Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ స్వప్నం అదెంత దూరం?
గత వారమంతా అకాడమీ అవార్డుల సంరంభంతో గడచిపోయింది. బాబ్ డిలన్‌కి నోబెల్ ప్రకటించినప్పుడు ఎంత సంచలనం కలిగిందో దక్షిణ కొరియా 'పారసైట్' ఆస్కార్ ఉత్తమ చిత్రం పురస్కారం పొందటం అంత సంచలనమూ కలిగించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల కంటే సానుకూల ప్రతిస్పందనలే ఎక్కువగా వ్యక్తం అయినాయి. ఆంగ్లేతర భాషల సినిమాలకు ఆస్కార్ అందని జాబిలి కాదన్న విషయం వివిధ దేశాలలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. మరి భారత్ సంగతేమిటి? ఆస్కార్ పురస్కారానికి Indian Touch' ఇచ్చే అవకాశం ఉన్నదా? ఉంటే అదెంత దూరం?
'పారసైట్' ఉత్తమ చిత్రం ఆస్కార్ పురస్కారం పొందటం వెనుక ఉన్న కారణాలను విశ్లేషించుకుంటే భారత్ అవకాశాలు ఎంత దూరంలో ఉన్నాయో అర్థం అవుతుంది. నిజానికి పారసైట్ కథ ఎవరూ ఊహించలేనంత గొప్ప కథేమీ కాదు. ఒక విమర్శకుడు అయితే ఆ సినిమాను 'ఆత్మ లేని శరీరం' అన్నాడు. మరొక విమర్శకుడు 'కొరియన్ భారతంలో పారసైట్ విరాటపర్వం' అన్నాడు. తమిళ సినిమా అభిమానులైతే ఒకడుగు ముదుకు వేసి అది తమ విజరు నటించిన 'మెన్సార్ కన్నా' సినిమా యే పారసైట్ అన్నారు. ఇంకో తెలుగు సినిమా అభిమాని అయితే ''అబ్బే! మన తెలుగు 'గుండమ్మ కథ'కీ పారసైట్ కీ తేడా లేదు'' అన్నారు. ఈ అభిప్రాయలు అన్నీ చాలా చాలా అతిశయోక్తులు అనుకున్నా నిజంగా 'పారసైట్' కథలో మాత్రం రెగ్యులర్ సినీ గోయెర్కి కొత్తదనం ఏమీ కనిపించదు. ధనిక, పేద జీవితాల మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్, అది సృష్టించే విధ్వంసాన్ని హారర్‌తో కామెడీని మిక్స్ చేసి అందంగా పాక్ చేసిన కథ.
సియాటెల్‌లో నివసించే అతి పేద కుటుంబం కిమ్‌ది. రెండూ ఇంటూ మూడు వైశాల్యం ఉన్న ఆ ఇల్లు అనబడే చిన్న షెల్టర్‌లోనే భార్య, కూతురు, కొడుకు చాలా అసౌకర్యంగా, సౌకర్యవంతంగా జీవిస్తూ వుంటారు. పక్కింటి సిగల్స్ మీద ఆధారపడి పనిచేసే ఆ వాట్సప్ జీవితాలలో ఒక చిన్న వెలుగు రేఖ ఇంగ్లీష్ టీచర్ వుద్యోగం రూపంలో వస్తుంది. కిమ్ కొడుకు ఫ్రెండ్ ఒకడు పై చదువులకు విదేశాలకు వెళుతూ, అప్పటి దాకా ఒక మల్టీ మిలియనీర్ ఇంట్లో తాను చేస్తున్న ఇంగ్లీష్ ట్యూటర్ ఉద్యోగాన్ని కిమ్ కొడుకుకు ఇప్పిస్తాడు. అలా ఒక కోటీశ్వరుడి ఇంట్లోకి యూనివర్సిటీ స్టూడెంట్‌గా అబద్దం చెప్పి ప్రవేశించిన కిమ్ కొడుకు, ఆ కోటీశ్వరుడి వైభవానికి మూర్ఛ పొంది ఎలాగైనా తన చెల్లెలిని, తండ్రినీ, కూతురునూ ఆ ఇంట్లో ప్రవేశపెట్టి 'ధనవంతులుగా ఉండటంలో ఉన్న మజా' ఏదో చూపించాలి అనుకుంటాడు. అక్కడ తనకంటే ముందు నుండీ ఉన్న డ్రైవర్ని, వంట వారినీ, యజమానులే తీసివేసే పరిస్థితి కల్పించి ఆ యా స్థానాలలో తన తండ్రినీ, తల్లినీ ప్రవేశ పెడతాడు. తన చెల్లెలిని ఆర్ట్ థెరపిస్ట్‌గా గృహప్రవేశం చేయిస్తాడు.
