Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు రోజుల ఆలస్యంగా కిర్క్ డగ్లస్ మరణించాడు అన్న వార్త తెలియగానే నా మనసులో మొదట మెదిలిన వాక్యం 'స్పార్టకస్ మళ్ళీ మరణించాడు'. నిజం నాకు సంబంధించినంత వరకు స్పార్టకస్ అంటే కిర్క్ డగ్లస్ మాత్రమే. అతడు గొప్ప నటుడు అయి ఉండవచ్చు, గొప్ప వితరణ శీలి కావచ్చు, ఇరవైయవ శతాబ్దపు గొప్ప మనిషి కూడా అయి ఉండవచ్చు. కానీ అతడు మాత్రం స్పార్టకసే. డగ్లస్ స్పార్టకస్ సినిమా చూసి అంత ప్రభావితం అయ్యాను నేను. తరువాత అతడి సినిమాలు ఎన్ని చూసినా నా హృదయంలో డగ్లస్ ప్రతిరూపం స్పార్టకస్గానే ముద్రించుకుని ఉండిపోయింది.
తన నూట నాలుగు సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో డగ్లస్ చుంబించని శిఖరాలు లేవు. పడిపోని లోయలు లేవు. అతడి జీవితం ప్రారంభం కావడమే సున్నాతో మొదలయింది. అత్యంత పేదరికంలో ఏడుగురు పిల్లల్లో ఒకడిగా పూట గడవని ఇంట్లో పుట్టిన ఇస్సూర్ డేనిలోవిచ్తన నూట నాలుగవ యేట అత్యంత ధనికుడైన కిర్క్ డగ్లస్గా తుది శ్వాస విడిచాడు. నిష్కపటమైన, నిర్మలమైన బాక్సర్‌గా తన అద్భుతమైన నటనకు గాను మొదటిసారి 1949లో ఛాంపియన్ సినిమాకు గాను ఆస్కార్ నామినేషన్ పొందిన డగ్లస్, 'ది బాడ్ ఎండ్ బ్యూటిఫుల్' సినిమాలో నటనకు గాను రెండవసారి 1952లో ఆస్కార్ నామినేషన్ పొందాడు. మూడవసారి 'లస్ట్ ఫర్ లైఫ్' సినిమాకు గాను 1956లో మరోసారి నామినేషన్ పొందాడు. మూడు సార్లు అతడికి నిరాశే ఎదురయింది. ఆస్కార్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. చివరకు నటుడుగా తన పెర్ఫార్మెన్స్కి కాకుండా జీవన సాఫల్య పురస్కారంగా ఆస్కార్ అవార్డు పొందాడు. చిత్రం ఏమిటంటే డగ్లస్ కొడుకు మైఖేల్ డగ్లస్ ఆస్కార్ అవార్డు అందుకుని తండ్రి పుత్రాదిచ్చేత్ పరాజయం అనుభవిస్తూ ఉండగా ఆస్కార్‌ను ముద్దాడాడు.
డగ్లస్ అస్సలు సినిమా నటుడు కావాలని అనుకోలేదు. రంగస్థలం మీద గొప్ప నటుడుగా వెలుగొందాలి అనేది అతడి అసలు సిసలు కోరిక. కానీ తన స్నేహితురాలి ద్వారా ''ది స్ట్రేంజ్ లవ్ ఆఫ్ మార్తా ఇవెర్స్'లో నటుడుగా పరిచయం అయ్యాక అతడిక వెనక్కు తిరిగి చూసుకోలేదు. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాడో అంత కంటే ఎదురు దెబ్బలు, శారీరక హింస తాను పోషించిన సినిమా పాత్రలలో అనుభవించాడు. 'ఏస్ ఇన్ ది హౌల్' అన్న సినిమాలో వెన్నుపోటుకు గురయ్యాడు. 'స్పార్టకస్'లో శిలువ వేయించుకున్నాడు. 'ది వైకింగ్స్' అన్న సినిమాలో ఒక కన్నును, 'లస్ట్ ఫర్ లైఫ్'లో ఒక చెవిని, 'ది బిగ్ స్కరు' సినిమాలో చేతి వేళ్ళను పోగొట్టుకున్నాడు. ఒక నటుడుగా అన్ని రకాల పాత్రలను పోషించాలనే మాట నిజమే కానీ, హై ఎమోషనల్ పాత్రలు అంటే గుర్తు వచ్చే పేరు డగ్లసే. తనకు బాగా ఇష్టమైన సినిమా 'లస్ట్ ఫర్ లైఫ్' అని డగ్లస్ చెప్తాడు కానీ స్పార్టకస్ అతడు చేసిన గొప్ప సాహసం.
కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు వున్నాయన్న కారణంగా కొంతమంది నటులు, కళాకారులు, రచయితలను హాలీవుడ్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినప్పుడు డగ్లస్ తన స్పార్టకస్ కోసం ఆ బ్లాక్‌లిస్ట్‌ను బ్లాస్ట్ చేసాడు. ఆ లిస్ట్‌లో ఉన్న కొంతమందిని తన స్పార్టకస్ కోసం తీసుకున్నాడు. అప్పుడు అది ఒక గొప్ప సంచలనం. డగ్లస్ స్వతంత్ర ప్రవర్తనకి అదొక ఉదాహరణ.
దాదాపు తొంభయి సినిమాలలో నటించిన డగ్లస్ వ్యక్తిగా చాలా స్థిరమైన చిత్తం కలిగినవాడు. దయార్ద్ర హృదయుడు. తన ఫౌండేషన్ ద్వారా 80 మిలియన్ డాలర్లను వివిధ కార్యకలాపాలకు విరాళంగా ఇచ్చేశాడు. 2015లో తన 99వ పుట్టినరోజు సందర్భంగా 15 మిలియన్ డాలర్లను అల్జీమర్స్ బాధితులైన సినిమా టీవీ నటులకు సహాయ కార్యక్రమాలకుగాను విరాళంగా ఇచ్చేశాడు. నిజానికి దానగుణం అతడికి పుట్టుకతో వచ్చిందే కానీ తెచ్చి పెట్టుకున్నది కాదు. సెయింట్ లారెన్స్ యూనివర్సిటీ న్యూయార్క్‌లో చదువుకునేటప్పుడు ఒక్క బ్లాక్ స్టూడెంట్ కూడా లేకపోవడం గమనించిన డగ్లస్ తను సంపాదించడం మొదలు పెట్టిన తరువాత బ్లాక్ స్టూడెంట్స్ కోసం నాలుగు స్కాలర్ షిప్‌లు ఏర్పాటు చేశాడు.
డగ్లస్ మంచి రచయత కూడా. ఒక కవిత్వ సంపుటితో పాటు మొత్తం పదకొండు పుస్తకాలు వెలువరించాడు. తన జీవితంలోని వివిధ సందర్భాలలో, తను స్పందించి రాసిన వివిధ కవితలను Life Could Be Verse పేరుతో ఒక సంకలనంగా వెలువరించాడు. ''I wrote these poems at different times throughout my life and I wanted to see what all the poems together said about my life. It’s a small book, filled with pictures, but it probably tells you more about me than you want to know!'' తన గురించి తన కవిత్వం బాగా చెప్తుందని డగ్లస్ అంటాడు.
ఈ కవిత్వ సంపుటిలో తన కుమారుడు, ఆస్కార్ అవార్డు విజేత ఆయిన మైఖేల్ కోసం రాసిన కవిత 'For Michael'లో ఇలా అంటాడు
''నేను మంచి తండ్రి నేనా?' అని ప్రశ్నించాను
మావాడు కొద్ది సమయం తీసుకున్నాడు జవాబు చెప్పడానికి
అది చాలా పెద్ద సమయం నాకు
అతడి జవాబు కోసం నేను చాలా ఆతురతగా ఎదురు చూసాను
అతడు చివరకు Ultimately అన్నాడు
నాకా మాట వినిపించలేదు/అతడు తీసుకున్న నిశ్శబ్దమే నేను విన్నది
ఆ నిశ్శబ్దం బహుభారంగా వున్నది
గర్వపడే ఒక దయాపూరిత పదం/కోసం ఎదురు చూస్తున్న నేను
మూగగా ఎలా ఉండగలను
కానీ ఆ నిశ్శబ్దంలో నాకే మాటా వినబడలేదు
అతడేమాటా మాట్లాడనప్పుడు/ నేనొక మంచి తండ్రిని
నేనతడిని కోరుకుంటున్నప్పుడు
అతడు అంతకంటే ఎక్కువగా నన్ను కోరుకుంటున్నాడని
తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది''
డగ్లస్‌కి ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలకి కలిపి నలుగురు కొడుకులు. తన పిల్లలు ఎవరూ ఇండిస్టీలోకి రావడం డగ్లస్‌కి ఇష్టం లేదు. కానీ అతడి ఇష్టానికి విరుద్ధంగా నలుగురు పిల్లలు ఇండిస్టీ లోకే వచ్చారు. అందులో మైఖేల్ తండ్రికి అందని ద్రాక్ష అయిన ఆస్కార్ కూడా పొందాడు. మైఖేల్ తన చిన్నప్పటి నుండీ తండ్రిని ఏమీ అడగలేదట. ''మైఖేల్! నేను నీ తండ్రిని. నన్ను ఏదైనా అడుగు'' అని అడిగినా ఎప్పుడూ ఏమీ అడగలేదట. బహుశా ఆ వేదన అంతా ఈ కవితలో గుదిగుచ్చాడేమో నేనతడిని కోరుకుంటున్నప్పుడు, అతడు నన్ను అంతకంటే ఎక్కువగా కోరుకుంటున్నాడని తెలుసుకోవడానికి చాలా కాలం పట్టిందని అనడం వెనుక ఒక చిన్నబాధ మెల్లగా హృదయాన్ని కోస్తుంది.
