Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాన్సర్ వ్యాధిని గుర్తించడం, వైద్యం చేయడంలో శాస్త్రవేత్తలు, డాక్టర్లు కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నారు. 12 జూన్ 'సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్' జర్నల్ సంచిక క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో మానవుడు వేసిన మరో ముందడుగును తెలియజేస్తున్నది. కాన్సర్ కణాలు ఇతర అంగాలకు రక్తం ద్వారా వ్యాపించి హానిచేస్తాయి. వాటిని మొదటి దశలోనే గుర్తించి నాశనం చెయ్యకపోతే రోగి మరణిస్తాడు. అందుకనే రక్తంలో ఉన్న కాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసే లేసర్ ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఈ లేసర్ని వ్యాపార పరంగా పెద్ద ఎత్తున తయారుచేసి కాన్సర్ని గుర్తించడానికి ఇంకా కొంత కాలం పట్టవచ్చు. ఈ లేసర్ సంప్రదాయ పద్ధతుల కన్నా వెయ్యిరెట్లు సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. కాన్సర్ కణాలు ఉన్నాయా లేదా పరీక్షించడానికి రక్తాన్ని సేకరించడం సాధారణ విషయం. అయితే ఈ పరీక్షల్లో ఒక్కోసారి కాన్సర్ కణాలు ఉన్నా గుర్తించలేకపోతున్నారు. చివరికి వ్యాధి ముదిరిన తర్వాత గుర్తించడం కనిపిస్తుంది. మొదటి దశలోనే కాన్సర్ని గుర్తించి వైద్యం చేయడానికి ఈ లేసర్ ఎంతో ఉపయోగపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఆర్కన్సాస్ నానో మెడిసిన్ సెంటర్ డైరెక్టర్ వ్లదిమీర్ ఝరోవ్ అంటున్నారు.