రోజులు సాఫీగా గడుస్తున్నాయి అనుకునే టైంలో పాత వంట మనిషికి వీళ్లంతా ఒకే ఫ్యామిలీ అని, మోసం చేసి ఇంట్లోకి వచ్చారన్న నిజం తెలుస్తుంది. వీళ్లకు కూడా పాత వంటలక్క ఆ ఇంటి అండర్ గ్రౌండ్లో తన భర్తను ఉంచి అతడికి కావాల్సినవి అన్నీ చేరవేస్తున్నదని తెలుస్తుంది. ఒకళ్ళ రహస్యం మరొకళ్ళు బయట పెడతామని, ఒకరి నొకరు బెదిరించుకుంటూ ఒక థ్రిల్లర్ సినిమాను చూపిస్తారు మనకు.
ఈ కధంతా వింటే మనకు ఏముంది అనిపించవచ్చు. కానీ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంటుంది. 'పారాసైట్' సినిమాకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ సమకూర్చిన Darcy Paquetనబవ్ ఒక మాట చెప్పాడు. »»The filim’s combination of universal themes and culturaay-specific details made it relevant to audiences around the world. I also beleive that Bong’s apprach to story telling is very universal, partly because he has been watching films from all around the world since he was a child. He has absorbed many different appraoches to narrative, and then he created his own unique way of story telling' పారాసైట్ చిత్ర దర్శకుడిలా సొంత చిత్రీకరణ శైలిని సృష్టించుకున్న మన దర్శకులు చాలా తక్కువ. ఈ దృష్టితో చూస్తే నార్త్ కంటే సౌత్ చాలా బెటర్. మనకు మలయాళం, తమిళం, కన్నడం చాలా మంది దర్శకులు వున్నారు. ఒక నేరేటివ్‌కి లేదా స్థానిక కథనానికి యూనివర్సల్ అప్రోచ్ ఇవ్వడం అంత తేలికైన పనేమీ కాదు. నార్త్, సౌత్ తేడా లేకుండా మనవాళ్ళు కూడా ప్రపంచ సినిమా చూస్తారు కానీ వాళ్ళ ఆలోచనలు, వాటిని ఎంత వరకు తమ భాషలలోకి మక్కీకి మక్కి దింపగలం అన్న వైపే సాగుతాయి. తెలుగులో హాలీవుడ్ స్థాయి మూవీ తీస్తున్నాం అని ప్రకటించుకుంటారు కానీ తెలుగు హాలీవుడ్ మూవీ ఎందుకు అని ఆలోచించరు.
కొరియా సినిమాకు కొరియన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం కూడా చాలా ప్రభావం చూపింది పారసైట్ ఆస్కార్ గెలుచుకోవడం వెనుక. ఆ ప్రోత్సాహం రాజకీయాలకు అతీతం. మన దగ్గర రాజకీయాలు చాలా ఎక్కువ. 'సంసార' సినిమా దర్శకుడు అనిల్ కుమార్ పాండ్య ఈ రాజకీయాల గురించి చెప్తూ ''30కి పైగా అంతర్జాతీయ పురస్కారాలు పొందిన తమ 'సంసార' సినిమాను భారత దేశం తరఫున ఉత్తమ విదేశీ చిత్రం క్యాటగిరీకి నామినేట్ చేయమని అడిగినప్పుడు భారత అధికారులు సంసార అన్న సినిమా గురించి తామెప్పుడూ వినలేదని చెప్పారట. దాదాపు 40 దేశాలలో ప్రదర్శించబడుతున్న తమ సినిమా గురించి చేసిన వినతులను, అన్నిటినీ పక్కన పెట్టేసి ఆ సంవత్సరం 'దేవదాస'్ సినిమాను ఎంపిక చేశారట. ఈ సంవత్సరం కూడా 'బుల్ బుల్ కెన్ సింగ్' లాంటి భావోద్వేగ భరిత సినిమాను వదిలి వేసి 'గల్లీ బారు'ను ఎంపిక చేశారు. మన సినిమా మనకు గొప్పే. కానీ 'స్లమ్ డాగ్ మిలియనీర్'కి 'గల్లీ బారు'కి ఉన్న ప్రధానమైన తేడా చెప్పమంటే, ఏ జవాబు చెప్పలేం.