కిర్క్ డగ్లస్‌కి ప్రపంచంలో ఏ నటుడికీ లభించని అదృష్టం లభించింది. అతడు తన ఇద్దరు భార్యలతో కలిసి నటించాడు. తన కొడుకుతో కలిసి పని చేశాడు. అలాగే తన మనవడితో కూడా కలిసి పని చేశాడు. అతడి దురదృష్టం ఏమిటంటే, అతడి నలుగురు కొడుకులలో చిన్నవాడైన ఎరిక్ ఛాయా చిన్న వయసులోనే చనిపోయాడు. డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన అతడు చనిపోయాడు. ఆ దు:ఖాన్ని గుండె నిండా అనుభవిస్తూనే ఎరిక్ కోసం ఒక పోయెమ్ రాశాడు.
''నీ సమాధి పక్కన కూర్చుని/ నేను మౌనంగా విలపిస్తాను
నీ శాశ్వత నిద్రకి ఏ ఆటంకమూ కలుగచేయకుండా
నా ప్రియమైన కన్నా/ మనిద్దరమూ ఒకటి కావడానికి
ఇంకెంతో దూరం లేదు/ నేను నీ పక్కన పడుకుని
మనసు విప్పి మాట్లాడతాను, ఏ దాపరికాలు లేకుండా
ఎరిక్ ఒక మాట చెప్పు/ నేనేమి తప్పు చేశాను?
నిన్ను మరిత దృఢంగా తయారు చేయడానికి
నేనేమి చేసి ఉండవలసింది?/ నేనిప్పుడు ఇక్కడ కూర్చుని
విలపిస్తూ ఎదురుచూస్తాను/ నీతో కలిసిపోయే సమయాన్ని
మృత్యువు ఎప్పుడు మోసుకుని వస్తుందా అని''
నిజానికి డగ్లస్ కవిత్వం మీదే దృష్టి పెడితే ఒక గొప్ప కవిగా మిగిలిపోయేవాడేమో. దు:ఖం, ప్రేమ, వేదన, అతడి కవిత్వ వస్తువులు. రొమాన్స్ బిగిన్స్ ఎట్ 80 అన్న మరొక కవితలో ప్రేమ మాత్రమే జీవితాంతం తోడుగా ఉంటుందని అంటాడు.
డగ్లస్‌ను ఒక చట్రంలో బిగించలేం. గొప్ప నటుడు. గొప్ప వితరణ శీలి, మంచి సామాజికుడు, సున్నిత కవి. అన్నిటినీ మించి ఎవరైనా ఆదర్శంగా తీసుకోగలిగిన గొప్ప మనిషి అతడు. అతడి మరణంతో హాలీవుడ్లో ఒక శకం ముగిసింది.
అతని ప్రేమ అమరం
పెళ్ళైన తరువాత చాలా మంది దంపతుల మధ్య ప్రేమ మృగ్యమై జీవితం ఒక రొటీన్ అలవాటుగా మారిపోతుంది. కానీ డగ్లస్, అన్నేల దాంపత్యం అలా కాదు. ''నేనే కనుక ఒక వంద సంవత్సరాలు బతికి వున్నా, నేను చెప్పవల్సినవి ఇంకా చాలా మిగిలిపోయే ఉంటాయి'' అని పెళ్ళైన కొత్తలో 1954లో తన భార్యకు రాసిన ఒక వుత్తరంలో పేర్కొన్నాడు డగ్లస్.
ఆ తరువాత 62 ఏళ్లకు తన వందవ పుట్టిన రోజును జరుపుకుంటూ ''As I have now reached that mile stone, I Can attest that it is still true'' అని మరొక వుత్తరంలో రాశాడు. నిజానికి భార్యాభర్తల మధ్య ఒక నిరంతర సంభాషణ జరుగుతూ ఉండాలి. అప్పుడే ఆ బంధం సజీవంగా నిలిచి ఇద్దరికీ గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమికుల మధ్య వున్నన్ని మాటలు భార్యాభర్తల మధ్య వుండవు. మాటలు మౌనమైపోయినప్పుడు మనసులు కూడా శూన్యం అవుతాయి. ప్రేమకు ఎండ్ పాయింట్ లేదని చాలామందికి తెలియదు. పెళ్ళి కాగానే ఫుల్స్టాప్ పెట్టేస్తారు. నిరంతరం ప్రేమలో మునిగి తేలడమే దాంపత్య జీవితానికి స్త్రీ పురుషులు ఇద్దరూ ఇవ్వగల సాఫల్యం.
తన సినిమా షూటింగ్‌ల నిమిత్తం డగ్లస్ చాలా తరచుగా ప్రయాణాలు చేసేవాడు. భార్యకు దూరంగా ఉండేవాడు. అప్పుడు ఉత్తరాలు రాసేవాడు. అలా డగ్లస్ రాసిన ఉత్తరాలని, డగ్లస్‌కి అన్నే రాసిన ఉత్తరాలని అన్నే చాలా భద్రంగా దాచి పెట్టింది. ఆ ఉత్తరాలన్నింటినీ, డగ్లస్ అన్నే సంయుక్తంగా కలిసి ఒక పుస్తక రూపంలోకి తీసుకుని వచ్చారు.
బాల్యంలో కడు పేదరికంలో పెరిగి, పొట్ట నింపుకోవడానికి చిన్న చిన్న దొంగతనాలుసైతం చేసి, ఆ తరువాత బాగా డబ్బు సంపాదించి పాత జీవితాన్ని మరచి పోని, తన చిన్నచిన్న తప్పుల పట్ల కూడా పశ్చాత్తాపం ప్రకటించుకునే డగ్లస్ అనే బలమైన యూదు వ్యక్తిత్వానికి, ఆ గర్భ శ్రీమంతురాలైన, తనదయిన బలమైన వ్యక్తిత్వం కలిగిన అన్నే అనే ఒక జర్మన్ వ్యక్తిత్వానికీ మధ్య ఏర్పడిన బంధం ఫల ప్రదం కావడానికి ఏయే అంశాలు దోహదం చేశాయో, సమకాలీన హాలీవుడ్ ప్రపంచం ఏ అగాధాలను దాటుకుంటూ వచ్చిందో, ఆ ప్రకంపనలన్నీ ఆ ఉత్తరాల సంకలనంలో వున్నాయి. ఆ పుస్తకం పేరు 'లెటర్స్ ఆఫ్ లవ్, లాఫర్ అండ్ లైఫ్ టైమ్ ఇన్ హాలీవుడ్'.
అందులో నుంచి ఒక చిన్న వుత్తరం
''ప్రియమైన సహచరీ... !
ఈ క్షణంలో నువ్వు భూమికి వేల అడుగుల ఎత్తున ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటావు. నువ్వు పవళించిన విమానం మాత్రం నిన్ను తీసుకుని నా దగ్గరకు శరవేగంతో వస్తూ వుంటుంది. మరి కొద్దిసేపటిలో నువ్వు నా దగ్గర ఉంటావు. మరిప్పుడు నేను ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నాను? నువ్వు నా దగ్గర దిగిన వెంటనే, నీ సమక్షంలో సమయం అమిత వేగంగా గడిచి పోతుందని నాకు తెలుసు. మనిద్దరమూ ఒకరికొకరు చెప్పుకోవలసిన చాలా విషయాలు చెప్పుకోలేంత వేగంగా సమయం గడచి పోతుంది.
నిజానికి మనిద్దరం వందేళ్ళు కలసి వున్నా ఇద్దరి మధ్య పంచుకోవలసిన ఊసులు ఇంకా చాలా మిగిలే ఉంటాయి. నిజం చెప్పాలంటే మరణాంతర జీవితం ఉంటే ఆ జీవితం కూడా మనకు సరిపోదు. నువ్వు త్వరగా వచ్చేస్తావు కదూ!
నీ డగ్లస్''
ఇది చిన్న ఉత్తరమే. కానీ ఎన్నెన్ని భావనలకు, ఆలోచనలకు దారి తీస్తుంది. ఇలాంటి ఉత్తరాలు ఎన్నో. ది డైలీ మెయిల్ అన్న పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ''మా ప్రేమలోని సాంద్రతకి, నా మనవళ్ళు అచ్చెరువు చెందరని అనుకుంటాను'' అన్నాడు.
- వంశీకృష్ణ,
9573427422