Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నేను నేనుగానే ఉండగలను. అలాకాక మరోలా ఉండలేను'' ఈ మాట అనడానికి ఇలా జీవించడానికి ఎంత సాహసం కావాలి. సమాజంలోని సౌకర్యాలకు, అవకాశాలకు లొంగి చాలా మంది సమస్యలులేని జీవితాల కోసం తమ ప్రవృత్తిని మార్చుకుంటూ బతికేస్తూ ఉంటారు. వీరి జీవితాలలో సౌకర్యం ఉంటుంది కాని అర్థం ఉండదు. ఆనందించడానికి అనుకూలమైనవి ఎన్నో సాధనాలు ఉంటాయి కాని తప్తి ఉండదు. తెలీని అశాంతితో జీవితంలో ఆలోచించకుండా హడావిడిగా బతికేస్తూ ఉంటారు. కాని ఎన్ని కష్టాలు ఎదురయినా, ఎన్నిటినో కోల్పోవాల్సి ఉన్నా, తన అస్థిత్వాన్ని, తన స్వభావాన్ని, నమ్మకాన్ని సౌకర్యవంతమైన జీవితం కోసం, ఆనందం కోసం కుదువ పెట్టకుండా కష్టాలనే నమ్ముకుని ఆ దారిలో తన ఆదర్శాలతో ప్రయాణం చేసే ఒంటరి వ్యక్తుల ఆత్మ నిగ్రహం ముందు ఎవ్వరయినా తలవంచ వలసిందే. దానికి కావలసిన ఆత్మస్థైర్యం అర్థం అయినప్పుడు అలా బతకడానికి కావలసిన గుండె ధైర్యం కన్నా గౌరవించ వలసినది మరోటి ఈ ప్రపంచంలో కనిపించదు. ముఖ్యంగా అది స్త్రీ అయినప్పుడు ఆమె మనో నిబ్బరం ముందు ప్రణమిల్లాల్సిందే. స్త్రీకి తను అనుకున్నట్లు జీవించే అవకాశాలు ఈ సమాజంలో పురుషునితో పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి. అయినా కొందరు తమ అస్థిత్వాన్ని నిలుపుకో వడానికి తమ మనసు చెప్పే దారిలో సమాజంలోని ఆర్ధిక, సామాజిక, రాజకీయ సూత్రాలన్నీటీనీ అధిగమిస్తూ బతక గలిగారు. అలాంటి స్త్రీ జీవితమే ఈ మళయాళ చిత్రం ''పంచాగ్నీ''.
భారతీయ సినీమాలలో ఒక గొప్ప స్త్రీ పాత్రగా నిలిచిపోతుంది పంచాగ్నీలోని ఇందిర. ఈ చిత్రానికి కథ అందించింది టీ.వాసుదేవన్ నాయర్, దర్శకత్వం వహించింది హరిహరన్. మోహన్ లాల్, గీత, తిలకన్ల నటన ఈ సినిమాలో అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. ఇందిర ఒక స్వాతంత్య్ర సమరయోధురాలి కూతురు. చిన్నప్పటి నుంచి విపరీతంగా చదవడం ఆమె నైజం. ఆ వయసులోని అమ్మాయిలందరిలో భిన్నమైన ఆలోచనలతో ఆశయాలతో జీవిస్తున్న సమయంలో సమాజంలోని దోపిడీతో పోరాడడానికి నక్సలైట్ ఉద్యమంతో కలిసి ప్రయాణిస్తుంది. ఆ సయమంలోనే ఒక గిరిజన బాలికని గర్భవతిని చేసి న్యాయం కోసం అర్ధించడానికి వెళ్ళిన ఆ అమ్మాయిపై కుక్కలను ఉసిగొలిపి హత్య చేయించిన అవచరణ్ అనే భూస్వామిని చూస్తుంది ఇందిర. అతనికి శిక్ష వేయాలని ఉద్దేశించి తన సహచరులతో అతనిపై దాడి చేసి అతన్ని హత్య చేెస్తుంది. ఆ కేసులో కోర్టు ఆమెకు యావజ్జీవ శిక్ష విధిస్తుంది. ఎనిమిది సంవత్సరాల శిక్షా కాలం పూర్తి అయిన తరువాత ఆమె తల్లి ఆఖరి రోజుల్లో ఉందని తెలుసుకుని పద్నాలుగు రోజుల పెరోల్‌పై ఊరికి వస్తుంది. ఈ పెరోల్ కూడా ఆమెకు సులభంగా లభించదు. నిరాహార దీక్ష చేసి పోరాడి, అధికారులను వంచి ఆఖరి రోజుల్లో తల్లిని చూడడానికి ఊరికి వెళ్ళగలిగే పర్మిషన్ సంపాదిస్తుంది.
