Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి నిత్యం మన మనసులో అనేక ఆలోచనలు దోబూచు లాడుతుంటాయి. మన ఆలోచన ప్రకారమే ఆచరణ కొనసా గుతుంది. మనం ఏదైనా పని మొదట్లో ఎంతో ఉత్సాహంతో ప్రారంభిస్తాం. కొంతకాలం గడుస్తుంది. ఆ పనిపై ఆసక్తి తగ్గు తుంది. ఇంకా కొంతకాలం గడుస్తుంది. ఆ పనిపై మనకు విసుగు ప్రారంభమవుతుంది. మరి కొంతకాలం గడుస్తుంది ఆ పని పట్ల మనకు అయిష్టత ఏర్పడుతుంది. ఆ పని చేయాలంటే విపరీతమైన శ్రమ అనిపిస్తుంది. కొంతకాలం తరువాత ఆ పని చేసేందుకే నిరాకరిస్తాం. మధ్యలో చేస్తున్న పని ఆపివేసేందుకు ప్రయత్నిస్తాం. మరో పని చేపట్టేందుకు ప్రయత్నిస్తాం. కానీ తీవ్రమైన ఒత్తిడి వల్లగాని, ఇతర కారణాల వల్ల గాని మనం మొదట చేపట్టిన పనినే కొనసాగించవలసిన పరిస్థితి ఎదురు కావచ్చు.
అప్పుడొక అద్భుతం జరిగేందుకు అవకాశముంది. మొదట మనం చేపట్టిన పని చేస్తున్న క్రమంలో కొంతకాలం గడిచే సరికి ఇబ్బంది కరమైన పరిస్థితి తొలగిపోతుంది. ఇకపై ఆ పని చేయడం ఎంత మాత్రం శ్రమ అనిపించదు. అంతేకాదు పని ప్రారంభించినప్పటి కంటే ఇపుడు ఎంతో ఉత్సాహంగా ఆహ్లాద కరంగా ఉంటుంది. మనం ఈ సమయంలో నూతన శక్తిని సంతరించుకుంటాం. బాధకరంగా అన్పించిన దశను అధిగ మించడం ద్వారా మనలో అంతర్గతంగా నిక్షిప్తమైన ఉన్న అద్భు తమైన శక్తి అందుబాటులోకి వచ్చింది. మనం ఎంతమాత్రం చేయలేమని భావించిన పనిని ఇపుడు సంతోషంగా చేయ గలుగుతాం. ఇక క్రమంగా మనం ద్విగూణికృతమైన ఉత్సాహం తో పనులు చేస్తాం. ఫలితాలు వస్తాయి. మనం భారం అనుకున్న పనిని తేలికగా నిర్వహించగలిగే శక్తి ప్రతిభ మనలో అంతర్గతంగా ఉందన్న విషయాన్ని మనం ఆలస్యంగానైనా గుర్తిస్తాం. అపుడు మనం చేస్తున్న పనుల్లో గుణాత్మకమైన మార్పు కనిపిస్తుంది. సమర్థవంతంగా పనులు చేయగలమనే విషయాన్ని మనం కలలో కూడా ఊహించం.మనలో వ్యక్తమైన ఈ శక్తిసామర్థ్యాలు చివరికి మనల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
ఉదాహరణకు విజయలక్ష్మి అనే విద్యార్థిని ఎంబీబీఎస్ నాలుగవ సంవత్సరం చదువుతోంది. ఉన్నత పాఠశాలలో చదివే రోజుల నుంచి ఆమె వైద్య వృత్తి చేపట్టాలని కలలుగనేది. మెడికల్ కోర్సులో చేరిన తరువాత మూడు సంవత్సరాలు ఆమె ఎంతో కష్టపడి చదివింది. కానీ 4వ సంవత్సరంలో చదువుపై ఆసక్తి తగ్గింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు వైద్య విద్య అభ్యసిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక మానసిక నిపుణుడితో కౌన్సెలింగ్ ఇప్పించారు. చదువు ప్రాధ్యాన్యతను గుర్తించిన ఆమె మళ్లీ కష్టపడడం ప్రారంభించింది. మంచి మార్కులు సంపాదించింది. వైద్య వృత్తిలో స్థిరపడింది. మిత్రమా.. తరచుగా మన అభిప్రాయాలు మార్చుకోవడం ద్వారా వివిధ పనుల పట్ల అనాసక్తి కనబరచడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. సమయం వృధాఅవుతుంది. అందువల్ల మనం చేస్తున్న పని పట్ల అయిష్టత ఏర్పడితే దానిని అధిగ మించడానికి పట్టుదలగా ప్రయత్నించాలి. మనుషులందరూ తమలో నిక్షిప్తమైన అంతర్గత శక్తిని ఉపయోగించుకోవచ్చు.