నిజానికి ఆస్కార్‌కి ముందు మెట్టు అయిన కేన్స్‌లో కూడా మన ప్రాతినిధ్యం అంత గొప్పగా ఏమీ లేదు. 1994 లో షాజీ ఎన్ కరుణ్ స్వాహం తరువాత కేన్స్‌లో మన ప్రాతినిధ్యం లేదు. 'We have lost the soul of our cinema after Sen and Ray. We need producers to back our filmmakers like they supported Ray and Sen'' అని షాజీ ఎన్ కరణ్ ఒక సారి అన్నాడు. సత్యజిత్ రే, మృణాళ్ సేన్ తరువాత భారత సినిమా తన ఆత్మ కోల్పోయింది అన్న మాట కొంచెం పెద్ద మాట. కానీ తనను తాను కనుగొనడంలో భారత సినిమా ఎక్కడో దారి తప్పింది. దానికి కారణాలు ప్రపంచీకరణలో ఉన్నాయా?
ప్రపంచీకరణ తరువాత భారత సినిమా విస్తృతి పెరిగింది. మార్కెట్ పెరిగింది. ఒక ప్రాంతీయ సినిమా కూడా వందల కోట్లు వసూలు చేయగలుగుతున్నది. ప్రపంచానికి కొరియా తన కొరియన్ టచ్ చూపించినట్టుగా, ఇండియా తన ఇండియన్ టచ్ చూపించలేక పోతుంది. దీనికి కారణాలు ఎవరికి వారు ఆత్మ శోధన చేసుకోవలసిందే. భారతీయ సినిమా వందకు తొంభై శాతం మనీ మేకింగ్ మెషిన్ మాత్రమే. దానికి కళ, కల అన్న పదాల పట్ల పెద్దగా పట్టింపు లేదు. డబ్బు వసూలు చేయడమే సినిమా విజయానికి గుర్తు. హృదయాన్ని స్పందింప చేయడమూ సినిమా విజయానికి సూచనే అన్న గ్రహింపు దానికి లేదు.
మన దగ్గర కూడా ఏటా చిత్రోత్సవాలు జరుగుతాయి. కలకత్తా, తిరువనంతపురం, ఢిల్లీ ఇలా వరుసగా. కానీ మన భాగస్వామ్యం నవ్వు తెప్పించేదిగా ఉంటుంది. గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కి తెలుగు ఎంట్రీ 'ఎఫ్ 2' సినిమా. ఇలాంటి సాఫ్ట్ పోర్నో సినిమాలతో పురస్కారాలు ఎలా సాధ్యం? కానీ ఎప్పటికైనా భారత్ సిగలో ఆస్కార్ జాబిలి మెరియాలంటే అది ప్రాంతీయ సినిమా ద్వారానే సాధ్యం. ఏ తెలంగాణ సినిమానో, అస్సామీ సినిమానో, మరాఠీ సినిమానో కచ్చితంగా ఆస్కార్ సాధించి తీరుతుంది. కౌఫిక్ (కొరియన్ ఫిలిం కౌన్సిల్) లాగా మన ఫిలిం చాంబర్లు, ప్రభుత్వాలు కలసికట్టుగా కృషి చేస్తే ఆస్కార్ కల వరించి తీరుతుంది. రాజకీయాలు పక్కన పెట్టాలి. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించాలి. అకాడమీనే తన నిబంధనలు సవరించుకుని మంచి సినిమాలు పంపండి ప్రతిభకు పట్టం కడదాం అంటోంది. ఇండియా వింటుందో లేదో.
- వంశీకృష్ణ,
9573427422