Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు రోడ్డు ఎక్కడానికి వణికిపోతున్నవి. తప్పనిసరై వాహనం మీద రోడ్డు మీదికి వచ్చిన వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏ క్షణాన కొంపకొల్లేరవుతుందోనని భయంతో బిక్కచచ్చిపోతున్నారు.
సదానందం ముఖంలో ఆనందం ఏ మాత్రం లేకుండా బైక్ మీద ఆఫీసుకి బయలుదేరాడు. రోజూ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తల మీద ఆల్రెడీ క్రికెట్ గ్రౌండ్ తయారైంది. జట్టుమీద ఎప్పుడో ఆశ వదిలేసుకున్నాడు. కనక ఆ చింతలేదు కానీ పెరిగిపోయిన పెనాల్టీ ఏ టైంలో ఏ రూపంలో పిడుగులా తలమీద పడి మాడు పగిలిపోతుందేమోనన్న బెంగ వల్ల ముఖం మాడ్చుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బండి నడుపుతున్నాడు. రోడ్డుమీద ఏ పక్కనుంచి నడపాలో ఆ పక్కే బండి నడుపుతూ సిగల్లు ఆమడదూరం వుండగానే బండికి బ్రేకేసి నిలబడుతూ ఆఫీసుకి ఎప్పుడు చేరుకుందామా అని ఆందోళన పడుతూ వున్నాడు.
ఒక చోట సిగల్ కోపంగా ఎర్రమొగం పెట్టటంతో బ్రేకు పీక నొక్కాడు. బండి గప్‌చుప్‌గా నుంచుంది. అయితే 'బండి పక్కకు తీయి' అని ట్రాఫిక్ పోలీసు గద్దించడంతో ఉలిక్కిపడ్డాడు సదానందం. ఒళ్ళు చెమటతో తడిసిపోయింది. తను ఏ తప్పూ చేయలేదు. డాక్యుమెంట్లున్నాయి, లైసెన్సు కలదు. ఏమీ అవదు అని సర్దుకున్నాడు. అదే అడిగాడు.
'నేనేం చేశాను సార్' అన్న సదానందం వైపు కొరకొరా చూస్తూ గీత దాటావు అన్నాడు ట్రాఫిక్ జమాను. 'గీతా? ఏ గీత? ఎక్కడ గీత?' అన్నాడు సదానందం రోడ్డుని పరీక్షగా చూస్తూ.
గీత కనిపించడం లేదా. పెయింట్ చేసి చాలా రోజులయింది కదా, మలిగిపోయిందేమో. ఖచ్చితంగా ఇదిగో ఇక్కడ గీత వుండాలి. కనపడకపోతే అది వుండాల్సిన చోట వుందనుకుని ఆగాలి కానీ తమరు దాటేశారు. తమరు గీత దాటడం మాకు స్పష్టంగా కనిపిస్తున్నది. కట్టండి ఫైన్ అన్నాడు పోలీసు. ఆ ఫైన్ ఎంతో విన్న సదానందం సొమ్మసిల్లి పడిపోయాడు రోడ్డుమీద.
