Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొలి కథానాయిక కథ
ఇప్పుడంటే సినిమా కొత్తవాళ్ళతో తీస్తామనగానే బోలెడంతమంది యువతీ యువకులు తమ పోర్డ్ఫోలియోలతో ఆ ప్రొడక్షన్ ఆఫీసు ముందు హాజరవుతారు. కానీ మన దేశంలో మొట్టమొదటి మూకీ కథా చిత్రం 'రాజాహరిశ్చంద్ర' తీసిన దాదా ఫాల్కే - నటీనటుల కోసం ఎంత కష్టపడ్డారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి పాత్ర ధరించడానికి అప్పట్లో మహిళలు ఎవరూ ముందుకు రాకపోవడం ఆయనకు పెద్ద సమస్య అయింది. ఆ రోజుల్లో రంగస్థలం మీద కూడా స్త్రీ పాత్రలను పురుషులే ధరించేవారు. ఐతే ఫాల్కే తన చిత్రంలో మహిళ చేతే చంద్రమతి పాత్రధారణ చేయించాలనే పట్టుదలతో ఎంతమందినో అడిగి, చివరికి వేశ్యావాటికలకు కూడా వెళ్ళారు. వాళ్ళు ఒప్పుకోకపోగా, పొమ్మని కసిరి పంపించారు. ఇక గత్యంతరం లేక సాలుంకే అనే యువకుణ్ణి ఆ వేషం వేయమని బ్రతిమాలుతూ అడిగితే, అతను అంగీకరించాడు. కానీ తీరా షూటింగ్ సమయంలో మీసాలు తీయాలనేసరికి లబోదిమోమన్నాడు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం తండ్రి మరణిస్తేనే మీసాలు తీయిస్తారట. దాంతో ఫాల్కే మళ్ళీ సాలుంకే కాళ్ళావేళ్ళాపడి మీసాలు తీయించి, నటింపజేశారు. ఇదీ మన భారతీయ మూకీ చిత్ర కథానాయిక కథ.
- బి.కె.ఈశ్వర్, 9885447306