Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-స్టువర్ట్ బ్రాడ్ ఆల్‌రౌండ్ జోరు
-ఎదురీదుతున్న వెస్టిండీస్
-వెస్టిండీస్,ఇంగ్లాండ్ మూడో టెస్టు
విజ్డెన్ సిరీస్ వేటలో వెస్టిండీస్ పట్టు విడువగా.. ఇంగ్లాండ్ దూకుడు పెంచింది. టాప్ ఆర్డర్‌ను సాగనంపినా మిడిల్, టెయిల్‌ను విండీస్ నిలువరించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 369 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి వెస్టిండీస్‌పై మరింత ఒత్తిడి పెంచింది. పేస్ త్రయం అండర్సన్, బ్రాడ్, ఆర్చర్లు కరీబియన్ బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసురుతున్నారు. ఈ ముగ్గురు ఇప్పటికే టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. జోరుమీదున్న ఇంగ్లాండ్ పేసర్లను ఎదురొడ్డి వెస్టిండీస్ నిలబడేది అనుమానమే!.
నవతెలంగాణ-మాంచెస్టర్
విజ్డెన్ సిరీస్ నిర్ణయాత్మక టెస్టులో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతోంది. స్టువర్ట్ బ్రాడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మూడో టెస్టుపై ఇంగ్లాండ్ పట్టు సాధించింది. తొలుత 62 పరుగుల అర్థ సెంచరీతో ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోరు అందించిన స్టువర్ట్ బ్రాడ్.. బంతితో ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కరీబియన్లను గట్టి దెబ్బ కొట్టాడు. స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్ తలా ఓ వికెట్‌తో మెరవటంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 59/3తో కష్టాల్లో పడింది. రెండో రోజు టీ విరామ సమయానికి (రెండు సెషన్లు పూర్తి) వెస్టిండీస్ మరో 310 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒలీ పోప్ (91, 150 బంతుల్లో 11 ఫోర్లు), జోశ్ బట్లర్ (67, 142 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు 140 పరుగుల భాగస్వామ్యంతో వెన్నెముకలా నిలిచారు. విండీస్ యువ పేసర్ కీమర్ రోచ్ (4/72) ప్రదర్శనతో 200 వికెట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు.
ఆరంభం పేలవం! : నిర్ణయాత్మక మూడో టెస్టులో వెస్టిండీస్ టాప్ ఆర్డర్ విఫలమైంది. జోరుమీదున్న స్టువర్ట్ బ్రాడ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వేట్ (1)ను వెనక్కి పంపగా.. స్లిప్స్‌లో బెన్ స్టోక్స్ క్యాచ్ నేలపాలు చేయటంతో బతికిపోయిన మరో ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (32, 50 బంతుల్లో 3 ఫోర్లు) అవకాశం సద్వినియోగం చేసుకోలేదు. జాతి వివక్ష దూషణతో మానసిక ఫిట్నెస్ కోల్పోయినట్టు ప్రకటించిన జోఫ్రా ఆర్చర్ మాంచెస్టర్‌లో మెప్పించాడు. సహజ శైలిలో బౌన్సర్లతో మాతృదేశ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందికి గురిచేశాడు. బౌన్సర్ అస్త్రంతోనే కాంప్‌బెల్ కథకు శుభం కార్డు వేశాడు. కట్టుదిట్టంగా బంతులేసిన ఇంగ్లీష్ పేసర్లను ఎదుర్కొని షైరు హౌప్ (17, 64 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజులో సహనంతో కనిపించాడు. కానీ జేమ్స్ అండర్సన్ అతడి వికెట్‌ను సులువగా తీసేశాడు. జిమ్మీ ఇన్‌స్వింగర్‌కు వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన హౌప్ విండీస్ అంచనాలను వమ్ము చేశాడు. టీ విరామ సమయానికి షమ్రా బ్రూక్స్ (4 నాటౌట్), రోస్టన్ ఛేజ్ (0 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు.
