Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీసాలోంచి
భూతాన్ని వెలికితీసే
కుట్రేదో జరుగుతోంది
భూతం బయటికొస్తే చాలు
భూమండలం బద్దలయ్యే సన్నివేశం
కళ్లముందు ప్రత్యక్షం
ఆకుపచ్చని అడవి సామ్రాజ్యాన్ని
కూలదోసే కుట్రేదో రచిస్తున్నారు
పచ్చని పోడుపొలాల నా నల్ల నేలంతా
శ్మశానాలను మొలిపించే ప్రయత్నాలు
పశుపక్ష్యాదులూ
అమాయకమైన ప్రకృతి పురుషుల
సహజ జీవన సంరంభాలు
అన్నీ భూతం కాళ్లకింద
మృతకళేబరాలై తుడిచిపెట్టుకుపోయే
పాడు కాలమేదో సృష్టించబడుతుంది
తినే అన్నం మెతుకుల మధ్య
అణుబాంబులను విసిరే భూతం
మొలకెత్తే బతుకు గింజల నడుమ
రక్తపు రసాయనాలు చల్లే భూతం
ఆకుపచ్చని ప్రకృతి సంపదను
అమాంతం నెత్తురు కోరలతో
నమిలి మింగేసే భూతం
బంగారం పండే గిరిజన నేలలనిండా
విషాన్ని అలికే భూతం
నదుల నరాల నిండా
కొండల కండల నిండా
విషరక్త కాసారాలను
ప్రవహింప చేసే భూతం
ఈ భూతాన్ని కట్టడి చేసే
పోరాట మాంత్రికులం కావాలి
నడిచే నేలనీ
పాడే ఆకాశాన్నీ
పరవశించే ఆకుపచ్చదనాన్ని
కాపాడుకునే యుద్ధం చేయాలి
మట్టి సీసా మూత తెరిచి
భూతాన్ని చెలరేగిపోయేలా చేసి
మూలవాసుల ప్రకృతి నేలను
చాపలా చుట్టేసి అంతమొందించే
కుట్రకు చరమగీతం పాడాలి
కార్పొరేట్ల వ్యాపార
కబంధహస్తాలనుండి
మనదైన నేలనీ ఆకాశాన్నీ
కన్నబిడ్డల్లా కాచి కాపాడుకోవాలి
భూతం బయటికి రాకముందే
భూమిపుత్రులంతా ఏకమై
అడవినే ఆయుధంగా మలచుకుని
యుద్ధానికి బయలు దేరాలి!
- చిత్తలూరి సత్యనారాయణ