Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుగంధం బట్టలో కడితే ఆ సువాసన వస్త్రానికీ పట్టుకుని ఉంటుంది. బహుశా అదే జరిగింది పెండెం గౌరీశంకర్ విషయంలో. ఈయన 1936లో ఘట్కేశర్లో పద్మశాలీ కుటుంబంలో జన్మించాడు. కానీ ఇతని తండ్రి చేనేత పరిశ్రమలో కాదు పనిచేసింది, ఒక మిఠాయి దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసేవాడు. వస్త్రం నేసే కులవృత్తి వెనుకే వుండిపోయింది. కానీ ఆ సంప్రదాయ కళాకారుల రంగుల అభిరుచి, డిజైన్ల పొందిక చేసే సౌందర్య పిపాస గౌరీశంకర్‌ని కళాకారుడిగా తీర్చిదిద్దింది.
మూడు, నాలుగు తరగతులు చదువుతున్నప్పుడు స్కూల్లో ఆర్ట్, డ్రాయింగ్ క్లాసుల్లో డ్రాయింగ్లు వేసేవాడు. క్లాస్‌లో పూర్తికాకపోతే రాత్రిపూట పూర్తి చేసి తర్వాతిరోజు స్కూల్లో టీచర్‌కి చూపేవాడు. తనంతట తానుగా కూడా బొమ్మలు వేయాలనే గౌరీశంకర్ ఆసక్తి చూసిన టీచర్ అతడిని చాలా ప్రోత్సహించారు. ఇంటి ఆర్థిక పరిస్థితులే కావచ్చు, చదువు మీదున్న శ్రద్ధాశ్రద్దలే కావచ్చు... ఆరవ తరగతి, ఎనిమిదవ తరగతుల్లో రెండు సార్లూ స్కూల్ వదలవలసి వచ్చింది. అప్పుడు వారి మిఠాయి దుకాణంలో కూర్చుని కూడా చుట్టుపక్కల మనుషులూ పరిసరాలపై డ్రాయింగ్లు వేసేవాడు. ఈ మధ్యలో ఏడవ తరగతిలో ఒక స్టిల్ లైఫ్ డ్రాయింగ్ వేసినప్పుడు ఆలిండియా అవార్డ్ కూడా వచ్చింది. అది మరింత ప్రోత్సాహమే కదా!
వివేకవర్ధని స్కూల్లో సాయంత్రాలు డోంగ్రే గారి వద్ద డ్రాయింగ్, పెయింటింగ్ నేర్చుకున్నాడు. డ్రాయింగ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్ష పాసయ్యాడు. ఆపై జె.జె.ఎస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ముంబాయిలో 1961లో డిప్లొమా, 1962లో జె.ఎన్.టి.యు. హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో అడ్వాన్స్ డిప్లొమా, ఆపై ఆంధ్ర ప్రదేశ్ లలిత కళా వారి ఫెలోషిప్ పై బరోడాలో 1963-64లో గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్లో స్పెషలైజేషన్ చేశారు కె.జి.సుబ్రహ్మణ్యన్గారి గురుత్వంలో. తర్వాత జె.ఎన్.టి.యు హైదరాబాద్ ఫైన్ఆర్ట్స్ కాలేజీలో 29 సంవత్సరాలు టీచింగ్ చేశారు.
ఏం చదివారు, ఏం చేశారు అనే క్రమ సంఖ్య రాయడం ముఖ్యోద్దేశం కాదు, తన చదువుకోసం ఆ కళాకారుడు ఎక్కడెక్కడ ధ్యానం పెట్టాడు, ఏం నేర్చుకునే అవకాశం దొరికిందో ఇందువలన విశదం అవుతుంది. వివిధ రకాల అభ్యాసాలు, గురువుల పాఠాలు, వివిధ ప్రదేశాలలో చదువులబ్బటం వల్ల కావచ్చు, గౌరీశంకర్ పనిలోనూ ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఎంతో ప్రయోగాత్మకంగా పనిచేస్తూ ముందుకు నడిచాడనేది ఈయన చిత్రాలు చూసిన వెంటనే అర్థం అయ్యే విషయం. మీడియం, టెక్నిక్ మార్పులే కాదు, చిత్రం కూర్చే ఆలోచనా విధానంలోనూ ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి.
డ్రాయింగ్ అనేది మనసులోని ఆలోచనలకు కాగితంపై గీతలు గీసి ఆకారం ఇస్తుంది. ఆపై ఆ డ్రాయింగ్‌ని చిత్రం కాంపొజిషన్గా దిద్ది ఆలోచనల భావనలకు రూపం ఇస్తారు కళాకారులు. కానీ ఈయన డ్రాయింగ్లు కూడా భావాల రూపాలను చూపించగలుగుతాయి. నగ చిత్రాలు అనే భావన భాహ్యంగా కనిపించినా, తరచి చూస్తే అర్థం అవుతుంది... నలుపు తెలుపు డ్రాయింగ్ల వంటి చిత్రాలు నిజాన్ని అతి దగ్గరగా చెప్పటానికి వేసిన ప్రయత్నమని.
