Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బస్సు ఎప్పట్లాగే దిగే జనాల్ని దింపుతూ ఎక్కే జనాల్ని ఎక్కించుకుంటూ వెళ్తోంది. ప్రయాణీకులకి టిక్కెట్లిస్తూ ముందుకు వస్తోంది కండక్టర్ వాణి. సీట్లలో కూర్చున్నవాళ్ళంతా ఎవరి సెల్లులో వాళ్ళున్నారు. రజిత, గిరిధర్‌లు మాత్రం వేరే లోకంలో ఉన్నారు. ఆ బస్సెక్కేవాళ్ళలో ముచ్చటగొలిపే ఆ జంటని చూస్తే వాణికి కన్నుల పండుగలా ఉంటుంది. అందుకే వారివైపు అభినందనపూర్వకంగా చూస్తూ పలకరింపుగా నవ్వింది వాణి.
ఎప్పట్లాగే ఆ జంట ప్రేమగా లెక్కలు చెప్పుకుంటున్నారు.
''ఎంత కష్టపడ్డా జీతం మాత్రం పెరగదు. జీతం పెరగలేదని ఖర్చులు పెరక్కుండా ఉంటాయా? ఈనెల బాబు టరం ఫీజు ముప్పైవేలు కట్టాలి''
''నీ దగ్గర ఎంతుంది?''
''ఇరవైవేలు''
''మిగిలిన పది నేను నీ ఎక్కౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. దీనికేంటింతగా ఆలోచిస్తున్నావు? ఎవరి జీతాలు వాళ్ళవైనంత మాత్రాన ఎవరి జీవితాలు వాళ్ళవి కాదుగా?'' అంటూ సెల్ తీసుకుని రజిత ఎక్కౌంట్లోకి ఇరవై వేలు ట్రాన్స్ఫర్ చేశాడు గిరిధర్.
''థాంక్స్'' అంటూ అతని భుజంమీద వాలిపోయింది రజిత.
ఆ తరవాత ఇద్దరూ నవదంపతులైపోయారు.
బస్సుల్లో కొంతమంది కొత్తదంపతుల ప్రవర్తన చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. అందులోనూ నడివయసు దంపతుల ప్రేమైతే మరీ విపరీతంగా ఉంటుంది. అయినా సరే, భరించక తప్పదు. కానీ, వీళ్ళు మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నదానికి రోల్ మోడల్స్ అనుకుంటూ ఇద్దరి పాసులూ చెక్ చేసి ముందుకి వెళ్ళిపోయింది వాణి. ఆమెకి వీర ప్రేమ దంపతులు షిఫ్టుకి కనీసం పాతికమందైనా తగుల్తూనే ఉంటారు. మొగుడూ పెళ్ళాలిద్దరూ ఉద్యోగాలు చేస్తే వచ్చే మొదటి సమస్య ఇదే. ఉన్న సమయమంతా ఉద్యోగానికే సరిపోతుంది. కాబట్టీ ప్రేమించుకోవడానికి తీరికుండదు. దాంతో బస్సుప్రయాణాల్లోనూ, సినిమాథియేటర్లలోనూ ఇలా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ప్రేమంతా ఒలకబోసుకుంటూ ఉంటారు. వాళ్ళ బులబాటమూ వాళ్ళ రందీ వాళ్ళదే గానీ చుట్టూ ఉన్నవాళ్ళేమనుకుంటారోరని ఏమాత్రం పట్టించుకోరు. వాళ్ళావిధంగా ఒంటిమీద స్పృహలేకుండా ప్రేమించుకోవటం వల్లే చూపరులకి ఉచిత వినోదం లభిస్తూంటుంది.
''రేపు సెకండ్ సాటర్ డే కదా, నీకూ సెలవు. నాకూ సెలవు''
''ఐతే ఏం చేద్దాం?
''సిన్మాకెళ్దాం''
''ఏ సిన్మా''
''ఏదైతే ఏంటి? మనం వెళ్ళేది సిన్మాకేగానీ చూడ్డానిక్కాదుగా?'' తన మాటలు ఎవరూ వినలేదనుకున్నాడు గిరిధర్. కానీ అతని మాటలకి కిసుక్కుమంది వాణి.
అది గిరిధర్ కంట పడింది. దాంతో కన్నంలో తేలు కుట్టిన దొంగలాగైంది అతని పరిస్థితి.
అంతలోనే బస్సులో ఎక్కిందొక నడివయసు స్త్రీ. ఎక్కీ ఎక్కగానే తిన్నగా గిరిధర్ దగ్గరకి వెళ్ళింది. ''దీంతో మీకేం పని?'' అంటూ గిరిధర్ని పైకి లేపింది. ''నీకు నా మొగుడు తప్ప ఇంకెవరూ దొరకలేదేంటే రండా'' అంటూ రజిత చెంప పగలగొట్టి, గిరిధర్ని బరబరా లాక్కుపోయింది.
దాంతో అందరికీ పరిస్థితి అర్థమైపోయి రజిత గురించి అత్యుత్సాహంతో ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పుకోవడం మొదలెట్టేశారు. కానీ వాణి మాత్రం ఆలోచనలో పడిపోయింది. ఆమెకి అర్థం కానిదొక్కటే... తప్పు చేసిందావిడ మొగుడైతే పాపం ఈవిడ చెంప ఎందుకు ఎందుకు పగిలింది?
- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి