Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంక నా వల్లకాదు. పూర్తిగా 'టైర్' అయిపోయాను అన్నాడు తెల్ల గుఱ్ఱం మీది రాకుమారుడు. తమరు అలిసిపోతేనేం తమరి హార్స్ పవర్ ఏమీ తగ్గలేదు. ఎల్లాగ రేసు గుర్రంలా పరుగెడ్తున్నది అన్నాడు నల్ల గుఱ్ఱం మీది మంత్రి కుమారుడు.
రాజు గారు కుమారుడి తలకి కిరీటం తొడిగి చేతికి ఖడ్గం యిస్తామన్నారు. షోగ్గా, కులాసాగా, దిలాసాగా తిరిగి వద్దామని రాజకుమారుడు, మంత్రి కుమారుడ్ని వెంట పెట్టుకుని ఓ రాత్రి వేళ కోట దాటాడు.
నిన్న రాత్రి తిన్న గుగ్గిళ్ళు అరగక గుర్రం దౌడు తీస్తున్నదేమో కాని నాకు మాత్రం ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు రాకుమారుడు.
అవును మరి పన్నీటి జలకం లేదు. ఫలహారం లేదు. పానీయమూ లేదు. మీ 'బాడీ'కి అంతా కొత్త గానూ వింతగానూ ఉండి ఉంటుంది. ఇంకెంతో దూరం అక్కర్లేదు. ఆ కనిపిస్తున్న పట్నం చేరుకుంటే ఈ రోజంతా తిని తొంగుందాం యూ డోంట్ వర్రీ అన్నాడు మంత్రి కుమారుడు.
దూరంగా ఇళ్ళు కనపడ్డంతో ప్రాణం లేచి నిలబడి స్థిమిత పడ్డాడు రాకుమారుడు. ఇద్దరూ ఊళ్ళో ప్రవేశించి భోజనానికీ, వసతికీ ఎక్కడ బాగుంటుందో వాకబు చేసి ఆ లాడ్జింగ్కి చేరుకున్నారు.
గుర్రాల్ని చెట్టుకింద 'పార్కు' చేసి లోపలికి వెళ్ళారు. అక్కడ తలనెరిసిన ఎనభై యేళ్ళ పెద్దమ్మ అరవై యేళ్ళ ఆడమనిషిగా ఉషారుగా, అటూ ఇటూ తిరుగుతున్నది. వచ్చిన 'కస్టమర్లు' ఖరీదైన వాళ్ళేనని గమనించి గబగబా పరుగెత్తుకు వచ్చింది. ఆసనాలు చూపించింది. 'వెల్కమ్ డ్రింక్' యిప్పించింది. తర్వాత వినయ విధేయ పెద్దమ్మలా అడిగింది 'టూరిస్టులు'గా వచ్చారా? ఎన్నాళ్ళుంటారు ఏమేం తింటారు అని.
దేశాలు తిరగాలని వచ్చాం. విశేషాలు చూడాలని వచ్చాం. వింతలు కళ్ళింతలు చేసుకు చూడాలని వచ్చాం. ఆకలితో ఉన్నాం 'డిటెయిల్స్' తర్వాత చెప్పాం. మెనూ కార్డు యిప్పిస్తే 'లంచ్' ఆర్డర్ చేస్తాం అన్నాడు మంత్రి కుమారుడు. రాజకుమారుడు డిగ్నిటీ 'మెయిన్టైన్' చేస్తూ కూచున్నాడు.
ఓ.కె. నో ప్రాబ్లం. అతిధులు 'సాటిస్ఫాక్షన్' మాకు ముఖ్యం అంది పెద్దమ్మ కనుబొమ్మలు ఎగరేస్తూ
ప్రోటీన్ ఫుడ్డు కడుపునిండా మెక్కడంతో 'ఆంటీబాడీస్' హుశారై పెద్దమ్మ ముందు సోఫాలో రాకుమారుడూ తీరిగ్గా కాళ్ళూపుకుంటూ కూచుంటే మంత్రి కుమారుడు హుశారుగా 'ఇంక్వయిరీ' మొదలుపెట్టాడు.
పెద్దమ్మా ఈ పట్నం విశేషాలేమిటి? ఇంపార్టెంట్ విజటింగ్ ప్లేసెస్ ఏమిటి అని అడుగుతూ ఉండగానే అనుకోకుండా 'హచ్' అని తుమ్మేడుజ
శతాయుష్షు అనో చిరంజీవ అనో అనవలసిన పెద్దమ్మ ఉలిక్కిపడింది. ముఖం కళ తప్పింది. చుట్టూ చూసింది. ఎదురుగ్గా ఉన్న ఇద్దరు తప్ప మరొక ప్రాణి అక్కడ లేకపోవడంతో కొంచెం సంబాళించుకుంది. కొంప మునిగి పోయినట్లు 'బాబూ బాబూ!' అంటూ అరిచింది. ఆ అరుపుకి మంత్రి కుమారుడు కుడి అరచేత్తో ఎడమ వీపు తట్టుకున్నాడు.
నాయనలారా చూస్తే అంతా పైలాపచ్చీసు దాటని వాళ్ళల్లా ఉన్నారు. ఈ ఊళ్ళో బ్రతికి బట్ట కట్టి బయట పడాలంటే ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాజ్యంలో 'తుమ్మడం' నిషేధించబడింది.
ఆఁ అని నోరుని మండువా ఇంటి వసారాలా తెరిచాడు మంత్రి కుమారుడు. పొలమారినట్టుంది. గొంతుకి ఏదో అడ్డం పడ్డట్టనిపించి పొడి దగ్గు పొడ్చుకువచ్చి 'ఖళ్ ఖళ్' మన్నాడు.
పెద్దమ్మ ముఖంలో కత్తి గాట్లు 'ప్లస్'లా, 'ఇంటూ'లా పెట్టినా చుక్క రక్తం కారదు. అయ్యయ్యో ప్రాణాల మీద ఆశ వదులుకుని వచ్చారా ఇక్కడికి. ఇక్కడ 'దగ్గడం' నిషేధం. అని అరిచింది పెద్దమ్మ.
తుమ్మితే తప్పా! దగ్గితే నేరమా! అసలు ఎప్పుడు వస్తుందో తెలీని 'హచ్చి'ని ఎలా ఆపుతాం. దగ్గనేది వస్తే దగ్గకుండా ఆవలించకుండా ఎలాగుంటాం అన్న రాజకుమారుడు ఆవలిస్తూ చిటికె కూడా వేశాడు.
పెద్దమ్మపై ప్రాణాలు పైకి వెళ్ళేటందుకు సిద్ధపడ్డయి. నాయనలూ ఇది సత్యం. ఈ రాజ్యంలో తుమ్మూ, దగ్గూ, ఆవలింతలు నిషేధించబడ్డయి. అప్పుడెప్పుడో ఏళ్ళ కిందట తమ్మూదగ్గూల్తో ఓ మాయరోగం ఒకటి వచ్చి అనేక మంది ఫొటోలు గోడల మీదకెక్కాయంట. అంచేత అప్పుడెప్పుడ్నించో ఈ చేష్టలు రద్దు చేశారు రాజుగారు. ఆఖరుకు మనుషులు ఒకరినొకరు ఆప్యాయంగా కావలించుకోవడానికి కూడా వీల్లేదు అంది పెద్దమ్మ.
ఒకవేళ ఆపుకోలేక ఎవరయినా హాచ్చిమంటే 'ఖళ్ళు'మంటే అన్నాడు రాజకుమారుడు.
మొన్నమొన్నటి దాకా జైలు శిక్షా, మరణ శిక్ష కూడా విధించేవారు. ఇప్పుడు వచ్చిన రాజావారు తెలివైన వారు. తుమ్ముకింత, దగ్గుకింత అని జుర్మానా వసూలు చేస్తున్నారు. ఆ డబ్బుతో ఖజానా నింపుతున్నారు అంది పెద్దమ్మ.
తుమ్మడానికీ దగ్గడానికీ వీల్లేని చోట ఉండడానికి ఇష్టపడక మర్నాడే ఆ రాజ్యం వదిలారు మిత్రులిద్దరూ. ఆ రాజ్యపు సరిహద్దు దాటగానే రాకపోయినా అనేక తుమ్ములూ దగ్గులూ తర్వాత ఒకరినొకరు గట్టిగా కావలించుకున్నారు గుర్రాలు దిగి.
- చింతపట్ల సుదర్శన్, 9299809212