బింద్రే, హెబ్బర్, యూరోపియన్ మాస్టర్ ఆర్టిస్ట్‌ల వంటి ఎంతోమంది గొప్ప కళాకారుల చిత్రాలు అధ్యయనం చేసేవారు గౌరీశంకర్. పికాసో పద్ధతులై క్యూబిజమ్, ఎక్స్ప్రెషనిజమ్... ఈ రెంటి పద్ధతులనూ తన కళాపద్ధతిలో వాడి ఎంతో గొప్ప కంపోజిషన్లు తయారు చేశారు. అందుకు ఉదాహరణ 'ఉమెన్ గాసిపింగ్' అనే గ్రాఫిక్ పెయింటింగ్. పికాసో చిత్ర పద్ధతికి అది దగ్గరగా కనిపిస్తుంది. పికాసో చిత్రం, ప్రపంచ యుద్ధ మారణహౌమ లోతులను తాక ప్రయత్నిస్తే, ఇతను ఆ చిత్రాన్ని గుర్తు తెస్తూనే స్త్రీ సంభాషణల తేలిక సందర్భాన్ని అంతే సుందరంగా చూపగలిగారు. అంతటి విషాద చిత్రాన్ని మార్చి కులాసా కబుర్ల చిత్రంగా చూపగలిగారు.
'ద ఫ్యామిలీ' అనే లిథోగ్రఫీ పెయింట్ క్యూబిజమ్లో చేసిన మరో పరిశోధన. ఫ్యామిలీ అని మనం తల్లీ, దండ్రీ, బిడ్డల రూపాలు వెతక ప్రయత్నిస్తే కొంతసేపు అవునో కాదో అర్థం కాని అయోమయంలో పడాలి. కానీ క్యూబ్‌ల ఆకారాల్లో చూపించే స్త్రీ, పురుషుడు, కుటుంబం అనుబంధాన్ని అబ్స్ట్రాక్ట్ ఆర్ట్గానూ, వారి బంధాలను చూపే ఎక్స్ప్రెషనిస్ట్ ఆర్ట్గానూ, వీటన్నిటి కలయికగానూ చూస్తే మనకు మనసు సంతోషపడుతుంది.
3 రిడెస్ అనే రిక్షా చిత్రమూ ఈ కోవకు చెందినదే. 'బనారస్ ఘాట్, బరోడా న్యాయమందిర్' అని చేసిన వుడ్‌కట్ చిత్రాల్లో ఇతనికి టెక్చర్ మీద వున్న మక్కువ అర్థమవుతుంది. బరోడాలో నేర్చుకున్న ఇంపాస్టో టెక్నిక్‌తో చేసిన చిత్రాల్లో టెక్చర్‌ని మరింత ముందుకు తీసుకెళ్ళారు. అలాగే 'నేచర్ ఎవల్యూషన్', 'సైలెన్స్ వరల్డ్', 'స్నో అండ్ వెజిటేషన్ ఆన్ మౌంటెన్స్' వంటి చిత్రాల్లో అలౌకిక విషయ వివరణ కనిపిస్తుంది.
మనసులో వున్న ఆలోచనకి రూపం ఇవ్వటం మొదలుపెడితే, మనసులో రూపం అందని ఆలోచనలనీ బయటకి తెస్తాయి. ఈ రెంటి సంగమంలో మరిన్ని రూపాలు అనుకోకుండా తారసపడతాయి. గౌరీశంకర్ జీవితాన్ని, చిత్రాన్నీ మూడు దశల్లో చూస్తారు. డార్క్, మీడియం, లైట్ రంగుల్లో; బాల్యం, యవ్వనం, వృద్దాప్యంగానూ! గ్రాఫిక్ పెయింట్ మేకింగ్‌లో రంగుల్లో ప్రింట్ మేకింగ్ చేయటం చాలా కష్టం. అనుకున్న భావానికి అనుగుణంగా రంగుల ప్రింట్లు తీయగలరు గౌరీశంకర్.
జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలిచ్చి, అవార్డులు అందుకున్నారు. ప్రొఫెసర్ ఆఫ్ ఎమిరిటస్‌గా గుర్తించిన స్థాయికి ఎదిగిన ఇతను ఎన్నో చిత్రాలు, డ్రాయింగ్లు, ప్రింట్ మేకింగ్ చేశారు. అస్వస్థత వలన ప్రింట్ మేకింగ్ చేయలేకపోయినా, ఈ హైదరాబాద్ వాస్తవ్యులు ఇంకా చిత్రాలు వేస్తూనే వున్నారు.
- డా||ఎం.బాలామణి,
81067 13356