Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు చేయవలసిన పనులను కూడా తరువాతెప్పుడో ప్రారంభించాలనుకుంటూ విలువైన సమయాన్ని గడిపేస్తారు చాలామంది. ఇది సరైన విధానం కాదు. కాలం ఎవరి కోసమూ ఆగదు. అది నిరంతరం చలనంలో ఉంటుంది. అందువల్ల వున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి. చాలా మందికి ఏదో సాధించాలని, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని మనసులో ఉంటుంది. కంటున్న కలలను నిజం చేసుకోవాలని ఉంటుంది .ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఒక కోరిక ఉంటుంది. అది ఎల్లప్పుడూ తనను ప్రముఖ వ్యక్తిగా అందరూ గుర్తించాలని, తన ప్రతిభకు ప్రశంసలు కురిపించాలని, అందరూ తనను కీర్తించాలని కోరుకుంటుంది. ఇలా ఆశించడంలో తప్పు లేదు. ఈ ఆశలు, అభిలాషలు అవాస్తవికంగా ఉండడంతో వాటిని ఎక్కడ ఎలా ప్రారంభించాలో తెలియక కలలు కంటూనే కాలాన్ని వృధా చేస్తారు. అంతే కాదు ఏం కోరుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టత లేక పోవడం కూడా ఒక కారణం. దానితో పాటు ప్రయత్నాలు ప్రారంభించడానికి కూడా మంచి రోజులు రావాలని ఎదురు చూస్తారు. ఈ ఎదురు చూపులతోనే కాలామే కాదు, జీవితంలో ముగిసి పోతుంది.
చాలామంది తాము అనేక పనులు చేయాలని పథకాలు వేస్తారు. కానీ వాటిని సాకారం చేసుకునేందుకు పట్టుదలగా ప్రయత్నించరు. కొంత మంది నటనలో ప్రావీణ్యం సంపాదించాలని, సినిమాలకు దర్శకత్వం వహించాలని అభిలాషిస్తారు. మరి కొంతమంది వ్యక్తులు గొప్ప రచయితలుగా ఎదగాలని కోరుకుంటారు. పాత మిత్రులకు ఫోన్లు చేయాలని, వారితో మాట్లాడాలని అభిలాషిస్తారు. మిత్రులతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని కోరుకుంటారు. కాని ఈ పనులు చేసేందుకు తగిన ప్రయత్నాలు చేయరు. మిత్రులకు ఫోన్లు చేయడం కదరదు. వారికి తమకు దూరం పెరిగిపోతుంది. కొన్నాళ్ళకు ఆ మిత్రుల ఫోన్ నంబర్లు మారిపోతుంటాయి. లేదా అసలు కనిపించకుండా పోతుంటాయి. ఫలితంగా ఆ మిత్రులనే కోల్పోతాం.
మీరు ఇతరులతో స్నేహ సంబంధాలను ఏర్పర్చుకోవాలని భావించవచ్చు. నూతన అభిరుచులను పెంచుకోవాలనుకోవచ్చు. ఈ అభిలాషలు అభినందించ దగినవి. ఇందులో అనుమానం లేదు. అయితే ఆ పనులను ఎప్పుడు ప్రారంభిస్తున్నరన్నదే అసలు సమస్య. ఈ ప్రశ్న ఎదురైనప్పుడు చాలా మంది తమకు అవకాశాలు లభించడం లేదని చెబుతారు. మిత్రమా.. మనకు అవకాశాలు ఎప్పుడూ లభించవు. వాటిని మనమే సృష్టించుకోవాలి. ప్రతి చిన్న సమయాన్ని ఒక అవకాశంగా తీర్చి దిద్దుకోవాలి. 'వెయ్యి మైళ్ల దూరమైనా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందనే' అనే చైనా సామెతను ఎన్నడూ మరచిపోకూడదు. చాలామంది ఆ ఒక్క అడుగు వేసేందుకే సంకోచిస్తారు. భయపడతారు. అయిష్టత, అనాసక్తి వ్యక్తం చేస్తారు. చివరకు ఆ అవకాశం చేయి దాటిపోయాక విచారం వ్యక్తం చేస్తారు. ఆ పని తాను ఎప్పుడో పూర్తి చేయాలని అనుకున్నానని, కానీ మిత్రులు, బందువులు నిరాశ పర్చడంతో ఆ పని పూర్తి చేయలేకపోయానని, ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ పని చేయకపోవడానిని తనదే బాధ్యత అనే ముఖ్య విషయాన్ని గుర్తించరు.
జీవితంలో గొప్ప విషయాల గురించి కలలు కనే సమయంలో మొదట చిన్న విషయాలను పూర్తి చేయడం ఎంతో ఉత్తమం. దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని పెద్ద పనులు పూర్తి చేసేందుకు ఆ అనుభవం, ఆత్మవిశ్వాసం ఉపయోగపడతాయి. అసలు ప్రారంభం కాని పనేదీ ముందుకు సాగదు. కానీ చాలామంది ఏ పనినీ ప్రారంభించకుండా దేనికైనా సమయం రావాలని, మంచి ముహూర్తం చూసుకోవాలని జాప్యం చేస్తారు. ఒక పని ప్రారంభించడానికి మంచి సమయం అంటూ ఏదీ ఉండదు. ఉన్నవన్నీ మంచి సమయాలే. మంచి ముహూర్తాలే. మనం గడచి పోతున్న సమయాన్ని గురించి పట్టించుకోకూడదు. ఈ రోజు అంతటి ప్రధానమైనది కాదని పనులు వాయిదా వేయడం తగని పని. మిత్రమా.. ప్రతి రోజూ, ప్రతి నిమిషం ప్రధానమైనదే. అందుకే ఈ రోజును పగటి కలలు కంటూ వృధా చేయవద్దు. ప్రతి రోజూ ఏదో ఒక పని చేయాలని, అది అర్థవంతంగా ఉండాలని సంకల్పం తీసుకోవాలి. కనే కలలు నిజం చేసుకొనేందుకు ఈ రోజు ఇక్కడే ఈ క్షణం నుంచే ప్రయత్నించాలి. ప్రారంభించాలి.
- జి గంగాధర్ సిర్ప,
9010330529