Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరావయవాలు అన్నీ సక్రమం గా ఉన్నా చాలామంది తమ పనులు తాము చేసుకోవటానికే బద్ధకం గా ఫీల్ అవుతారు. అటువంటి బద్ధకస్తులకు ఈ పదిహేడేళ్ల పాప ఎంతో స్ఫూర్తి నిస్తుంది. రెండు కాళ్లు, చేతులు పూర్తి స్థాయిలో లేకపోయినా తనదై శైలిలో ముందుకు దూసుకుపోతోంది.
కేరళ కోజికోడ్ వాసి అయిన అబ్దుల్ కరీం రెండవ కుమార్తె నూర్ జలీలా చిన్నతనం నుండి తన కాళ్ళు చేతులు మిగతావారి లాగా ఎందుకు లేవా అని ఆలోచిస్తూ ఉండేది. తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను మిగతా వారిలాగా తన కాళ్లు చేతులు ఎందుకు లేవని ప్రశ్నించింది. ఆమె పెద్దది అయ్యేటప్పటికి కాళ్లు చేతులు కూడా పెరుగుతాయని వారు సమాధాన పరిచారు. కానీ కాలక్రమంలో ఆమెకు తాను పుట్టుకతోనే ఇలా జన్మించానని, అందరిలా తనకు కాళ్ళు చేతులు ఉండవని అర్థమయింది. ఆ ఎరుకే చదువు, ఇతర కార్యకలాపాలపై మనసును నిమగం చేయడానికి తోడ్పడింది.
జలీలాకి పుట్టుకతోనే మోచేతుల కిందీ భాగం, మోకాళ్ల కిందిభాగం నిర్మాణం సరిగా లేదు. ఈ విధంగా కాళ్లు చేతులు ఉండి కూడా ఆమె వికలాంగురాలు గానే జీవించాల్సి వచ్చింది.
ప్రస్తుతం జలీలా వయసు పదిహేడేళ్లు. తాను మిగతా వాళ్ళ కంటే భిన్నమైన దానిని అని తనకు తెలుసు. తన వికలాంగత్వం తన కలలు నిజం చేసుకోవడం లో ఏమాత్రం అడ్డుకాదని ఆమె నిరూపించింది. ఇవాళ ఆమె కేవలం ఒక గాయకురాలు కాదు... పెయింటర్ గా, వయోలినిస్ట్ గా ఎంతో పేరును సొంతం చేసుకుంది.
కుటుంబ సభ్యులు ఆమె గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఆమెలో ఉన్న టాలెంట్ ని ముందుగా వారే గుర్తించారు. ఒకరోజు ఆమె సోదరి తన రికార్డ్ బుక్ ను ఇంట్లోనే మరచిపోయి కాలేజీకి వెళ్ళింది. దానిని చూసి జలీలా కలరింగ్ బుక్ అనుకుంది. అందులోని బొమ్మలకు కలర్ వేసింది.
దీన్ని చూసిన తల్లిదండ్రులు ఆమెను మందలించటానికి బదులు డ్రాయింగ్ పేపర్, క్రేయాన్స్, వాటర్ కలర్స్ ని తీసుకొచ్చి ఇచ్చారు. అప్పటి నుంచి చక చక పెయింటింగ్స్ వేయటంలో దూసుకుపోయింది. కొన్ని పెయింటింగ్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో కూడా ప్రదర్శితమయ్యాయి.
ఆమె ఏడో తరగతిలో ఉన్నప్పుడు వయోలిన్ వాయీద్యంలో కూడా ప్రావీణ్యం సంపాదించింది. వయోలిన్ ని ఆమె సెల్లో లాగా తలకిందులుగా ఉంచి, ఒక ముంజేతికి బౌ ని హెయిర్ బ్యాండ్ తో పట్టి ఉంచేలా కట్టుకుంటుంది.
ఇంత చిన్నవయసులోనే జలీలా... అమెరికాకు చెందిన 'డ్రీమ్ ఆఫ్ యు ఎస్' అనే స్వచ్ఛంద సేవా సంస్థ తో కలిసి వికలాంగులను ఆదుకునేందుకు సేవాకార్యక్రమాలలో పాల్గొంటుంది.
ఆమె కలలకు అంతే లేదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ను దర్శించాలని, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని, ఇంగ్లీష్ ప్రొఫెసర్ అవ్వాలని లేదా ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఆమె అనుకుంటుంది.
ఈమధ్య ప్రముఖ గాయని చిత్ర తో కలిసి ఓ వేదికపై పాటలు కూడా పాడింది.
తాను ఏమైతే ఇప్పటివరకు సాధించానో అది తన తల్లిదండ్రుల చలవ, ప్రోత్సాహం వల్లనే అని జలీలా అన్నది. నేను కాళ్లు చేతులు లేకుండా పుట్టానని నాన్నతో చెప్పడానికి డాక్టర్లు సైతం సందేహించాట. కానీ నా తల్లిదండ్రులు నన్ను నన్ను గా స్వీకరించి అల్లారుముద్దుగా పెంచారు. ''నాన్న నన్ను మరోసారి చూడకూడదు అనుకుంటే నేను జీవించి ఉండేదాన్ని కాదు. జీవించాను అంటే ఒక లేబరేటరీ లోని మ్మ్యూజియం పీస్ లా ఉండాలి కదా'' అంటూ ఆమె ఓ మలయాళీ న్యూస్ పోర్టల్ తో అన్నది.
నిజంగా జలీలా ఈ ప్రపంచమనే మ్యూజియంలో తిరుగాడె ఓ అద్భుతం. ముందు ముందు ఆమె ఎన్ని ఘన విజయాలు సాధిస్తుందో చూడాలి.