Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెట్ విమానం బయట నుండి తీసుకునే గాలి దాని లోపలి భాగంలో బాగా కుదించబడుతుంది. దాంతో ఆ గాలి ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. విమానంలోని ఇంధనం మండినప్పుడు పుట్టిన వేడివల్ల ఆ గాలి ఉష్ణోగ్రత 1500 డిగ్రీల సెల్సియస్ వరకు వుంటుంది. గాలి వేడి ఎక్కువవడం వల్ల బాగా ఒత్తిడికి లోనై టర్బైన్ గుండా విమానం వెనుక భాగానికి ప్రయాణిస్తుంది. తోక భాగంలో వుండే ఓ గొట్టం ద్వారా ఈ వేడిగాలి ఎక్కువ వేగంతోబయటకి వస్తుంది. ఇలా జెట్ విమానంలోంచి గాలి ఎంత వేగంగా బయటికి వస్తే, విమానం అంతే వేగంగా ముందుకు ప్రయాణిస్తుంది. అయితే... జెట్ విమానాలు ఎంత వేడిగాలిని వదిలిపెట్టినా... ఆ గాలిలో ఎక్కువ మొత్తంలో నీటి ఆవిరి వుంటుంది. వాతావరణంలో వుండే చల్లటి గాలికి ఈ నీటి ఆవిరి చల్లబడి, చిన్న చిన్న మంచు స్పటికాల్లా మారుతుంది. ఈ మంచు స్పటికాలే తెల్లని మేఘాల్లా కనిపిస్తుంటాయి. గాలిలో 8 కిలోమీటర్ల నుండి 12 కిలోమీటర్ల మధ్య వుండే పొర మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ వుంటుంది. జెట్ విమానాలు ఈ గాలి పొరల్లో ప్రయాణించినప్పుడు మాత్రమే తెల్లని మేఘంలాంటి ఆకారం కనిపిస్తుంది. ఈ పొరకు కిందగాని, పైన గాని అవి ప్రయాణించినప్పుడు ఈ పొర ఏర్పడదు.