Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫేస్ బుక్ కబుర్లు
కవితకేదీ కాదు అనర్హం అన్నట్టు, విడాకులకేదీ కాదు అకారణం అనిపించింది. పబ్జీ ఆడవద్దన్న మొగుడి నుండి విడాకులు కోరిన భార్య గడుసుతనం గురించి 'ఫేస్బుక్ కబుర్లు' శీర్షికలో చదివి. భర్తలు జర జాగ్రత్త! నేటి చదువులు సంస్కారం నేర్పినచో సమాజంలో జరుగుతున్న అరాచకాలకు చెక్ పెట్టొచ్చు. పిల్లల పెంపకంలో కన్నవారు శ్రద్ధ కనబరిస్తే, వారిని సంస్కార వంతులుగా తీర్చి దిద్దవచ్చు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న అనుచిత కార్యక్రమాలకు సర్కార్ వారు అడ్డుకట్ట వేస్తే వాటి ప్రభావం నుండి యువతను రక్షించవచ్చు .. అనే సంగతులు ఈ వారం 'అంతరంగం' అందించింది. కాదనే వారెవరూ? జపాన్ అభివృద్ధి మంత్రం 'కై జెన్' కావున దానిని అభివృద్ధి కాముక దేశాలు పాటిస్తే బాగుంటుంది. మల్లేశం సినిమా సమీక్ష ఆకట్టుకుంది. అవకాశం దొరికితే రెచ్చిపోయే దర్శకులు, నటులు, నటీ మణులు మనలో ఉన్నారనే నిజం ఈ సమీక్ష మన ముందుంచింది. ''ఎవరు?'' అనే కథ ముగింపు ఊహకంద లేదు. మూస కథలకు భిన్నంగా ఉన్నది. నెమలీక .. కథ చదివిన తరువాత ఒక సందేహము కలిగింది. కుందేలు నిజంగా అంత తెలివిగల జంతువా? అని.
- పంజాల నరసయ్య, ఈసిఐఎల్, హైదరాబాదు
అంతరంగం బాగున్నది
ఈ వారం 'అంతరంగం'లో సంస్కారం గురించి రాశారు. బాగున్నది.సంస్కారం అనునది మనిషికి అద్దం లాటింది. సమాజంలో సంస్కారం కలిగిన వ్యక్తి విలువ పెరుగుతుంది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు వుండేవి. పిల్లలు అమ్మమ్మ, తాతయ్య మధ్యలో సంస్కారం నేర్చుకునేవారు. అలాంటి ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు అయ్యాయి. నిద్ర లేమితో మనం వ్యాధులను కొనితెచ్చుకుంటున్నాం. నేడు పిల్లల నుండి పెద్దల వరకు వినోదం, విలాసాలకు అలవాటు పడి అనారోగ్యం బారిన పడుతున్నారు.
- సయ్యద్ షఫీ, హన్మకొండ
సమాజం ఎటు పోతోంది?
మానవ సమాజం ఎటువైపు వెళుతున్నదో అర్థం కావడంలేదు. ఒకప్పుడు కాయకష్టం చేసి గంత తిండి తిని పండుకుంటే తెల్లారిందాక మెలకువ వచ్చేది కాదు. ఇప్పుడు మనుషులు చేసే పనులు యంత్రాలు చేస్తున్నాయి. శారీరక శ్రమ స్థానంలో మానసిక శ్రమ ఎక్కువయింది. ఒత్తిడి, ఆరాటం మనిషికి నిద్రను దూరం చేస్తున్నాయి. జీవితం ఆధునికతను సంతరించుకునే కొద్దీ మనిషి నిద్రకు మరింత దూరమవుతున్నాడని అర్థమవుతున్నది. ఈ వారం కవర్ స్టోరీ ఆధునిక యుగ మానవుడు నిద్రాదేవికి ఎట్లా దూరమవుతున్నాడు, మంచి నిద్రకు మార్గాలేమిటి అన్న విషయాలను చక్కగా వివరించింది. అట్లాగే 'హాసవిలాసం'లోని జోక్స్ కడుపుబ్బ నవ్వించాయి.
- అర్చన, ఖమ్మం
మల్లేశం సమీక్ష...
మల్లేశం సినిమాపై వచ్చిన సమీక్షావ్యాసం మంచిగుంది. ఈ వ్యాస రచయిత రాసిన వ్యాసాలు చదువుతుంటే సినిమాలను ఎట్లా అర్థం చేసుకోవాలో బోధపడుతున్నది.
- వి.మనోహర్, నల్లగొండ