Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన మాట తీరును బట్టి ఎదుటి వ్యక్తులు తమ మనసులో మన పట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. మన సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. మనం జీవితంలో ఆశిస్తున్న రంగంలో ఎదుగుదలకు ఈ అంశాలు ఉపయోగ పడతాయి. కొంత మంది వ్యక్తులు మాట్లాడుతుంటే వినాలని అనిపిస్తుంది. మరికొందరు మాట్లాడుతుంటే మనకు విసుగు జనిస్తుంది. స్పష్టమైన ఉచ్ఛారణ, మాటల్లో ఆత్మ విశ్వాసం తొణికిస లాడాలి. అప్పుడే మీకు ఎదుటి వ్యక్తులు ఆకర్షితులవుతారు. వినసొంపైన కంఠస్వరాన్ని ఎలా అలవర్చుకోవాలి? దీని కోసం మీ కంఠ స్వరం ఎలాఉందో మీరు పరీక్షించుకొండి. మీ మొబైల్ ఫోన్లో మాటలను రికార్డు చేయండి. వాటిని జాగ్రత్తగా వినండి. మీరు మాట్లాడిన మాటలను స్పష్టంగా ఉచ్చరిస్తున్నారో లేదో ఒకసారి పరిశీలించండి. పొరపాట్లను సరిదిద్దండి. మళ్లీ రికార్డు చేయండి. మళ్లీ వినండి. ఇలా రెండు మూడు పర్యాయాలు చేసిన తరువాత మీ కంఠస్వరంలో ఎంతో మార్పు వస్తుంది. ఈ రోజుల్లో మన మాటే మనకు అద్భుతమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. మనం మాట్లాడిన తరువాత ఆలోచించకూడదు. బాగా ఆలోచించిన తరువాతనే ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాలి. ఒకసారి మన నోటి నుంచి బయటకు వెలువడిన మాటను వెనక్కి తీసుకోలేం. అనాలోచితంగా మాట్లాడిన మాటలు ఎదుటి వ్యక్తిని గాయపర్చవచ్చు. కన్నీరు పెట్టవచ్చు. బాధపెట్టవచ్చు. అది మీ వ్యక్తిత్వ వికాసానికి ఎంతో నష్టం కలుగజేస్తుంది.
మిత్రమా.. మన కంఠస్వరం మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అలాగే మనకు సన్నిహితమయ్యే వ్యక్తులు మన పట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకొనేందుకు దోహదం చేస్తుంది.మనలో చాలా మంది వ్యక్తులు సోమరితనం వల్ల తమ సంభాషణ తీరును మెరుగు పర్చుకొనేందుకు ప్రయత్నించరు. మీరు పట్టుదలగా ప్రయత్నిస్తే ఆకర్షణీయమైన కంఠస్వరం మీ సొంతమవుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు గాని, ఏదైనా విందుకు హాజరైనపుడు గాని మనం అనేక మంది వ్యక్తులను కలుసుకుంటాం. వారు ఎలాంటి వ్యక్తులో ఎలా అంచనాకు వస్తాం? ముందుగా ఎదుటి వారి రూపాన్ని చూసి ఒక అభిప్రాయం ఏర్పరుచుకుంటాం.తరువాత వారితో మనకు పరిచయం ఏర్పడుతుంది. వారి సంభాషణ విన్న తరువాత వారి పట్ల మరికొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాం. ఈ సందర్భంగా వారి కంఠస్వరానికి మనం అత్యధిక ప్రాముఖ్యత నిస్తాం. సంభాషణ శక్తి మనకు చిన్న వయస్సులోనే అలవడుతుంది. మన జీవితంలో ఎంతటి ప్రధాన భూమిక వహిస్తుందో మనం వెంటనే గుర్తించక పోవచ్చు. అయితే మన కంఠస్వరం మృదువుగా, ఆకర్షణీయంగా ఉన్నట్లయితే ఎదుటి వారికి మనం చెప్పే విషయంపై ఆసక్తి ఏర్పడుతుంది. ఎదుటివారు మన కంఠస్వరాన్ని గమనిస్తారు. దానిని బట్టే మనపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. అందువల్ల మనం జీవితంలో ఎదిగేందుకు మాటలను జాగ్రత్తగా వాడాలి. అవే మనం పురోగమించేందుకు ఆయుధాలుగా ఉపయోగ పడతాయి. మన కంఠస్వరం భిన్నరకాలుగా ఉండవచ్చు. ఒక్కొక్కరి కంఠస్వరం వైవిద్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక విశిష్టమైన కంఠస్వరం ఉంటుంది. అందుకే మనం సెల్ఫోన్లో అవతలి వ్యక్తి మొదటి మాట వినగానే ఆయనను లేదా ఆమెను గుర్తుపట్టగలుగుతాం.
ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు తమ కంఠ స్వరాన్ని వినసొంపుగా తయారు చేసుకుంటారు. కఠోరమైన సాధన ద్వారా అలా మార్చుకుంటారు. మీరు ఒక సారి మానవ చరిత్రను పరిశీలించండి. అనేక ఉద్యమాలలో నాయకులు చేసిన ప్రసంగాలు లక్షల మందిని కదిలించాయి. కార్యోన్ముకులను చేశాయి. అనేక దేశాల్లో ఉత్తమ రాజకీయ వ్యవస్థలు ఏర్పడేందుకు ఉద్యమాలు ఉపకరించాయి. అనేక మంది వ్యక్తులతో మాట్లాడుతున్నపుడు వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచాలో వారికి తెలుసు. అలాగే శ్రోతల్లో సానుభూతిని, ఆసక్తిని ఎలా పెంపొందింప జేయాలో వారికి తెలుసు. వివిధ అంశాలపై ప్రజల ఉద్వేగాలను మలచడంలో వారు సిద్ధహస్తులు. అలాంటి వారు తమ మాటలను తూటాల లాగా వాడతారు. మనం ఏమాత్రం ప్రయత్నించినా మన కంఠ స్వరాన్ని ఉత్తమంగా మార్చుకోవచ్చు. కొందరు ముక్కుతో మాట్లాడతారు. మరికొందరు బంగురు గొంతుతో మాట్లాడతారు. ఇంకొందరు కటువుగా మాట్లాడతారు. కొంత మంది వ్యక్తులు గొణిగినట్లు మాట్లాడ్తారు. ఒక్కొక్కరి మాట తీరు ఒక్కో విధంగా ఉంటుంది. బిడియానికి లోనైన వ్యక్తులు మాత్రం అత్యంత వేగంగా మాట్లాడ్తారని మానసిక నిపుణులు గుర్తించారు. ప్రతి వ్యక్తి తన కంఠస్వరాన్ని మార్చుకునేందుకు అవకాశం ఉంది. దానికి కొంత సాధన అవసరం. మీ మాట తీరే మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు అవకాశ కల్పిస్తుంది. అందువల్ల వ్యక్తిత్వ వికాసంలో మాటల ప్రయోగానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. కంఠస్వరాన్ని ఆకర్షణీయంగా మార్చుకోవడం ద్వారా మనం ఆశించిన గమ్యానికి చేరువ కావచ్చు.
- జి.గంగాధర్ సిర్ప, 8919668843