Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాడిని చూస్తే చాలు నాకు మండుతుంది. ఎందుకంటే వాడు వాడు కాదు. వాడిని వాడనడానిక్కూడా నాకు నోర్రాదు. కానీ వాడు వాడే. వాడిని ఏమైనా అంటే చాలు మా రమణమూర్తికి కోపం వచ్చేస్తుంది. ఒక్కోసారి వాడిగురించి వీడిని కూడా తెగ తిట్టుకోవలసి వస్తుంటుంది.
ఈ రమణ మూర్తిగాడింట్లో అందరికీ నేనంటే ఇష్టం. వాడితో సహా. కానీ నాకు వాడు తప్ప అందరూ ఇష్టమే. ఈ మాయదారి ఇష్టం అనేది ఎందుకు పుడుతుందో ఎలా పుడుతుందో ఎవరికీ తెలియనట్లే ఈ మహమ్మారి అయిష్టం కూడా ఎప్పుడు పుండుతుందో, ఎవర్ని చూస్తే పుడుతుందో ఎవరికీ తెలీదు. అలాగే నాకు వాడిని చూస్తే మంట. అలాగని వాడు విశ్వాస హీనుడుగానీ కృతజ్ఞత లేనివాడుగానీ ప్రేమాభిమానాలు లేనివాడుగానీ కాడు.
నిజం చెప్పాలంటే మన రమణమూర్తిగాడింట్లో అందరికంటే వాడికి నేనంటేనే ఎక్కువ ఇష్టం. నన్నెంత ప్రేమగా చూస్తాడో. నన్ను చూసి ఎన్నెన్ని పిల్లమొగ్గలు వేస్తాడో. ఎన్నెన్ని నాటకాలాడతాడో. వాడి చూపుల భాష చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కోసారి ప్రేమగా చూస్తాడు. ఒక్కోసారి గోముగా చూస్తాడు. ఒక్కోసారి చిత్రంగా చూస్తాడు. కానీ ఎప్పుడూ కూడా నన్ను తన దగ్గరకి రమ్మంటున్నట్టుగానే చూస్తాడు. తన పక్కన కూర్చోమన్నట్టు చూస్తాడు. ఏదో రమ్మన్నాడు కదా అని దగ్గరకి వెళ్తే చాలు ఒక్కసారిగా మీదకి దూకుతాడు. చేతుల్ని గోకుతాడు. బుగ్గల్ని నాకుతాడు. ఇదేంట్రాబాబూ కుక్కలాగా అని కోప్పడ్డామనుకోండి రమణ మూర్తికి కోపం వచ్చేస్తుంది. బండబూతులు తిడతాడు. ఇంకా కోపం వస్తే కొడతాడు. మొడతాడు.
వీడి దెబ్బల కంటే వాడి గోకుడూ నాకుడే నయం. అందుకే రమణమూర్తిగాడింటికి వెళ్ళడమే తగ్గించేశాను. వారం లోపే రమణమూర్తిగాడికి విషయం అర్థమైపోయింది. అందుకే కాబోలు, తిన్నగా ఇంటికొచ్చేశాడు. నాతో బాటు మా ఆవిణ్ణీ పిల్లల్నీ కూడా లాక్కుపోయాడు. విషయం ఏమిట్రా అంటే చెప్పడు. వీడు మమ్మల్నందర్నీ కలిపి నట్టేట్లో ముంచే ప్లాన్లో ఉన్నట్టున్నాడని మొదట్లో కంగారు కలిగింది. తరవాత అనుమానం కలిగింది. ఇప్పుడు కలగడానికేమీ మిగల్లేదు. దాంతో వాడేం చేసినా మా ప్రాణాలు మాత్రం తియ్యడనే నమ్మకం అయితే ఉంది. కాబట్టీ అంతా వాడిమీదే భారం వేసి కార్లో కిక్కురుమనకుండా కుక్కిన పేనుల్లా పడున్నాం. వాళ్ళింటికెళ్ళాక చూద్దును కదా వాడి పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లు బ్రహ్మాండగా చేస్తున్నారు. ఎంట్రెన్సులో హేపీ బర్త్ డే బోర్డుంది. కాస్త ముందుకెళ్ళి చూస్తే లెక్కలేనన్ని కొత్త ముఖాలు. వాడితోబాటు వాళ్ళన్నయ్య, అక్కయ్య, బామ్మర్దీ, మాంగారు అమ్మా నాన్నా తాతయ్యా బామ్మా ఇలా ఎక్కడ చూసినా వాడి బంధుగణమే.
వాడంటే రమణమూర్తిగాడి చుట్టాలూ పక్కాలూ అనుకునేరు. కాదు కాదు, వాళ్ళందరూ వాడి చుట్టాలు. వాడొక్కణ్ణి చూస్తేనే నాకు అరికాలిమంట నెత్తికెక్కుతుంది. అలాంటిది వాడి ఫామిలీ మొత్తం ఒక్కసారిగా చూస్తూంటే నాకు కడుపులో దేవినంత ఆనందం కలుగుతోంది.
అంతలోనే మా చిన్నాడికో డౌటొచ్చింది. వాడికి సుస్సొచ్చినా డౌటొచ్చినా ఆపుకోలేడు. వీడనేది మా రమణమూర్తిగాడి చెవిలో పడిందంటే వాడు మా చిన్నాడి టెంకి పగలగొడతాడనే భయంతో వాడి నోరు మూసే లోపే కక్కేశాడా డౌటు, ''నాన్నా కుక్కలక్కూడా పుట్టిన్రోజులు చేస్తారా?''
- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి,
9440037258