Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీలను సమాజం ఒక చట్రంలో మిగించి ఉంచి వారిని తనకు అనుకూలంగా తయారుచేసుకుంటుంది. ''మన సమాజంలో స్త్రీలు పుట్టరు. తయారు చేయబడతారు'' అన్న మాట అక్షరాలా నిజం. ఒక స్త్రీ ఎలా ఆలోచించాలో ఏం ఆలోచించాలో, ఎలా బతకాలో, ఎలా జీవితాన్ని గడపాలో అన్నిటిని సమాజం నిర్దేశిస్తుంది. ఇక్కడ సమాజం అంటే పురుషులు, స్త్రీలు ఇద్దరూ సమాన పాత్ర వహిస్తారు. సమాజ నియమాలకు భిన్నంగా ఉండి ఆ నియమాలను, నియంత త్వాన్ని ప్రశ్నించే స్త్రీ అంటే సమాజానికి చాలా భయం. ఎందుకంటే ఆ స్త్రీ వారిని వేసే ప్రశ్నలు వారి మనసులోని పొరలను బహిర్గతం చేస్తాయి. అలాంటి స్త్రీ అంటే భయపడే సమాజం ఆమెను నైతికతలేని స్త్రీగా ప్రచారం చేస్తుంది. ఆమె మర్యాదస్తురాలు కాదని, ఆమెలాంటి స్త్రీలు సమాజానికి, ఆనందకరమైన జీవితానికి అడ్డు అని వాదిస్తుంది. కాని వీటన్నిటిని తట్టుకుని మనసులోని గాయలకి తామే మందు రాసుకుంటూ, సమాజంలోని హిపోక్రసీని కసితో ప్రశ్నిస్తూ ఉండే అతికొద్ది స్త్రీలు అక్కడక్కడా కనిపిస్తారు. వీరు మర్యాద స్తుల కుటుంబాలకు తలనొప్పిగా మారి, వెలివేయబడి, సమాజం చేతిలో శిక్షకు, వివక్షకు గురి అయినా నిటారుగా నిలబడి ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎందుకంటే కొందరు స్త్రీలు అంతే... వారి జీవన శైలి మనకు అర్ధం కాదు. వారి నిజాయితీ మనం భరించలేం. అలాంటి ఒక స్త్రీ కథే ''ఆవళ్ అప్పడిత్థణ్''. 1978 లో వచ్చిన తమిళ సినిమా. దీని దర్శకులు రుద్రయ్య. వీరికి ఇది మొదటి సినిమా. ఈ దర్శకులు కేవలం రెండు సినిమాలు మాత్రమే తీసారు. ''ఆవళ్ అప్పడిత్తణ్'' తీయడం ఆ రోజుల్లో పెద్ద సాహసమే. ఈ సినిమాలో ఒక స్త్రీ తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ, తనను తాను సోధించుకుంటూ, తనకు ఏర్పడిన పురుష సంబంధాలలో తన వ్యక్తిత్వాన్ని కాపాడు కోవాలను కుంటూ, స్త్రీల పట్ల పురుషులలోని ఆధిపత్య ధోరణిని నిలదీస్తూ జీవించడం కనిపిస్తుంది. కేవలం పురుషుడిని ఆనంద పరచడానికి స్త్రీ జీవితాన్ని మలచుకోవాలని నిర్దేశించే సమాజంలో ఆ ఆనందం లో తానూ అనుభూతి చెందాలని, స్త్రీ పురుష సంబంధాలలో హిపోక్రసీ ఉన్న చోట దోపిడి ఉంటుందని ఆ దోపిడిని తాను అంగీకరించనని ఎంతో స్పష్టతతో జీవించే పాత్ర మంజు.
