Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహితి సోపతి కరీంనగర్ వారి ప్రచురణగా 'తెలంగాణ భాష - సంస్కృత పదాలు' అనే గ్రంథం తెలంగాణ పదకోశ కర్త, బహభాషా కోవిదులు డా|| నలిమెల భాస్కర్ కలం నుండి వెలువడింది. దీనిలో ఎన్నో విలువైన పదాలు, వాటి పుట్టక తెలియజేశారు.
స్వాహా - సా, స్పృహ - సోయి, హనుమానుడు - అనుమాండ్లుగా మారే క్రమాన్ని అర్థవంతంగా వివరించారు. నలిమెలవారి కృషి బహు ప్రశంసనీయం. అసలు తెలంగాణ మాటలే గీర్వాణ మాతృకలు అంటూ పరిశోధనాత్మకంగా ఈ పుస్తకంలో పదాలు - పుట్టుక - అర్థ వివరాలు అద్భుతంగా తెలియజేశారు. తెలంగాణలోని ఖమ్మం సంస్కృత పదమైతే అది 'స్తంభం' నుండి వచ్చింది అంటారు. సంఘం (సంస్కృత పదం) సంగం అయ్యింది. సంక్రాంతి అనే సంస్కృత పదం తెలంగాణలో సంకురాత్రి అంటారు. ప్రజలకు సంస్కృతమూ వశీకృతమే అంటారు రచయిత. దర్జీ (హిందీ పదం) తెలంగాణలో 'మేర' (ఆంగ్లంలో టైలర్) మిర (సంస్కృతం): గుడ్డల్ని 'మేరలు' (మేరోల్లు) మేరల మేరకు కొలతల మేరకు కత్తిరించి కుడతారు. భృతి పదమే భత్యం - బత్తాం.. అయిన తీరు చెపుతారు. భజనలు, కీర్తనలు సంస్కృత పదాలు. మన జానపదాల్లోని సంస్కృత పదాలు... సోదాహరణలతో చెప్పారు (పేజి.73). ఫ్యాను (పంక), లక్ష్మి (లచ్చి) రుక్మిణీభాయి (రుక్కుంబాయి) గా మారిన పదాల తీరు చక్కగా చెప్పారు. పట్టణము అనే సంస్కృత పదం తెలంగాణ 'పట్నం' అయింది. జీవ గంజి పదంలో 'జీవ' సంస్కృతం, 'గంజి' తెలుగు - గమ్మత్తయిన సమాసం ఇది - (చనిపోయే ముందు పోసే గంజి - జీవ గంజి) మనకు పొరుగింటి సంస్కృతం అమృతం! అంటారు రచయిత. బువ్వను - ఆహారం - అన్నం, భోజనం అంటాం అంటారు. అట్లాగే తమిళ పదాలు - తెలుగు పదాలు కొన్ని చెప్పారు. తెలంగాణ భాషలో సంస్కృత పదాల కలయిక చెప్పిన గొప్ప పుస్తకం ఇది.
- తంగిరాల చక్రవర్తి,
9393804472
తెలంగాణ భాష సంస్కృత పదాలు, రచన : డా||నలిమెల భాస్కర్, పేజీలు : 102, వెల : 120/-, ప్రతులకు : నవతెలంగాణ అన్ని పుస్తక కేంద్రాలు. ఫోన్ : 9490099378/73/50