Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నడిగూడెం పోవాలనిపిస్తున్నది
నాకు పాత కోటలు, ఇతర చారిత్రక భవనాలు, ప్రదేశాలంటే ఎంతో ఇష్టం. వాటి చరిత్ర తెలుసుకోవాలనే కుతూహలం. మీరు ఈ వారం ప్రచురించిన కవర్ స్టోరీ చదివిన తర్వాత ఒకసారి నడిగూడెం పోవాలనిపిస్తున్నది. చారిత్రక భవనాలను కూల్చి అసెంబ్లీ భవనాలు కట్టాలనుకుంటున్న ప్రభుత్వం ఉన్న ఈ కాలంలో ఇటువంటి వ్యాసం రాయడం సముచితంగా ఉంది. చాలా బాగా రాశారు. - అనసూయ, ఖమ్మం జిల్లా
వాస్తవానికి దగ్గరగా
మాది జగిత్యాల దగ్గరలో ఉన్న ధర్మపురి. మీరు నడిగూడెంలో జరిగిన హిస్టరీ కాంగ్రెస్ పై రాసిన వ్యాసం చదివాను. నిజానికి ఆ సదస్సుకు నేను కూడా హాజరయ్యాను. నేను రాసిన ఒక పుస్తకాన్ని కూడా అందులో ఆవిష్కరించారు. ఈ చరిత్ర సదస్సుకు సమర్పించిన పరిశోధనా పత్రాలపై చేసిన విమర్శ సంకుచితత్వానికి దూరంగా, వాస్తవానికి దగ్గరగా ఉంది. ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు సంతోషంగా ఉంది. - చంద్రశేఖర్, ధర్మపురి
కీప్ ఇట్ అప్
తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్‌పై రాసిన ఆర్టికల్ బాగుంది. కీప్ ఇట్ అప్.
- ప్రొ.వి.రామకృష్ణ, హైదరాబాదు
మనకూ చరిత్ర కాంగ్రెస్ ఉందా!
నడిగూడెంలో జరిగిన ఐదవ తెలంగాణ చరిత్ర కాంగ్రెస్‌పై రాసిన వ్యాసం చదివాను. ఇది చదివిన తర్వాత కాని నాకు మనకూ ఒక చరిత్ర కాంగ్రెస్ ఉందని తెలియలేదు. ఎందుకో దీనిపై పత్రికల్లోకాని, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా కాని తగిన ప్రచారం కల్పించలేదు. నేను రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్నాను. ఇప్పుడు బిజినెస్ చూసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఇటువంటి వ్యాసం చదివాను. ఒకసారి అభినందించాలనిపించింది.
- చంద్రశేఖర్, హైదరాబాదు
మౌలిక ప్రశ్న
కార్టూనిస్ట్ సునిశిత పరిశీలనను తన కార్టూన్ల ద్వారా వెలిబుచ్చిన విధం ఆకట్టుకుంది. మనుషుల కోసం మార్కెట్టా? మార్కెట్ కోసం మనుషులా? అనే ప్రశ్నను 'అంతరంగం' లేవనెత్తి మేధోమధనానికి తెర లేపింది. ప్రభుత్వ మనుగడ తాగుబోతుల మీద ఆధారపడి ఉందన్న తాగుబోతుమాటలు (చౌరస్తా) నేటి దుస్థితికి అద్దం పడుతున్నాయి. మాటే మానవ వికాసానికి దిక్సూచి అని సూచించిన 'వికాసం' నచ్చింది. కవర్ స్టోరీ ఉపయుక్తంగా తోచింది. కొన్ని పరిశోధనా పత్రాలను ఎండగట్టిన తీరు రచయిత నిబద్ధతకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
- పంజాల నరసయ్య, హైదరాబాదు
కథ, కవితలు...
నవతెలంగాణ 'సోపతి' లో ప్రచురితమైన మనచరిత్ర కు నీరాజనం' కవర్ స్టోరీ' ఆసక్తి గా ఉంది. 'అంతరంగం' ఆలోచనాత్మకంగా ఉంది. 'మనిషికాటు' కథ బాగుంది. 'ఎవరికీ చెందనివాడు' అనువాదకులకు మార్గదర్శకంగా ఉంది. కార్టూన్లు, కవిత లు బాగున్నాయి.
- ముక్కెర రమేశ్ చంద్ర, గుర్రం పేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా