Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అంటే మరకతమణి కీరవాణి. చాలా మంది అది ఆయన అసలు పేరు కాదనీ, ఓ పెన్ నేమ్లా అలా పెట్టుకుని ఉంటారనీ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కొత్త తరహా పేరు వెనక ఓ చిన్న కథ ఉంది. భరణీ వారి 'విప్ర నారాయణ' (భానుమతి - అక్కినేని) చిత్రం విడుదలైన తర్వాత ఆ చిత్రానికి ఎన్.రాజేశ్వరరావు గారు సమకూర్చిన సంగీతం పండిత పామరులను విశేషంగా ఆకర్షించింది. అలా ఆకర్షితులైన వారిలో కీరవాణి నాన్న గారు ఉన్నారు. 'విప్ర నారాయణ'లోని 'ఎందుకోయీ తోటమాలి' (భానుమతి పాడిన) పాట గొప్పగా నచ్చేసింది. ఆ పాట గురించి వివరంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన స్వయంగా రాజేశ్వరరావు గారిని కలుసుకుని అభినందించారు. ఆ పాట గురించి అడిగారు. అప్పుడాయ ఆ పాటను తాను కీరవాణి రాగంలో బాణీ కూర్చినట్లు చెప్పారు. దాంతో ఆ అభిమాని తనకు మొట్టమొదటిసారిగా అబ్బాయి పుట్టినా, అమ్మాయి పుట్టినా కీరవాణి అనే పేరు పెట్టాలని ఆ నిమిషమే గట్టిగా తీర్మానించుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆయనకు అబ్బాయి పుట్టినప్పుడు అలా కీరవాణి పేరునే ఖాయం చేశారు! పెరిగి పెద్దయిన తర్వాత ఆ కీరవాణే ప్రసిద్ధ సంగీత దర్శకుడై తన పేరుకు సార్థకత తీసుకొచ్చారు!