Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్నించే స్వేచ్ఛ లేనప్పుడు...
ఫైళ్లు కొండంత పేరుకుపోయాయి. అవి ప్రజల జీవితాలు. వాటిని పక్కన పడేసి దేశ, విదేశాల్లోని గుళ్ళు గోపురాల లిస్ట్ తయారు చేస్తున్న ఉద్యోగి నిస్సహాయ స్థితిని ప్రతిబింబించే కార్టూన్ ఎన్నెన్నో అర్ధాలు చెప్పింది. వినేవారెవరురా? అనుకోవాలి కాబోలు. ప్రశ్నించే స్వేచ్ఛ, నిజాలు మాట్లాడే స్వేచ్ఛ మృగ్యమైనప్పుడు ప్రతి ఏడు జరుపుకునే స్వాతంత్య్ర వేడుకలు ఆనవాయితీ కాక మరేమిటీ అనే ప్రశ్నను 'అంతరంగం' లేవనెత్తి బుర్రకు మేత పెట్టింది. శాంతం, క్షమ, త్యాగం తదితర విషయాల గురించి హితబోధ చేయాల్సిన స్వాములు, రాజకీయ నాయకుల కోసం, సంపన్నుల కోసం సర్వ పరిత్యాగం చేస్తే ప్రజలను బ్రోచే వారెవరురా అనిపించింది. కాలుష్య రహిత, కల్తీ లేని సమాజమొక మిథ్య. ఎండమావి. కొండల్లో కోనల్లో ఉంటుందన్న 'చౌరస్తా' ఆలోచింప చేసింది. ప్రతివారూ కలలు కంటారని, పిల్లలు, చివరికి జంతువులు కూడా కలలు కంటాయని, కవర్ స్టోరీ చదివి గ్రహించాం. వాటికి అర్ధాలు, పదకోశాలు కూడా వుంటాయని చదివి అబ్బురపడ్డాం.
- పంజాల నరసయ్య, హైదరాబాద్
కలల అర్థాలు తెలిశాయి
కలలకు అర్థాలు ఉంటాయని తెలుసు. కాని ఏ కలకు ఏ అర్థమో తెలియదు. మీరు ప్రచురించిన కవర్ స్టోరీ కొన్ని కలలను అర్థం చేసుకునేలా ఉంది. సాధారణంగా వచ్చే కలల అర్థాలను ఈ వ్యాసం చక్కగా వివరించింది. ఫలానా కల వస్తే దీని అర్థం ఇది అని చెప్పారే కాని విశ్లేషించడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా అనే విషయం చెబితే బాగుండేది. 'హాసవిలాసం' జోక్స్ బాగుంటున్నాయి. అట్లాగే ఓ సామాన్యుని నుంచి గిఫ్ట్‌తో పాటు ఉత్తరాన్ని అందుకున్న పోలీస్ ఆఫీసర్ ఉదంతం కూడా నచ్చింది. మన పని మనం చేసుకుంటూ పోతే ప్రజలే గుర్తింపు ఇస్తారనడానికి ఇదొక ఉదాహరణ.
- మమత, ఖమ్మం
విశ్లేషణాత్మక వ్యాసం
కాశ్మీరు కేంద్రంగా చేసుకుని వచ్చిన సినిమాలను విశ్లేషిస్తూ... అవి ఏం పట్టించుకున్నాయో... ఏం పట్టించుకోలేదో చక్కగా వివరించారు వ్యాస రచయిత. కాశ్మీరీల అంతరంగాన్ని పట్టుకోవడంలో సినిమాలు ఎట్లా విఫలమయ్యాయో చెప్పిన తీరు బాగున్నది. ప్రభుత్వాలు వల్లెవేసే మాటలను సపోర్టు చేస్తూ వచ్చిన సినిమాలే అత్యధికం అనేది ఈ వ్యాసరచయిత అభిప్రాయం. అది నిజం కూడా. ఇందుకు కారణం ఏమిటి? సొంత గొంతుక, దృష్టితో సినిమా తీస్తే అవి ఆడతాయో, లేదో ననే భయమా... లేక వాస్తవాలను గ్రహించే చూపు సినిమా కెమెరాకి లేకపోవడమా అనేది ఆలోచించాల్సిన సంగతి.
- వి.కిరణ్, సూర్యాపేట
మంచి సాహిత్యం
'సోపతి'లో వస్తున్న కథలు, కవితలు, గ్రంథ సమీక్షలు బాగుంటున్నాయి. షార్ట్ స్టోరీల నుంచి చాలా పెద్ద కథలవరకు... వైవిధ్యం ఉన్న వస్తువును చిత్రించే కథలు వేస్తున్నందుకు ధన్యవాదాలు. గ్రంథ సమీక్షకులు కూడా చాలా చక్కగా పుస్తకాలను సమీక్షిస్తున్నారు.
- శశిర, హైదరాబాద్