Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయితో శిల్పం చెక్కేవారి అనుభవాలు, మట్టితో పాత్రలు, శిల్పాలు తయారు చేసేవారి అనుభవాలు వేరుగా వుంటాయి. రాయిని చెక్కాలంటే అది చెప్పినట్లు మనం వినాలి. కానీ మట్టి మనం మలచినట్టు విని శిల్పంగా మారుతుంది. మనతో స్నేహశీలతతో వ్యవహరిస్తుంది. నేహల్ రచ్ రాయిలాంటి ఆకారాలు గా భ్రమింపచేసే మట్టి పాత్రలని, శిల్పంగా మలుస్తుంది. తను ఎర్తెర్న్వేర్, పోర్స్లేన్లోనూ పనిచేసినా ఎక్కువగా టెర్రకోట, స్టోన్వేర్లో పని చేయడానికి ఇష్టపడుతుంది.
నేహల్ స్కూల్లో చదువుకునేటప్పుడే తను ఫైన్ ఆర్ట్స్‌లో చదువుకోవాలని అనుకునేదట. ఎంతో అందంగా ఎంబ్రాయిడరీ కుట్టుపని చేసే తన తల్లి ప్రోత్సాహమూ అందుకు తోడైంది. 1990లో బరోడా ఫైన్ఆర్ట్స్ ఫాకల్టీలో అప్లైడ్ ఆర్ట్స్‌లో బి.ఎ. చదువుకోసం చేరింది. కమర్షియల్ ఆర్ట్ చేస్తే ఉద్యోగం దొరుకుతుందనే ఆలోచనతో చేరింది కానీ త్వరలోనే తన అభిరుచి పోటరీ-సిరామిక్ ఆర్ట్‌లో వున్నదని అర్థం చేసుకుంది. అప్లైడ్ ఆర్ట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఒక పక్క గ్రాఫిక్ డిజైనర్‌గా ఉద్యోగం చేస్తూ మరో పక్క సిరామిక్ ఆర్ట్ తనంతట తానుగా నేర్చుకుంటూ ముందుకు ప్రయాణం సాగించింది.
1997లో పాండిచ్చేరిలోని గోల్డెన్ బ్రిడ్జ్ పోటరీ ఇన్స్టిట్యూట్లో చేరి ఎనిమిది నెలలు పోటరీ చేసే కళ నేర్చుకుంది. అహ్మదాబాద్ కనోరియా సెంటర్లోనూ, బెంగళూర్‌లోనూ సిరామిక్ స్టూడియోలో పనిచేసి నేర్చుకుంది. ఆపై ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లో స్టూడియో రెసిడెన్సీలలో పనిచేసినప్పుడు, సిరామిక్స్ వైపు తన దృష్టి మారి మరోరకంగా ఆలోచించడం మొదలుపెట్టింది.
పోటరీ అంటే కుండలు, గిన్నెలు, రోజువారీ వాడకం వస్తువులలాగే ఆలోచిస్తాం. కానీ దీనిని కళాకృతుల నిలయంగా ఎందుకు మార్చకూడదు అనుకుంది. ఒక కుండకు మూత విడిగా అమరిస్తే అది ఉపయోగకరమైన వాడకం వస్తువు అవుతుంది. అదే మూతని విడిగా తీయకుండా ఆ ఆకారంలో ఒక భాగంగా మలిస్తే అది ఒక శిల్పం అవుతుంది. అలాగే కొన్ని చరిత్ర విషయాలను కూడా ఆలోచనలతో కూర్చింది.
మన పురాతన కాలపు హరప్పన్ సంస్కృతితో మనను అనుసంధానించేవి ఆనాటి మట్టి పాత్రలే. అలనాటి మట్టి పాత్రలు మనకు ఆనాటి చరిత్రే చెబుతాయి. ఇవి కొన్ని శతాబ్దాలుగా వాటి ఆకారాలని నిలుపుకోగలిగాయి. అంటే మట్టిపాత్రలు పగిలిపోతాయి అనే మాటకు అర్థం వేరు. ఈ భావనతో, ఆనాటి మట్టి పాత్రల ఆకారాలను పోలిన పాత్రలు చేస్తుంది. అలాగే కొండలపై ఫాసిల్ ఆకారాలు కనిపించినట్టుగా కొన్ని పాత్రలు చేస్తుంది. కొండరాయి తొలచిన రాచిప్పలకు మల్లే కొన్ని ఆకారాలు చేస్తుంది. కొండలు కూడా కొన్ని శతాబ్దాల కాలానికి గుర్తులు. ఇలాంటి ఆలోచనలతో తను ఆ ఆకృతులను మలచడానికి ప్రయత్నిస్తుంది. కానీ తను... 'ఎంతకని ఒక కాలానికి గుర్తుగా ఆకృతులు మలచగలను, నేను చేస్తున్నది ఒక చిన్న ప్రయత్నం మటుకే' అంటుంది. క్లే మట్టి కళాకారులకు ఆలోచనలే కాదు, అనుబంధంగా కూడా మారుతుంది. ఆ క్లే మట్టిని చేతపట్టి స్నేహితులుగా, బంధాలుగా అనుబంధం పెంచుకుటారు కళాకారులు.
- డా||ఎం.బాలామణి,
8106713356