Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విలువల పతనం
'ఎల్లలన్నీ చెదిరిపోయి, ఎల్ల లోకములు ఒకటిగా భాసిల్లా లంటే, ఈ విశ్వం తమ మాతృభూమిగా మనుషులంతా పరిగణించాలి' అని 'అంతరంగం' ఇచ్చిన పిలుపు ఆలోచింప చేసింది. తరచుగా వసుధైక కుటుంబం అని వింటుంటాం. రెండు ఒకటిగా తోస్తున్నవి. రాజ్యరహిత సమాజంలో మనిషి మనుగడ బాగుంటుందని కూడా 'అంతరంగం' పేర్కొన్నది. 'రాజ్యరహిత సమాజం' అనే భావన ఇంకా కార్యరూపం దాల్చలేదనే విషయం మనం గ్రహించాలి. తిండి పోటీలో అధికంగా తిని ఆమె ప్రాణం వదిలింది. ఇది వార్తగా వచ్చింది. తినడానికి తిండిలేక అసువులు బాస్తున్నవారి గురించి వార్త రాయడానికి ఖాళీ లేదు. ఇది నేటి వైపరీత్యం! మేడారం జాతర గురించి అందించిన విశ్లేషణాత్మక వ్యాసం కొండ జాతుల్లో క్షీణిస్తున్న సామాజిక, కుటుంబ విలువలను తెర మీదికి తెచ్చింది. జాతరలో వచ్చే ముడుపుల సొమ్ము లో తమ వంతు కోరుతూ తగాదా లకు. దిగడం, కోర్ట్‌ను ఆశ్రయించడం విచారకరం. భక్తి వర్సెస్ డబ్బు వ్యవహారంగా మేడారం జాతర మారింది. పోటీ పూజారుల సంఘం ఏర్పాటు కావడం వలన జాతర రాజకీయ రంగు పులుము కొన్నది.
- పంజాల నరసయ్య, హైదరాబాదు
కథ ఆసక్తికరంగా ఉంది
కవర్ స్టోరీలో మేడారం జాతర గురించి చాలా సమాచారం ఇచ్చారు. అక్కడ ప్రస్తుత పరిస్థితి అర్థమయింది. మేడారం జాతరలోనే పగిడిద్దరాజు, గోవిందరాజు పూజలందుకుంటారని తెలిసింది. 'నెమలీక' ఫీచర్లో మేఘాలయ చిరపుంజిలో రబ్బర్ మొక్కల వేళ్లువంతెనలాగా ఏర్పడతాయని తెలిసింది. ఈవారం కథ 'స్పేస్' ఇంటరెస్టింగ్‌గా సాగింది.
- షేక్ ఆయూబ్ పాషా, ఖమ్మం
అభినందనలు
ఈ ఆదివారం సండే మేగజీన్‌లో పోలీస్ లైబ్రరీలపై రాసిన వ్యాసం అద్భుతంగా ఉంది.ఎంతో విలువైన సమాచారాన్ని అందించిన రచయితకు, మీకు అభినందనలు.
- కొమరెల్లి మల్లేష్ రెడ్డి
సచిత్రవ్యాసం బాగుంది
ఆదివారం నవతెలంగాణ సోపతిలో 'ఠాణా గ్రంథాలయాలు' వ్యాసం ఆసక్తికరంగా ఉంది. 'మేడారం లో ఏం జరుగుతోంది? కవర్ స్టోరీలో కోటి న్నరభక్తులు సందర్శించే జాతరలో ఏర్పాట్ల గురించి, నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర విశేషాలను సచిత్రంగా వివరించారు. 'చౌరస్తా' కాలంలో 'జర్నీ' బాగుంది. 'నెమలీక' ఫీచర్ లో 'తెలివైన రామచిలుక' కథ బాగుంది.
- ముక్కెర రమేశ్ చంద్ర; గుర్రం పేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.
ఏం కానుందో!
మేడారం జాతర గురించి ఆలోచిస్తుంటే మతిపోతున్నది. ఒక మామూలు ఆదివాసీ వంశంవారు జరుపుకునే జాతరను ప్రభుత్వం ఆక్రమించి ఇంత పెద్దఎత్తున వ్యాపారం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇక ముందు ముందు ఇది ఎటువంటి కొత్తపుంతలు తొక్కుతుందో. ఇప్పటికే మేడారం పరిసరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. ఏడాది పొడవునా యాత్రికులు అక్కడికి పోతే పరిస్థితి భయానకంగా మారుతుంది.
- ప్రభాకర్, హైదరాబాదు