చిదానందం తలమీద హెల్మెట్టూ, పర్సులో కాగితాలూ అన్నీ వున్నా ఏ నిమిషానికి ఏమి జరుగునో అని భయపడుతూ రోడ్డంట వస్తున్నాడు బైక్ మీద. ఒకానొక చోట రోడ్డుకు అడ్డంగా ఓ టెంట్ నిలబడి ఉంది. అది రోడ్డు మొత్తం మూసేసింది. మీటింగ్ కోసమో ఈటింగ్ బాపతో తెలీదు కాని ఇప్పుడు ముందుకి పోవడం ఎలా అని ఆలోచిస్తూ కూచుంటే లాభం లేదని రోడ్డుకి ఓ పక్క వున్న గల్లీలో జొరబడ్డాడు. ఆ తర్వాత ఆ గల్లీ మరో గల్లీలోకి, అది ఇంకో గల్లీలోకి తీసుకుపోవడంతో పావు గంట తర్వాత మళ్ళీ మెయిన్‌రోడ్డు కనిపించింది. బతికావురా చిదానందం అనుకుంటూ అది ఏ మెయిన్ రోడ్డో తెలీకపోయినా కుడికి తిరగాలో ఎడమకి ఎక్కాలో తెలీక పోయినా రోడ్డొచ్చింది బాబూ రోడ్డొచ్చింది నాయనోరు అంటూ రోడ్డెక్కాడు. అంతే! ట్రాఫిక్ వాడు ఇకిలిస్తూ ఎదురొచ్చాడు. 'రోకో' అని రంకె వేశాడు. ఇందాక బతికావురా చిదానందా అనుకున్న వాడిప్పుడు చచ్చావురా చిదానందా అనుకోవలసి వచ్చింది. రాంగ్ రూట్లో వచ్చావు. కట్టు ఫైన్ అన్నాడు ట్రాఫిక్కువాడు. అక్కడెక్కడో రోడ్డుకి అడ్డంగా టెంట్ వుందని చచ్చీచెడి చావు తప్పి కన్నులొట్టబోయి ఇటువస్తే రాంగు రూటా? మరి ఆ టెంటు వేసినవాడిదేరూటు. ఆ టెంటు కారణంగా ఇటు వచ్చినవాళ్ళందరి పని గోవిందో గోవిందేనా అని భోరున ఏడ్చాడు చిదానందం.
నిత్యానందం ఎలాగైతేనేం చివరికి తను చేరాల్సిన చోటికి చేరానని మురిసిపోయాడు. కానీ ఆ వెంటనే వెలవెలబోయాడు. కారు పార్కింగ్‌కి చోటేలేదు. తెల్లమొగం వేసుకుని కారుని కదిలించాడు ముందుకి. పార్కింగ్ కోసం డేగ కళ్ళతో వెదుక్కుంటూ బయలుదేరిన నిత్యానందానికి ఐదుమైళ్ళ తర్వాత ఒక నిర్జన ప్రదేశం కనిపించి చుట్టుపక్కల ఎక్కడా ప్రమాదం సూచించే బోర్డు లేవీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుని కారు పార్కు చేసి చెమట్లు కక్కుతూ వెనక్కి నడిచొచ్చి మళ్ళీ చెమట్లు కారుతూ వున్న దేహంతో పార్కు చేసిన కారు దగ్గరకు వచ్చాడు. అప్పటికే టైరుకు పెద్ద తాళం వేసేశాడు ట్రాఫిక్వాడు. ఇదేమన్యాయం అనడిగితే 'రాంగ్ పార్కింగ్' అన్నాడు. నో పార్కింగ్ బోర్డు లేదు కదా అనడిగితే అది గాలివానకు కొట్టుకుపోయిందని మరో రెండు మైళ్ళ తర్వాత కారు పార్కింగ్ వుందని, ఫైన్ కడితే తప్ప తాళం తీసేది లేదని ట్రాఫిక్కాయన అనడంతో నిత్యానందం నడిరోడ్డుమీద కుప్పకూలాడు.
నడి రోడ్డుమీద రెండు అడుగుల గొయ్యిలో పడకుండా వుంటానికి బండిని రైట్కి తిప్పితే రాంగు రూటు. ఎక్కడ రోడ్డు దాటాలో తెలీక జనం రోడ్డుకి అడ్డం పడి వచ్చి వాహనాలను ఢ కొడితే యాక్సిడెంటు. పార్కింగ్‌కి చోటు ఎక్కడా లేక నో పార్కింగ్‌లో బళ్ళు పెడితే జేబులు గుల్ల. మొత్తం మీద వాహనాలు నడిపేవాళ్ళు దారిదోపిడీకి గురవక తప్పదు.
ఇలా వేలకి వేలు ఫైన్లు వేస్తేనే జనం తిక్క కుదుర్తుంది. పెద్ద పెద్ద దేశాల్లో ఇలాగేవేస్తారు అనేవాళ్ళు వుండవచ్చు కానీ అక్కడి రోడ్లు ఎలా వున్నాయి? ఇక్కడి రోడ్డు ఎలా తగలడ్డాయి. ఈ రోడ్ల మీద ఆ రూల్సు పాటించడం సాధ్యమా అని అడగరేం?!
- చింతపట్ల సుదర్శన్,
9299809212