Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిదానందం సదానందానికి ఫోన్ చేశాడు. ఫోనెత్తిన సదానందం భోరు మన్నాడు. సదానందం భోరు వినపడగానే చిదానందం కూడా భోరు భోరుమన్నాడు.
తేరుకున్న తర్వాత అడిగాడు చిదానందం సదానందాన్ని. ఎందుకు భోరుమన్నావని. నువ్వు కూడా భోరు భోరుమన్నావు కదోరు చిదానందం అన్నాడు సదానందం.
నా సంగతి నీకు తెలీందేం కాదు.. వారానికి కనీసం ఐదు సభల్లో ఉపన్యాసం చేస్తుండే వాడ్ని. ఇప్పుడు చూడు అడిగేవాడు లేడు వినేవాడు లేదు. అలవాటయిన ప్రాణం కదా మైకు ముందు మాట్లాడలేక పోవడంతో దవడలు నొప్పులు అని చిదా నందం అంటూండగానే మధ్యలో కట్ చేశాడు సదానందం.
నీ ఉపన్యాసాలకేం కాని నా బాధ ఏమని చెప్పను. సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని చివర్లో మూడే ముక్కలు మాట్లాడి ప్రముఖులకు శాలువాలు కప్పుతూ ఉండేవాడ్ని, మెమంటోలు అందిస్తుండే వాణ్ణి. ఇప్పుడు గోళ్ళు గిల్లుకోవడం తప్ప ఏమీ లేక చేతులు లాగుతున్నయనుకో! అన్నాడు సదానందం.
అబ్బో శాలువాలు కప్పడం! నువ్వూ కప్పుకుంటావు కదా! ఇంత పెద్ద మహమ్మారి జనాలను కంటికి కునుకు లేకుండా చేస్తుంటే నీ శాలువాల గోలమేటోరు.. చిదానందం కంటిన్యూ చెయ్యకుండా ఇది వరకులాగే కట్ చేసి నువ్వు మాత్రం అటు తిప్పి ఇటు తిప్పి ఒకటే ఉపన్యాసాన్ని మళ్ళీ మళ్ళీ ఊకదంపుడు దంచవూ! అన్నాడు సదానందం.
మూతులకి మాస్కులంటారు ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండాలంటారు. మన సంగతి వదిలేయవోరు సదా ఉండేదే కదా కానీ ఈ జాగ్రత్తలన్నీ చెప్పే బడా లీడర్లు చేస్తున్న దేమిటోరు. ప్రారంభోత్సవాలు చెయ్యడం లేదూ యజ్ఞాలూ యాగాలూ చేస్తున్నారు కదోరు. గుంపులుగా జనాన్ని పోగేసుకుని తిరగడం లేదూ పూలు జల్లించుకోవడం లేదూ చప్పట్లు కొట్టించుకోవడం లేదూ అని చిదానందొం ఆపకముందే అందుకున్నాడు సదానందం.
చప్పట్లంటే గుర్తు కొచ్చింది. ఆహా ఆ సభలు ఆ జనాలు ఆ చప్పట్లు ఈ మాయదారి జబ్బు రాక ముందంతా సభలూ, సత్కారాలూ సన్మానాలూ ఉపన్యాసాలూ పత్రికల్లో ఫోటోలూ తల్చుకుంటేనే ఏడుపు వస్తున్నది అన్నాడు.
నువ్వెన్నయినా చెప్పు చప్పట్ల మజాయే వేరు. వాటికి మా చెడ్డ గొప్ప శక్తి ఉందోరు అన్నాడు చిదానందం.
ఇన్నాళ్ళూ నేనూ అదే అనుకునే వాడ్ని కాని లాభం లేదు. కంటికి కనిపించని శత్రువు చప్పట్లు కొడితే తోక ముడ్చుకు పారిపోతుందన్నారు యేదీ మిద్దెలెక్కీ మేడలెక్కీ బాల్కనీల్లో నిలబడీ లక్షలాది మంది చప్పట్లు కొట్టారు కదా. చప్పట్లు చప్పుడు చాలదని పళ్ళేలు తప్పేళాల మీద గుండు గంటెల్తో బాదారు కదా. యేం జరిగింది. ఆ దరిద్రపు గొట్టు జబ్బు చప్పట్లు కొట్టి పిలుస్తున్నారనుకుందేమో పారిపోడానికి బదులు మరింత లోపలికి జొరబడింది చిదా అన్నాడు సదా.
అవునవును అరచేతులు ఎర్రబడేట్టు నేనూ చప్పట్లు కొట్టాను. వాట్సప్పులో వీడియో పెట్టాను చూశావు కదా సదా అన్నాడు చిదా.
నేనూ వాట్సప్పులో పెట్టాను కదా దీపాలంకరణ. ఆ మాయదారి సూక్ష్మక్రిమి కళ్ళు బైర్లు కమ్మి ఒళ్ళు పేలిపోయి పారిపోతుందని ఎన్ని దీపాలు వెలిగించారు జనం పనిలో పనిగా పోయిన దీపావళికి మిగిల్చిన బాంబులు కూడా పేల్చారు. దాని ముఖం మండ లక్ష వత్తుల దీపాలు వెలిగించి ఆహ్వానిస్తున్నారనుకుందేమో మరింత దూకుడుగా వచ్చింది సదానందం అన్నాడు చిదానందం.
ఫలానా తేదీన పారిపోతుందని ఒకడు రాహువో కేతువో ఓ కొంప నుంచి మరో కొంపలోకి దూకితే చచ్చూరుకుంటుందని మరొకడు అల్లం అని ఒకడు వెల్లుల్లి అని ఒకడు వేడి నీళ్ళని ఒకడు అంతా గందరగోళ పెట్టేవాళ్ళే చిదానందం.
అవునవును ప్రభుత్వం వారు కూడా ఇన్ని కేసులు అన్ని కేసులు ఫలానా తేదీకి హాంఫట్ అన్నారు. తాళాలు వేశామన్నారు తీశామన్నారు మేం ఉన్నాంగా అన్నారు ఇప్పుడేమో మా వల్ల కాదు చేతులెత్తేశాం ఎవరి ప్రాణాలకు వారే 'జవాబుదారీ' అంటున్నారు సదానందం.
మాస్కుతో ముక్కుమూసుకుందాం సబ్బులు అరగదీ స్కుందాం. మళ్ళీ మంచి రోజులు మనం సభలకు వెళ్తామని ఆశిద్దాం. బై బై అంటూ ఫోన్ పెట్టేశాడు చిదానందం.
- చింతపట్ల సుదర్శన్, 9299809212