మంజు బాల్యం ఘర్షణతో గడుస్తుంది. తండ్రి నోరు లేని వ్యక్తి. తల్లి అక్రమ సంబంధాలలో మునిగి తేలుతుంటుంది. ప్రేమ దొరకని ఇంట ఒంటరి అయి చిన్న వయసులో బంధువు చేతిలో అత్యాచారానికి గురి అవుతుంది. స్త్రీ శరీరం పట్ల పురుషుని కాముక బుద్ది, క్రూరత్వం చాలా చిన్న వయసులో అర్ధం అవుతాయి. కాలేజీలో తనను వలచి వెంటపడి ప్రేమించిన స్నేహితుడు, ఉద్యోగం, ఉన్నత జీవితం కోసం మరో స్త్రీని పెళ్ళి చేసుకుంటాడు. ఒక క్రిస్టియన్ ఫాదర్ కుమారుడు మిత్రుడవుతాడు. ఆమెను ప్రేమించానని నమ్మిస్తాడు. శారీరకంగా కలిసిన తరువాత అతనితో తన జీవితాన్ని గడపడానికి తనను తాను మార్చుకోవాలని ఆమె ప్రయత్నిస్తూ మానసికంగా అతనికి దగ్గర అవుతున్న సమయంలో తండ్రితో ఎదో విషయంలో గొడవ జరుగుతుంది. ఇల్లు వదిలి ప్రియుని దగ్గరకు వచ్చెస్తుంది. కాని ఆమె తండ్రికి ఆమెను అప్పగిస్తూ మంజు నా చెల్లెలు లాంటిది అని చెప్తూ ఆమె ప్రియుడు తెలివిగా తప్పించుకుంటాడు. అతని నైజం తెలిసి నిర్షాంతపోతుంది. ఒక స్త్రీతో శారీరికంగా కలిసి ఆమెను చెల్లెలు అని చెప్పగలిగిన ఆ మర్యాదస్తుడిని చూసిన ఆమె కోపంతో రగిలిపోతుంది. పురుష ద్వేషిగా మారుతుంది.
తరువాత ఎవ్వరికి దగ్గర కాలేకపోయినా సమాజంలో స్త్రీ పురుష సంబంధాలలోని డొల్లతనాన్ని దగ్గర నుండి చూడడం ప్రశ్నించడం అందులోని నాటకీయతను ఒప్పుకోకపోవడం ఆమె స్వభావం అవుతుంది. ఆఫీసులో ఆమె బాస్ త్యాగు. స్త్రీ కేవలం అనుభవించడానికే అని నమ్మే సగటు మొగాడు. స్త్రీ లొంగితే అనుభవించడం లేదా లొంగదీయడానికి ప్రయత్నించడం, ప్రయత్నం ఫలించకపోతే మరొకరిని వెతుక్కోవడం ఇది అతని ఫిలాసఫి. జీవితం అనుభవించడానికే అని మగాడిగా సమాజం తనకు కల్పించిన అవకాశాలను నిర్మోహమాటంగా వాడు కుంటూ జీవించడం అతని నైజం. అరుణ్ స్త్రీలపై ఒక డాక్యుమెంటరీ తీయడానికి త్యాగు సహాయం కోరతాడు. అరుణ్ సున్నితంగా ఆలోచించే వ్యక్తి. స్త్రీ వ్యక్తిత్వాన్ని, మనసును, అస్థిత్వాన్ని గౌరవించే మనిషి. అతను మంజు తో కలిసి ఈ డాక్యుమెంటరీ కోసం పని చేస్తూ ఉంటాడు. ఈ సినిమాకి ఈ డాక్యుమెంటరీ కోసం చేసిన ఇంటర్వ్యూలు పెద్ద అసెట్. ఆధునిక మహిళ నుండి కాయకష్టం చేసుకునే మహిళల దాకా సమాజం నిర్ణయించిన మూసలో స్త్రీలు జీవించే విధానం, ఆ మూసనుండి బైటపడే కనీస ఆలోచన లేని మహిళల జీవితాలను దర్శకుడు మనకు ఇక్కడ చూపిస్తాడు. వారంతా సమాజంలో తమ స్థానాన్ని సహజంగా స్వీకరించి పురుషుని ఆధిపత్యాన్ని జీవన విధానంగా అంగీకరించే వ్యక్తులు. వివిధ రంగాలకు చెందిన ఎందరో స్త్రీలు, వివిధ వత్తుల వాళ్ళూ ఇక్కడ కనిపిస్తారు. వీరంతా తమ ఇంటిని నడీపించడానికి నిరంతరం శ్రమించే ప్రాణులు. కాని తాము వివక్షకు గురి అవుతున్నం అన్న కనీస ఆలోచన లేని వారు. ఆలోచన కలిగినా గాని ప్రశ్నించడం మరిచిన వారు.
