Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్ హిట్ సినిమాలు తీసిన వారు తమకు'హిట్' సినిమా తీసే 'ఫార్ములా' వంట బట్టిందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఒక పెద్ద హిట్
సినిమా తీశాక, ఆ తర్వాత అంతకంటే పెద్దహిట్ ఇవ్వాలని గతంలోకంటే భారీగా ఖర్చుపెట్టి, సినిమా తీసి- ఘోర పరాజయం పొందిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు 'షోలే' (హిందీ) వంటి పెద్ద హిట్ చిత్రాన్ని అందించిన రమేశ్ సిప్పి, ఆ తర్వాత అంతకంటే భారీ తారాగణంతో 'షాన్' చిత్రం తీస్తే, అది 'సూపర్ ప్లాప్' అయింది!
'పాతళ భైరవి' వంటి విజయవంతమైన జానపద చిత్రాన్ని తీసిన విజయా వారు ఆ తర్వాత మరో భారీ జానపద చిత్రాన్ని తీశారు.అదే ఎన్టీఆర్, ఎస్విఆర్, శ్రీరంజని, సావిత్రి ముఖ్యపాత్రల్లో నటించిన 'చంద్రహారం'. ఈ చిత్రం ద్వారానే కమాలాకర కామేశ్వరరావు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం ఎవరూ ఊహించలేనంత దారుణంగా 'ఫ్లాప్' అయింది! ఎందుకిలా అయిందని నిర్మాతలలో (నాగిరెడ్డి - చక్రపాణి) ఒకరైన చక్రపాణి గారిని అడిగితే ''హీరో ఎప్పుడూ నిద్రపోతూ ఉంటే, ఆ సినిమా ఎలా 'హిట్' అవుతుంది?'' అన్నారు. ఆ వ్యాఖ్య అందరినీ ఆశ్చర్యపరిచింద. ఎందుకంటే స్వయంగా రచయిత అయిన చక్రపాణికి హీరో నిద్ర గురించి స్క్రిప్టు దశలోనే ఎందుకు తెలియలేదా అని!
- బి.కె.ఈశ్వర్