సినిమా మొత్తం ఈ పద్నాలుగు రోజుల్లో ఇందిర అనుభవించిన జీవితం గురించే. ఊరి వారందరి దష్టిలో ఆమె విచిత్రమైన భయంకరమైన మనిషి. ఆమె తల్లి త్యాగాన్ని, ఉద్యమస్ఫూర్తిని కూడా ఊరు మరిచిపోతుంది. అంతటి ఉదాతమైన స్త్రీ కూడా ఆఖరి రోజుల్లో కేవలం పెళ్ళి కాని ఆమె తమ్ముడి సహాయంతో రోజులు నెడుతూ దీనస్థితిలో కనిపిస్తుంది. మద్య నిషేధం లాంటి ఉద్యమాలలో గాంధీ గారితో పాటు పనిచేసిన ఆ స్త్రీ మూర్తిని సమాజం ఎప్పుడో మర్చిపోయింది. ఇందిర జైలుకి వెళ్ళిందని ఆ కారణంతో ఉద్యోగావకాశాలను పోగొట్టుకున్న చిన్న కుమారుడు కసితో కోపంతో ఉన్మాదంతో ద్వేషంతో తాగుబోతుగా మారి అందరికీ భారమై జీవిస్తుంటే, పెద్ద కొడుకు కుటుంబానికి దూరంగా తనదైన విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటాడు. ఒక చెల్లెలు మాత్రం వివాహం చేసుకుని గహిణిగా తన బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటుంది. ఇందిర రాక వీరందరిలో ఒక రకమైన అలజడిని కలిగిస్తుంది. చెల్లెలు ఆమెను ముందు మనస్పూర్తిగా అహ్వానించినా ఆమె భర్త ఇందిరపై చూపే ఆదరణను సహించలేక, అక్కపై అనుమానం పెంచుకుని ఆమె మనసుని గాయపరుస్తుంది. తల్లి మరణం తరువాత తలకొరివి పెట్టవలసిన కొడుకులిద్దరూ సహకరించకపోవడంతో ఈ చెల్లెలి కొడుకే ఆ తరువాతి కార్యక్రమాలు నిర్వహించవలసి వస్తుంది. ఇందిర ప్రాణ స్నేహితురాలు ఆమెను మనస్పూర్తిగా ఆహ్వానించినా, తాగుబోతు, తిరుగుబోతు అయిన ఆమె భర్త ఇందిరతో శారీరిక సుఖం కోరుకుంటాడు. ఎక్కడా ఉండలేక ఇందిర ఇబ్బంది పడుతుంది.
రషీద్ అనే ఒక జర్నలిస్ట్ ఇందిర ఇంటర్వ్యూ కోసం వస్తాడు. కాని ఆమె నిరాకరిస్తుంది. అతని ఇంట్లో రామన్ అనే మరో సీనియర్ పాత్రకేయుడు జీవిస్తూ ఉంటారు. రామన్ సమాజ వైఖిరికి అంతర్ముఖుడై తాగుడులో తన బాధని కోపాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చివరకు ఇందిర తన పెరోల్లో ఆఖరి రోజులు గడపడానికి రషీద్ ఇంటికి చేరుతుంది. రషీద్ ఇందిరల మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. ఎంతో కష్టపడి రషీద్, రామన్‌లు ఇందిరకు రెమిషన్ మంజూరు చేయించ గలుగుతారు. జైలుకి వెళ్ళవలసిన అవసరం ఇక ఉండదు. రషీద్ ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఇందిర అంగీకరిస్తుంది. ఈ శుభ వార్త చెప్పడానికి తన స్నేహితురాలి ఇంటికి ఆమె వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్నేహితురాలు భర్త, ఆయన స్నేహితులు ముగ్గురు ఆ ఇంటి పనిమనిషి, అమాయకురాలైన ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసి గది నుంచి బయటకు వస్తూ కనిపిస్తారు. అసహాయమైన ఆ బాలిక ఏడుపు, అహంకార పూరితమైన ఆ మగమగాల చూపులు ఇందిరలో వారిని శిక్షించవలసిన అవసరం కల్పిస్తాయి. ఇందిర ఆ స్నేహితురాలి భర్తను కాల్చి చంపుతుంది. దిగ్భ్రాంతి చెందిన రషీద్‌ని క్షమించమని, తాను తానుగా మాత్రమే ఉండగలనని మరోలా ఉండలేనని చెప్తూ పోలీస్ స్టేషన్లో లొంగిపోతుంది.
