ఆమోదించలేని ఆభద్రతా భావన కైజెన్ విధానానికి నచ్చదు. కైజెన్ సూత్రం ప్రకారం సమస్యను ఉన్నద్నుట్లుగా చూడగలిగే గుండే ధైర్యం ఉండాలి. తాము ఎదుర్కొంటున్న సమస్య చాలా జఠిలమైంది, ఇప్పటికైనా దీనిని పరిష్కరించకపోతే మరింత తీవ్రమవుతుంది, అని ధైర్యంగా అంగీకరించాలి. సమస్యను పరిష్కరించకుండా పలాయనం చిత్తగించడం ఏమాత్రం సమర్థనీయం కాదు.
రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన నాగసాకి, హిరోషిమా నగరాలను జపాన్ ప్రజలు కైజెన్ సూత్రాలననుసరించి వేగంగా పునర్మించుకున్నారు. మిత్రమా.. ఈ ప్రపంచంలో మీరు అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి వారిలో మీ అమ్మనో లేదా మీ సతీమణి లేదా ఇంకొకరో ఉంటారు. అయితే అంతకు మించి మిమ్మల్ని మీరు గాఢంగా ప్రేమించుకోవాలి. గౌరవించుకోవాలి. మీ మనసుతో నిరంతం మాట్లాడాలి. కైజెన్లో ఆత్మద్వేషానికీ, కుంగుబాటుకు తావులేదు. ఒకసారి కైజెన్కు సరిపడినంత మనోస్థైర్యాన్ని కూడగట్టుకున్నామంటే జీవితంలో ఒక మార్పు దిశగా ప్రయత్నం ప్రారంభమైనట్లేనని మానసిక నిపుణులు చెబుతున్నారు.
పరుగు, గెలుపు, విశ్రాంతి విధానాన్ని కైజెన్ నిర్మొహమాటంగా తిరస్కరిస్తుంది. అనేక మంది విజేతల జీవితాలు ఆవిష్కరణ దగ్గరో, ఒక పురస్కారంతోనో ఆగిపోతాయి. ఒక చిన్న లక్ష్యం చేరుకోగానే ఆ తరువాత ఏమిటి? అని ప్రశ్నించుకునేందుకు ధైర్యం సరిపోదు. మళ్లీ జీరో నుంచి ప్రారంభించడానికి వారి మనసు అంగీకరించదు. అందువల్ల అలాంటి వారు తమ మానసిక వికాసానికి అడ్డుకట్ట వేసుకున్నట్టేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మనలో అంతర్గతంగా ఉన్న సృజనాత్మక ప్రవాహం మందగించకూడదు. ఒక చోట ఆగిపోకూడదు. కైజెన్ ప్రకారం గెలుపు అంతిమ లక్ష్యం కాదు. మహా అయితే అదొక చిన్న మలుపు. కైజెన్ పని సంస్కృతిలో విజయానికి ఇచ్చే నిర్వచనం వేరుగా ఉంది. మనకు మనం ప్రతిభకు మెరుగులు పెట్టుకుంటున్నపుడు తళుక్కుమనే చిన్న మెరుపే గెలుపు. ఆ మెరుపును మహాక్రాంతిగా భావించరాదు. మరింత పెద్ద లక్ష్యం వైపు దూసుకు పోవాలి. ప్రతిభనంతటినీ వెలుపలికి తీసుకురావాలి. మసాకీ ఇమాయే రాసిన 'కైజెన్' 'ది కీ టు జపాన్స్ కాంపిటీటివ్ సక్సెస'్ అనే గ్రంథం కైజెన్ అభిమానులకు ప్రామాణిక పుస్తకం వంటిది. జపాన్లో కొద్దికొద్దిగా అన్నట్టు జరిగిన ఆ మార్పు పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసింది. ఉత్పత్తిని పెంచింది. కార్ఖానాల్లో కచ్చితంగా అనుసరిస్తున్న ఆ సూత్రాలు నెమ్మదిగా కార్మికుల జీవితాలకూ విస్తరించాయి. అంతే కార్మికుల మానసిక దృక్పథాన్ని పూర్తిగా మార్చి వేశాయి. తమ దేశాన్ని తామే బాగుపర్చుకోవాలన్న ఆలోచన జపాన్ చరిత్రను మార్చి వేసింది. నిన్నటి కంటే మెరుగైన పని విధానాన్ని ఈ రోజు సాధించాలని, ఆ మార్పును నిరంతరం కొనసాగించాలని కైజెన్ సూత్రాలు బోధిస్తాయి. కైజెన్ ప్రత్యేకత అదే.
జీవితంలో పెనుమార్పులను మన మెదడు వ్యతిరేకిస్తుంది. అయితే చిన్న చిన్న సర్దుబాట్ల విషయంలో ఆ సమస్య ఉండదు. ఒక చిన్న అడుగు వేస్తాం. కొంత నమ్మకం వస్తుంది. రెండో అడుగు వేస్తాం. ఆ నమ్మకం ఇంకా పెరుగుతుంది. మూడవ అడుగు వేస్తాం. నాలుగవ అడుగుకు సరిపడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పటికే కొద్ది అడుగులు వేశామన్న ధైర్యం ఉండనే ఉంటుంది. మెదడు కూడా మార్పులోని 'కిక్కు'ను మెల్ల మెల్లగా ఆస్వాదిస్తుంది. మార్పులకు తగినట్టు తనను తాను రీ ప్రోమింగ్ చేసుకుంటుంది. దీంతో అదో అలవాటుగా మారుతుంది. చిత్రలేఖనం, వ్యాయామం, పుస్తకపఠనం, ఇంకా ఇతరత్రా ఏరి కోరి అలవాటు చేసుకున్న వ్యాపకాలే. జపనీస్లో 'ముడా' అంటే మురికి. మన భాషలో చెప్పాలంటే బద్ధకం. మన దేశంలో ప్రతి చోటా ఈ బద్ధకం ఏదో ఒక రూపంలో పేరుకు పోయింది. దానిని వదలగొడితే ఉత్పత్తి పెరుగుతుంది. నాణ్యత మెరుగవుతుంది. మానవ వరులను, విలువైన సమయాన్ని వృథా చేసే పద్ధతులు కార్యాలయాల్లో తిష్టవేసుకుని ఉన్నాయి. వాటిని మార్చాలి. కైజెన్ విధానాన్ని అనుసరించాలి. ప్రాణంలేని ఫాక్టరీల్లో మార్పు సాధ్యం అయినపుడు, స్పందన, ఆలోచన, చైతన్యం ఉన్న మనుషులను మార్చడం ఏమంత కష్టమైన పని కాదు.
- జి గంగాధర్ సిర్ప,
9010330529