మనం ప్రతి రోజూ అనేక పనులు చేస్తాం. కాని రాత్రివేళ మనం ఆ రోజు చేసిన పనులను సమీక్షించుకోవాలి. అంతకంటే ఎక్కువ పనులను నిర్వహించగల సత్తా మనలో ఉందన్న విషయాన్ని గుర్తించాలి. పని విధానాన్ని మెరుగు పర్చుకోవాలి. ఉత్తమ ఫలితాలు సాధించాలి. మనకున్న ప్రతిభలో స్వల్ప భాగాన్ని మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. ప్రఖ్యాత రచయితలు, శాస్త్రవేత్తలు ఉన్నత స్థాయికి చేరుకున్న రాజకీయ వేత్తలు తమ తమ జీవితాల్లో అనేక ఒడుదుడుకులను ఎదుర్కొన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి. అంతేకాకుండా తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెలికి తీసుకు రావడం వల్లే అద్భుతమైన ఫలితాలను సాధించారని గుర్తించాలి. తమ లక్ష్యం పట్ల ఉన్న విశ్వాసమే వారిని ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లింది. మనలో కొందరు అసమర్థులు, మరికొంత మంది సమర్థులు ఉన్నారనే భావన సరికాదు. మనందరిలోనూ అద్భుతమైన ప్రతిభ ఉందనే విషయాన్ని గుర్తించాలి. కేవలం క్రమశిక్షణ, దృఢ నిశ్చయం ద్వారానే మనలో నిక్షిప్తమై ఉన్న శక్తిని వెలికి తెచ్చుకోవచ్చు. మనం విజేతల జీవితాలను పరిశీలిస్తే, తాము లక్ష్య నిర్ణయ సమయంలోనే ఎంతో ఆలోచిస్తారు. ఒక సారి లక్ష్యం నిర్ణయిచుకున్నాక ఎన్ని కష్టాలెదురైనా వెన్ను చూపరు. ముందుకే వెళతారు. మునుముందుకు దూసుకు వెళతారు. అలాంటి వారి జీవిత చరిత్రలు చదివితే మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. వాటిని ఆచరించేందుకు స్ఫూర్తిని పొందవచ్చు. మానవాభివృద్ధి వేల సంవత్సరాలుగా కొనసాగు తోంది. మామూలు ఇనుప గొట్టాలు, ఇతర సాధారణమైన సామగ్రిని చేర్చి ఎన్నో విలువైన ఆయుధాలు మానవులు తయారు చేస్తున్నారు. చంద్రమండలం దర్శించి అనేక విషయాలు తెలుసుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఎన్నో విజయాలు సాధించాం. ఇంకా భవిష్యత్తులో సాధించే అవకాశాలున్నాయి. ఈ ప్రపంచం మనం ఊహిస్తున్నట్లు ఇలానే ఉండదు. ఇందులో అనేక మార్పులు వస్తాయి. విసుగు విరామం లేకుండా పని చేయడం ద్వారానే ఏ మనిషైన విజయానికి చేరువవుతారు.
- జి.గంగాధర్ సిర్ప, 8919668843