Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాకాసి జంతువులు, రాబందులు నివసించే మహావృక్షాలు, వింతైన జలచరాలు, చిన్న చేపలని మింగే పెద్ద చేపలూ వుంటాయని విన్నాం. మనం నివసించే ప్రకృతిలో మన చుట్టుపక్కల ఇవి కనపడకపోవచ్చు. ఒకవేళ ఇవి మహాఅడవుల్లో వుంటాయని చెబితే నమ్మాలి మనం. జంతువు, మనిషి, రాబందుల వంటి పక్షి ఆకారాలు కలబోసిన కొన్ని భీకర ఆకారాల గురించి మన పురాణ కథలూ చెపుతాయి.
మన చుట్టుపక్కల ప్రకృతిని చూసి అందమైన పూలు, ఆకులతో పాటు ఇలాంటి ప్రత్యక్షంగా కనిపించని జీవరాశుల గురించి ఆలోచించడం గౌరీ వేములకు మంచినీటి ప్రాయం. 1972లో, కర్నాటక హుబ్లీలో జన్మించిన ఈమె, ప్రస్తుతం హైదరాబాద్ వాస్తవ్యురాలు. హుబ్లీలో లలిత కళా మహావిద్యాలయంలో డ్రాయింగ్ సర్టిఫికెట్ పొంది, హైదరాబాద్ జె.ఎన్.టి.యు ఫైన్ ఆర్ట్స్ కాలేజీ డిప్లొమా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఎఫ్.ఎ.లో గ్రాఫిక్ ఆర్ట్‌లో శిక్షణ పొందింది. గ్రాఫిక్ ప్రింట్ మేకింగ్ నేర్చుకోవటానికి కావలసిన ఒక ముఖ్యగుణం చక్కటి డ్రాయింగ్ చేయగలగటం. అది ఈమెకు పుష్కలంగా వుంది. అంతేకాదు, ప్రింట్ మేకింగ్‌లో రంగుల్లో ప్రింట్లు తీయటమూ కష్టమే. తెలుపు నలుపు రంగుల ప్రింట్లూ, రంగుల ప్రింట్లు అంతే సునిశితంగా తీయగలదు ఈమె.
ఆమె ప్రతీ చిత్రంలోనూ వింతవింత ఆకారాలు కనిపిస్తాయి. స్త్రీ ఆకారం పక్షిలా మారి గూటిలోని గుడ్లని పరీక్షించి లెక్క చూసుకుంటుంది. ఒక మహావృక్షం నాలుగు కాళ్ళ జంతువులా మారి తీక్షణంగా గమనిస్తూ వుంటుంది. చెట్టుపై సీతాకోక చిలుక ఆకుల మధ్య నుండి జంతువుని చూసి దాక్కుంటుంది. ఈమె చిత్రాల్లో ప్రకృతి, జీవరాశులు ఒక వింత ప్రపంచపు అంతు తెలియని కథలు కనిపిస్తాయి. నిద్రలో మనం ఏవో కలలు చూస్తాం. అందులోని ఆకారాలు, సంఘటనలు నిద్ర లేచాక గుర్తు తెలియవు. బహుశా ఈమె చిత్రాలు ఆ కలలోని ఆకారాలు కావచ్చు, లేదా మరచి పోదామన్నా మరచిపోలేని కొన్ని మంచి, చెడు సంఘటనల భావాలకు ప్రతిరూపాలవచ్చు. నిజమనీ, అబద్దమనీ రెండూ నమ్మలేం. చిన్ననాటి కాకమ్మ, పిచుకమ్మ కథల్లోని జీవితాలకి సరిపడ కొన్ని సత్యాసత్యాలు విని వున్నాం. ఈమె చిత్రాల్లోని రూపాలు చూశాక... అలాంటి కథలకు రూపాలివి అనిపిస్తుంది.
ఈమె ఎన్నో గ్రూప్ ఎగ్జిబిషన్స్‌లో పాల్గొంది. అందులో ముఖ్యమైనది 2002లో 25వ భోపాల్ బీన్నాలే ఆఫ్ ప్రింట్. అలాగే అమెరికా, కెనడా, దుబారులోనూ ప్రదర్శనల్లో పాల్గొంది. ఎ.ఐ.ఎఫ్.ఎ.సి.ఎస్ అవార్డ్, అవంతి కళా పరిక్రమ అవార్డ్, తిలక్ స్మారక్ అవార్డ్, ప్రఫుల్లా దహనుకార్ అవార్డ్ వంటివి ఈమె ఖాతాలో వున్నాయి. జాతీయ, అంతర్జాతీయ కలెక్షన్లలో ఈమె ప్రింట్లు వున్నాయి.
- డా||ఎం.బాలామణి,
81067 13356