Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దగ్గర క్రీడలకు ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తాం. కానీ చెంపదెబ్బలకు ఛాంపియన్షిప్ పెట్టడం ఎక్కడైనా విన్నారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమేనండి. చెంపదెబ్బలకూ ఒక ఛాంపియన్షిప్ ఉంది. ఈ వింత టోర్నీ రష్యాలోని క్రాస్నోయార్క్ పట్టణంలో నిర్వహిస్తుంటారు. ప్రత్యేకించి వారాంతపు రోజుల్లో రెండు రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతుంది. అన్ని ఆటల పోటీల్లానే దీనికి రూల్స్ ఉంటాయి. గెలిచిన వారికి బహుమతులుంటాయి. విజేతలు పొందే బహుమతులు కూడా చిన్నవేం కాదు. వేల రూపాయలు సొంతం చేసుకోవచ్చు. మూడే మూడు చెంపదెబ్బలు నిర్ణయిస్తాయి ఓడెదెవెరో గెలిచేదెవరో. మరి ఈ ఛాంపియన్షిప్ విశేషాలేంటో తెలుసుకుందామా.. తల్లిదండ్రులైనా, సోదరులైనా, స్నేహితులైనా, బంధువులైనా... చెంప మీద ఒక్క దెబ్బ కొడితే చాలు ఎవరికైనా కోపం నషాళానికంటుతుంది. ముక్కూ మొహం తెలియనివారైతే ఇంక చెప్పేందుకేముంది. మరుక్షణం వాళ్ల చెంపకూడా ఛెళ్లుమంటుంది. కానీ రష్యాలో నిర్వహించే చెంపదెబ్బల పోటీలో మాత్రం ఎదుటివాళ్లు చెంపమీద చాచిపెట్టికొట్టినా, బాధనీ, కోపాన్నీ పంటిబిగువున ఒత్తిపెట్టి అలాగే నిలబడాలి. అలా నిలబడిగలిగినవాళ్లే ఈ టోర్నమెంట్ విజేతలుగా నిలిచి ఔరా అనిపించుకుని ఆశ్చర్యపరుస్తారు. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటే ఇదే మరి.
- పుప్పాల