Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విమర్శ, ఆత్మ విమర్శ అనేది మనలోని లోపాలను సవరించుకునేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. మనలోని అంతర్మథనం మన పని విధానాన్ని మెరుగు పర్చుకునేందుకు ఎంతగానో అవసరం. మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునేందుకు దిక్సూచిగా పని చేస్తుంది. మనకు తెలియకుండానే మనం కొన్ని పొరపాట్లు చేస్తాం. వాటిని మనం ఆత్మ విమర్శ చేసుకోవడం ద్వారా సవరించుకోవచ్చు. ఇతరుల వాటిని ఎత్తి చూపిన తరువాతనైనా వాటిని సవరించుకోవాలి. మనం సంఘ జీవులం. అందరికీ నచ్చిన విధంగా జీవించలేం. ఒక్కొక్కరి జీవితం ఒకో రకంగా ఉంటుంది. అనేక మంది కుటుంబ సభ్యులు,స్నేహితులు, బంధువులతో కలిసి జీవిస్తున్నపుడు మన ప్రవర్తన కొంతమందికి నచ్చవచ్చు. మరికొంత మందికి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా ప్రజా సంఘాలలో, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తుల్లో మనస్పర్థలు, విమర్శలు, ప్రతి విమర్శలు జరగడం సహజం. అయితే మనస్పర్థలను పెంచుకుంటూ పోతే మన పని విధానంలో మార్పు వస్తుంది. అది ఉత్తమ ఫలితాల నివ్వద్దు. అంతేకాకుండా ఇతరుల సహకారాన్ని సంపూర్ణంగా పొందలేం. అందువల్ల విమర్శలను సానుకూల దృక్పథంతో పరిశీలించాలి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. మెరుగైన పని విధానాన్ని సాధించాలి.
మనందరిలోనూ కొన్ని లోపాలుంటాయి. ఏ ఒక్క వ్యక్తి లోనూ పరిపూర్ణత్వం ఉండదు. లోపాలను గుర్తించి సవరించు కోవడం ద్వారా మాత్రమే మనం ఉన్నతంగా ఎదగగలం. మన ప్రవర్తనలో ఉన్న లోపాలను మనం గుర్తించలేం. ఎదుటి వ్యక్తి ఎత్తి చూపినప్పుడే వాటిని గుర్తించగలుగుతాం. మనం ఈ సమాజంలో పది మందితో కలిసి తిరుగుతున్నపుడు మన ప్రవర్తన తోటి వారు మన ప్రవర్తనను ఎలా అర్థం చేసుకుంటు న్నారు. వారు ఎలా వ్యాఖ్యానిస్తున్నారు అనే విషయాలను మనం సమీక్షించుకోవాలి. ఎదుటి వ్యక్తులు మీపై విమర్శ చేసినపుడు దానిని సహృదయంతో ఆహ్వానించాలి. మంచి మనసుతో ఆ విమర్శను స్వీకరించాలి. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తునపుడు, మీ లోపాలను ఎత్తిచూపినపుడు ఎలాంటి ఉద్రేకానికి లోనుకావద్దు. మీరు అంగీకరించడానికైనా, తిరస్కరించడానికైనా మొదట ఆ విమర్శను పూర్తిగా అర్థం చేసుకోవాలి. మీరు సమాధానం చెప్పాలనుకుంటే ఆ విమర్శను మధ్యలో ఆపి ఉద్రేకంతో, కోపంతో ప్రతి విమర్శ చేసేందుకు ప్రయత్నించవద్దు. విపులంగా ఆ విమర్శలన్నింటికీ సమాధానం ఇవ్వండి. మీరు చిరునవ్వుతో విమర్శను ఆలకిస్తున్న బావనను ఎదుటి వ్యక్తికి కలుగనివ్వాలి. అంతేకాదు మీలో ఆ లోపం ఉన్న కంగారు పడనవసరం లేదు. మీ లోపాలను సరిదిద్దుకు నేందుకు అనేక అవకాశాలున్నాయన్న విషయాన్ని మీరు మరచిపోవద్దు. ఏ మాత్రం బిడియపడకుండా ఎదుటి వ్యక్తి ముఖంలోకి సూటిగా చూడండి. మీపై ఎంతటి వ్యతిరేకత ఉన్నా, మీరలా సూటిగా చూస్తూ గంభీరంగా, నిశబ్దంగా కూర్చుంటే ఎదుటి వ్యక్తికి అప్పటికప్పుడు మీపై అభిమానం ఉదయిస్తుంది. ఆ తరువాత ఆయన లేదా ఆమె మీపై విమర్శలు చేసేందుకు సంశయిస్తారు. అంతేకాదు ఒక లోపాన్ని లోపంగా మీరు అంగీకరిస్తే అది ఏ మాత్రం మీ అసమర్థతకు చిహ్నం కాదు. దానిని భవిష్యత్తులో సవరించుకోగల మీ సమర్థతకు సంకేతంగా భావించండి.
మీరు మీకు నచ్చని వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటారు. మీ ప్రవర్తన ఆ వ్యక్తిని బాధకు లోను చేసి ఉంటుంది. ఆ వ్యక్తి మీ వద్ద తనకు కలిగిన అసౌకర్యాన్ని వివిధ సందర్భాల్లో మీ ప్రవర్తన తీరును, దానితో ఆయన ఎలా గాయపడింది వివరిస్తారు. ఆయన మీ గురించి మాట్లాడుతున్నపుడు, మీరది ముఖ్య విషయం కాదని సంభాషణను మరల్చవద్దు. అలా చేయడం ఇది సరికాదు. మీ మధ్య ఏర్పడిన మనస్పర్థలను, విద్వేషాలను మూడవ వ్యక్తి, మీ శ్రేయోభిలాషుల సమక్షంలో పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. చర్చల ద్వారా మీ మధ్య ఏర్పడిన మబ్బులు విడిపోతే కొత్త స్నేహితానికి అంకురార్పణ జరుగుతుంది. మీరు ఆయన వెల్లడించిన అభ్యంతరాన్ని, ఆయన తెలియజేసిన పొరపాట్లను అర్థం చేసుకున్నాననే సంకేతం ఇవ్వండి. ఈ సందర్భంగా కొంత మంది అనవసరమైన విమర్శలు గుప్పించి మిమ్మల్ని లంగదీసు కునేందుకు ప్రయత్నించవచ్చు. కానీ ఆ అవకాశాన్ని ఇతరులకు ఇవ్వకుండా మీరే ఆత్మ విమర్శ చేసుకొండి. ఆ లోపాలను ఆత్మ విమర్శ ద్వారా గుర్తించండి. వాటిని సవరించుకొండి. ఇదిలా ఉండగా మనది ప్రజాస్వామ్య దేశం. కొంత మంది రాజకీయ నాయకులు ప్రతి పక్ష నాయకులు చేసిన విమర్శలను ఏమాత్రం పట్టించుకోరు. పరిపాలనలో జరుగుతున్న లోపాలను అధికారంలో ఉన్నవారు వెంటనే గుర్తించలేరు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను సానుకూలంగా పరిశీలిస్తే, అందులో మంచి విషయాలెన్నో ఉంటాయి. వాటిని స్వీకరించడం ద్వారా మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు అవకాశం ఉంటుంది. ఈ సూత్రం అన్ని సంస్థలకు, వ్యక్తులకు వర్తిస్తుంది.
- జి.గంగాధర్ సిర్ప, 8919668843