Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విభిన్న వైరుధ్యాలతో కూడిన బతుకు క్లిష్టతను 'అంతరంగం' ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. అమాయకత్వం, లౌక్యం జీవన సూత్రాలుగా చేసుకొని బతికితే బతుకు బండి లాగడం సులభం కాదు. లోకులు కాకులు. వారిని డోంట్ కేర్ అని బతుకడానికి దమ్ముండాలి. ఫేస్బుక్ కబుర్లు చదివి వివాహ వ్యవస్థ కష్టకాలంలో వున్నట్టుగా గమనించడమైనది. మునుగుతున్న వాణ్ణి గట్టుపైకి తేవడం పక్కన పెట్టి టీవీ వాళ్ళు వీడియో తీసి ప్రత్యక్ష ప్రసారం చేయడం క్రూరం. సంబంధిత ఉద్యోగి యక్ష ప్రశ్నలడిగి తన ప్రజా వ్యతిరేక బుద్ధిని చాటుకోవడం బాధించింది (చౌరస్తా). కవర్ స్టోరీ రక్షణ దళాల గురించి చాలా ప్రశ్నలు తెర మీదికి తెచ్చింది. చర్చల, అభిప్రాయ సేకరణ దశలో సిడిఎస్ పదవి సృష్టి వున్నందున అప్పుడే ఎటువంటి నిర్ణయానికి రాలేము. కొన్ని గంటల్లో బ్రిడ్జి నిర్మించుకున్న గ్రామస్తుల గురించిన కథనం తీవ్రంగా ఆలోచింప చేసింది. ప్రజలు ప్రజల కొరకు ప్రజల డబ్బుతో అలకగా సాధించిన విజయమిది. ఇది ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది. అమోర్ సినిమా కథ కొత్తగా ఉన్నది. మరణమే భార్యకు ముక్తి అని భావించిన భర్త ఆమెను కడతేర్చడం సమాజ వ్యతిరేక చర్య. చట్టవ్యతిరేకమైన నిర్ణయం కదా?
- పంజాల నరసయ్య, హైదరాబాదు
అనుమానం సబబే
ఈవారం కవర్ స్టోరీ 'రక్షణ దళాల పయనం ఎటువైపు' కొత్త కోణాలను ఆవిష్కరించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి సృష్టి వెనక ఉన్న ఎజెండాను అనుమానించేలా చేసింది. నెహ్రూ దార్శనికత ఎంత గొప్పదో ఈ స్టోరీ చదివితే తెలుస్తుంది. ఆయన అనుమానించినట్లే జనరల్ కరియప్ప ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సిడిఎస్ నియామకం అత్యంత ప్రమాదకర పలితాలను ఇస్తుందేమో అని భయం కలుగుతుంది. హిట్లర్, ముస్సోలిని వంటి నిరంకుశులు ప్రపంచవినాశనానికి కారకులుగా మారడానికి వారి చేతిలో సైనిక బలం కేంద్రీకృతం కావడమే అనే విషయం మరువకూడదు. బీజేపీ మైనారిటీల పట్ల చూపిస్తున్న వివక్ష,, 370 ఆర్టికల్ రద్దు వంటి విషయాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలను అనుమానించవలసి రావడం సబబే అనిపిస్తున్నది.
- విమల, నల్లగొండ
జోక్స్ బాగున్నాయి
తమ గ్రామాన్ని కలిపే వంతెన వరదలకు కొట్టుకు పోతే కొన్ని గంటల్లోనే తిరిగి నిర్మించుకోవడం ద్వారా బ్రాహ్మణ కెప్పిగే గ్రామస్థులు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. అట్లాగే చైనా మహిళ తన భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ 5 ఏళ్లు సేవ చేసి కోమా నుంచి మేలుకునేలా చేయడం ఆశ్చర్యపరిచింది. సినిమా విశ్లేషణ వ్యాసం ఆకట్టుకున్నది. అట్లాగే ఈవారం ఇచ్చిన జోక్స్ బాగానవ్వించాయి.
- కె.వినరుకుమార్, పెద్దపల్లి