ఇందిర పాత్ర కేరళ మాజీ నక్సల్ కె.అజిత జీవితం ఆధారంగా మలచబడింది. ఇద్దరు పోలీసులను చంపిన కేసులో అజిత తొమ్మిది సంవత్సరాల శిక్ష అనుభవించి విడుదలయ్యి యాకూబ్ అనే అతన్ని వివాహం చేసుకుని సాధారణ జీవితం గడిపే ప్రయత్నం చేసారు. తరువాత మళ్ళీ సమాజ సేవ తన మార్గంగా ఎంచుకుని కేరళలో ఎన్నో మానవ హక్కుల ఉద్యమాలలో పాల్గొన్నారు. ఈ సినిమాలో ఇందిర పాత్రలో అన్యాయానికి ప్రతిఘటించి తనదైన దారిలో న్యాయం కోసం పోరాడే ఒక స్త్రీ కోణాన్ని దర్శకులు అద్భుతంగా విశ్లేషించారు. ఒక హంతకురాలిగా తాను ఎనిమిది సంవత్సరాల పాటు కఠినమైన జైలు జీవితం గడిపిన తరువాత ఊరిలోని వ్యక్తులు తనను అసహ్యించుకునే విధం, ఆమె స్పర్శను విష సమానంగా చూసే వ్యక్తులు, కుటుంబంలోని మగవారి ద్వేషం, కనీస మానవ ప్రేమ పొందలేని ఆమె జీవితం వీటన్నిటి మధ్య రషీద్ లాంటి ఉత్తముడు ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించడం ఒక పెద్ద వరం. ఆమె పడుతున్న నరకం నుండి ఒక గొప్ప విముక్తి. ఆమె జీవితానికి ఒక గమ్యం. కాని దాని కన్నా ఒక చిన్న పిల్లపై జరిగిన అత్యాచారానికి ప్రతీకారం తీర్చుకోవడమే తన మార్గంగా ఆమె భావిస్తుంది. తన అందమైన భవిష్యత్తు కన్నా న్యాయపోరాటమే ఆమె మార్గం అని నమ్ముతుంది. మరో హత్య చేస్తుంది. తరువాత కూడా తాను చేసిన దానికి చింతించదు. ఊపిరి ఉన్నంత వరకు అన్యాయానికి ఎదురొడ్డి పోరాడటమే తన నైజం అని చెబుతుంది. మళ్ళీ అదే జైలు జీవితం, అదే దుర్భర ప్రేమ రాహిత్య జీవన విధానాన్ని ఎంచుకుంటుంది. ఒకచోట ఇందిర తన పాత పార్టీ స్నేహితులను కలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వారంతా తమ ఆశయాలను మరచి సంసార జీవితంలో, డబ్బు సంపాదనలో పడిపోవడం చూస్తుంది. ఎవరి ప్రభావంతో తాను ఉద్యమకారిణిగా మారిందో ఆ వ్యక్తే డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికే ఒక లాయర్ అవడం చూస్తుంది. తానెంత ఒంటరిదయ్యిందో అర్ధం అయినా చివరకు ఆ ఒంటరితనాన్నే మళ్ళీ కోరుకోవడం, అదే తన ప్రవత్తి అని చెప్పడం ఆమె గొప్ప వ్యక్తిత్వానికి పరాకాష్ట.
ఇందిర పాత్రలో గీత నటన అద్భుతం. భారతీయ సినిమాలో ఒక శక్తివంతమైన, ఆదర్శవాద స్త్రీ పాత్ర అన్వేషిస్తే ముందుగా మనకు ఇందిర కనిపిస్తుంది. 1986 లో వచ్చిన ఈ సినిమాలో ఇందిర పాత్రను, ఈ చిత్రాన్ని ఇప్పటితరం తప్పకుండా చూడాలి. నేటి సినిమాలలో స్త్రీ పాత్రలను చూసి ఆ చిన్ని బట్టలు, ఆ బుట్టబొమ్మల అందమే ఆడతనం అనే వ్యామోహంలో గడిపే బుద్దిహీనులు, ''ఈ అమ్మాయి నాదే మరొకరు చూడడానికి వీల్లేదు'' అనే డైలాగ్‌లోని ఆటిట్యూడ్‌కి ఫిదా అయిపోయి, ఇప్పటికి కూడా మరొకరి ఆస్తిగా మిగిలి పోవాలనే మోడ్రన్ అమాయక మార్కెట్ సరుకులలో కొంత కుదుపు కలిగించే గొప్ప చిత్రం, గొప్ప పాత్ర ఇందిర. పంచాగ్ని హాట్ స్టార్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఇప్పుడు ఉంది.
-పి.జ్యోతి
9885384740