వీరిని విశ్లేషిస్తూ అరుణ్, మంజు వ్యక్తిత్వానికి ఆకర్షితుడవుతాడు. ఆమె గతం తెలుసుకుని ఆమె చూసిన పురుషుల కారణంగా అమెలో ఉన్న కోపాన్ని అర్ధం చేసుకుంటాడు. ఒక సాధారణ మహిళ లాగా ఆనందంగా గడపాలనే కోరిక ఉన్నా చూట్టు ఉన్న హిపోక్రసికి రాజీ పడలేక విపరీతమైన ఒత్తిడికి లోనై బాధపడే ఆమెను దగ్గరగా గమనిస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. కాని ప్రేమను గుర్తించలేని స్థితిలో మిగిలిపోయిన మంజు అతని సాంగత్యాన్ని ఆస్వాదిస్తుంది కాని అతన్ని తన జీవితంలోకి ఆహ్వానించడానికి తటపటాయిస్తుంది. ఈ లోపల త్యాగు ఆమెను లోబర్చుకోవాలనుకోవడం ఆమె అతని మర్యాదస్తుని ముసుగు తొలగించి అతని అసలు రూపం నలుగురుకి చూపాలనుకునే పట్టుదలకి పోవడం, ఇవన్నీ అరుణ్ ను ఆమెకు దూరం చేస్తాయి. చివరకు అరుణ్ మరో అమ్మాయిని వివాహం చేసుకుని తిరిగి వస్తాడు. మొదటి సారి అరుణ్ భార్యను మంజు స్త్రీ స్వాతంత్య్రం పై ఆమె అభిప్రాయం అడుగుతుంది. అమాయకంగా అలాంటివి తనకు తెలీదని ఆమె జవాబు చెబుతుంది. అప్పుడు మంజు ఇచ్చే జవాబు చాలా ప్రశ్నలకు జవాబుగా తీసుకోవచ్చు. ''అయితే నీవు సంతోషంగా ఆనందంగా ఉండగలవు'' అంటు మంజు కారు దిగి వెళ్ళిపోవడంతో సినిమా ముగుస్తుంది.
మనం చూసే కమర్షియల్ సినిమాకు ఎంతో భిన్నమైన శైలిలో ఈ సినిమా నిర్మాణం జరిగింది. ప్రెంచ్ దర్శకుడు రాబర్ట్ బ్రెసెన్ ప్రభావం ఈ సినిమాపై కనిపిస్తుంది. సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీసారు. చాలా షాట్లలో నీడలను బాగా వాడుకోవడం జరిగింది. అక్కడక్కడా గురుదత్ సినిమా స్టైల్ కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా వరకు క్లోజ్ అప్ షాట్లు సినిమాను నడిపిస్తాయి. సినిమాలో వాడిన భాషలో ఒక ఓపెన్ నెస్ కనిపిస్తుంది. మంజు ని సంబోధిస్తూ ఎన్నో సార్లు త్యాగు వాడిన భాష, ఇచ్చే స్టేట్మెంట్లు పక్కా మగ దురహంకారానికి నిదర్శనాలు. అయితే వీటి కోసం ఇంగ్లీషు భాషను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. మంజు పాత్ర మనకు గుర్తుండి పోతుంది. శ్రీప్రియ నటన చాలా బావుంటుంది. తన జీవితంలోకి వచ్చిన పురుషుల గురించి అంత నిస్సంకోచంగా చర్చించే స్త్రీ పాత్రను ఇప్పట్లో కూడా ఈ స్థాయిలో ఇంత క్లారిటి అండ్ మెచ్యూరిటితో ఆధునిక దర్శకులు మలచలేక పోతున్నారన్నది నిజం. ఒక స్త్రీ తన జీవితంలో ఏ దోపిడిలేని సంబంధాన్ని కోరుకోవడం దాని కోసం ప్రయత్నించడం, విఫలవయినా ఓడిపోకుండా మొండిగా నిలబడడం, అందుకోసం సమాజాన్నే ఎదిరించి తానే ఒక ప్రశ్నగా మిగిలిపోవడం. అయినా రాజీపడడానికి ఇష్టపడకపోవడం మంజు పాత్ర లక్షణాలు. ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితులవ్వకుండా ఉండలేం. భారతీయ సినిమాలో మంజు లాంటీ స్త్రీ పాత్రలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఆ పాత్ర వేసే ప్రశ్నలకు జవాబులెతుక్కోవడానికి ఎన్ని తరాలు మారాలో. త్యాగు పాత్రలో రజనీకాంత్, అరుణ్ పాత్రలో కమల్ చాలా చక్కగా నటించారు. భారతీయ సినిమాలో ఒక గొప్ప సినిమాగా మణాల్ సేన్ వంటి దర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రం లోని మంజు నాకు బాగా నచ్చిన సినీ పాత్ర. ఈ సినిమా యూ ట్యూబ్ లో ఉంది. కాని సబ్ టైటిల్స్ లేవు. ఇలాంటి చిత్రాలను ఇప్పటికైనా అన్ని భాషలవారికి అందుబాటులో ఉండేలా ఎవరూ ప్రయత్నించకపోవడం ఆలోచించవలసిన విషయం.
- పి.జ్యోతి మనోజ్ఞ
9885384740