Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మమ్మల్ని ఆలోచింప చేసింది
సోపతి లో 'అంతరంగం' శీర్షిక ఎంతో ఆలోచింప చేస్తున్నది. నిజజీవితంలో జరుగుతున్న అంశాలను ఇస్తున్నారు. ఇక 'బస్తీ బతుకులు' కవర్ స్టోరీలో బడుగు జీవులు జీవితాన్ని కొనసాగిస్తున్న తీరు చూసి బాధేసింది. భిన్నత్వంలో ఏకత్వానికి రాజధాని నిలయం అనిపిస్తుంది. పుట్టిన ఊరును వదలి పొట్టకూటికోసం వచ్చినవారి జీవన కథలు తెలిపిన కవర్ స్టోరీ బాగున్నది.
- సయ్యద్ షఫీ, హన్మకొండ
ఆత్మవిమర్శ చేసుకోవాలి
డబుల్ బెడ్ రూం లకు బదులు ఆకాశహర్మ్యాలను వారికి కట్టిచ్చిన విషయం తెలిసి వాపోయిన ఓటర్ ఎమ్మెల్యేను నిలదీసిన కార్టూన్ సమయా నుకూలంగా ఉన్నది. అది ప్రజా వాణి. మన మాటలకు, చేతలకు మధ్య అంతరం చెరిగిపోవాలంటే పదునైన, వెంటాడే నాలుగు వాక్యాలు కవులు, రచయితలు రాయాలి. అవి చదువరులలో కదలికలు తేవాలి... అని 'అంతరంగం' చేసిన సూచన చదివిన వారు ఆత్మవిమర్శ చేసుకుంటే అదే పదివేలు. పదవీ ప్రమాణస్వీకారోత్సవాన్ని, నాటి (నేటి) రాజుల పట్టాభిషేకంతో పోల్చి, రాజ మార్తాండ, లాంటి నాటి భజనలు నేటి ''మీడియా '' చేస్తున్నది అని చింతపట్ల వారు మీడియాను వాయించిన వైనం గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే!బస్తీ బతుకుల గురించిన కవర్ స్టోరీ చదివి .. ఎక్కడైనా ఆధిపత్య కులాలదే అధిపత్యమని తెలిసి తెల్లబోయాము. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అక్కడ నివాసముంటున్న సంగతి తెలిసి పేదరికానికి అందరూ సమానమే అనిపించింది. మురికివాడల వాసుల గురించి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల గురించి వివరించనందున, ఈ వ్యాసం సమతూకం పాటించలేదు అని తోచింది.
- పంజాల నరసయ్య; ఈసీఐల్, హైదరాబాద్
కొత్తకోణంలో రాశారు
'బస్తీబతుకులు' కవర్ స్టోరీ చాలా బాగున్నది. ఎవరూ రాయని కోణంలో రాశారు. సిటీ స్లమ్స్‌లో ఉండేవారి జీవన విధానం, వారి సమస్యలు,, సంస్కృతిని అద్భుతంగా విశ్లేషించారు.
-వేముగంటి రఘునందన్, సిద్ధిపేట; పగిడిపల్లి సురేందర్, హైదరాబాదు; శంకరరావు, భద్రాచలం
రఘురాం జీవితం తెలిసింది
పేరెన్నిక గన్న తెలంగాణ కళాకారుల్లో ఒకరైన బైరు రఘురాంతో సంభాషణ ఎన్నో విశేషాలు తెలియజేసింది. ముఖ్యంగా ఆయన చిత్రాలు గడిచిన కాలంలో హైదరాబాదు ఎట్లా ఉండేదో తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ స్థాయికి చేరుకోవాలనుకునే వారికి ఆయన జీవితం మంచి గైడ్లాంటిదని చెప్పవచ్చు. హ్యూమన్ ఎనాటమీ పై పట్టు సాధిస్తే మనుషుల శరీరావయవాలు, ముఖ కవళికలను సహజంగా చిత్రించవచ్చని ఆయన చిత్రాలు చెబుతున్నాయి. కవర్ స్టోరీ కూడా చాలా బాగున్నది. బస్తీల కల్చర్ ఎట్లా ప్రభావితమవుతున్నదో తెలిపిన రచయితకు ధన్యవాదాలు.
- కె.విజయ, ఖమ్మం