బ్రాడ్ ధనాధన్ : ఓవర్‌నైట్ స్కోరు 258/4తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది. 369 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు అర్థ సెంచరీ హీరోలు ఒలీ పోప్ (91, 150 బంతుల్లో 11 ఫోర్లు), జోశ్ బట్లర్ (67, 142 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఎంతోసేపు వికెట్ నిలుపుకోలేదు. ఒలీ పోప్‌కు ఓవర్‌నైట్ స్కోరు వద్దే గాబ్రియల్ బౌలింగ్‌లో స్లిప్స్‌లో జీవనదానం లభించింది. కార్న్‌వాల్ సులువైన క్యాచ్ వదిలేశాడు. గాబ్రియల్ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్ అయిన పోప్ ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగూ జోడించకుండానే నిష్క్రమించాడు. జోశ్ బట్లర్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. గాబ్రియల్ బౌలింగ్‌లోనే స్లిప్స్‌లో దొరికిపోయాడు. జోఫ్రా ఆర్చర్ (3) అలా వచ్చి ఇలా వెళ్లాడు. 280/8తో ఇంగ్లాండ్ 300 లోపే కుప్పకూలేలా కనిపించింది. కానీ స్టువర్ట్ బ్రాడ్ (62, 45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌లో చెలరేగాడు. 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన బ్రాడ్ కరీబియన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బ్రాడ్‌కు స్పిన్నర్ డామ్ బెస్ (18 నాటౌట్) చక్కగా సహకరించాడు. ఈ జోడీ తొమ్మిదో వికెట్‌కు 76 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పింది. స్టువర్ట్ బ్రాడ్ సూపర్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. ఛేజ్ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి బ్రాడ్ నిష్క్రమించగా.. అండర్సన్ (11) కథను హౌల్డర్ ముగించాడు. 111.5 ఓవర్లలో ఇంగ్లాండ్ 369 పరుగులు చేసింది. వెస్టిండీస్ యువ పేసర్ కీమర్ రోచ్ టెస్టుల్లో 200 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. 4/72తో చెలరేగిన రోచ్ ఇంగ్లాండ్ టాప్ బ్యాట్స్‌మెన్‌ను శాసించాడు. గాబ్రియల్, ఛేజ్‌లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. స్పిన్నర్, బాహుబలి క్రికెటర్ రహీమ్ కార్న్‌వాల్ (0/85)కు వికెట్లేమీ దక్కలేదు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో విండీస్ మూడో టెస్టులో ఇద్దరు స్పిన్నర్లను బరిలో నిలిపింది. కార్న్‌వాల్ బంతిని చక్కగా తిప్పినా.. వికెట్లు మాత్రం దక్కలేదు.
స్కోరు వివరాలు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : రోరీ బర్న్స్ (సి) కార్న్‌వాల్ (బి) రోస్టన్ ఛేజ్ 57, డామినిక్ సిబ్లే (ఎల్బీ) కీమర్ రోచ్ 0, జో రూట్ రనౌట్ (రోస్టన్ ఛేజ్) 17, బెన్ స్టోక్స్ (బి) కీమర్ రోచ్ 20, ఒలీ పోప్ (బి) గాబ్రియల్ 91, జోశ్ బట్లర్ (సి) జేసన్ హౌల్డర్ (బి) గాబ్రియల్ 67, క్రిస్ వోక్స్ (బి) కీమర్ రోచ్ 1, డామ్ బెస్ నాటౌట్ 18, జోఫ్రా ఆర్చర్ (సి) హౌల్డర్ (బి) కీమర్ రోచ్ 3, స్టువర్ట్ బ్రాడ్ (సి) బ్లాక్‌వుడ్ (బి) రోస్టన్ ఛేజ్ 62, జేమ్స్ అండర్సన్ (సి) కార్న్‌వాల్ (బి) హౌల్డర్ 11, ఎక్స్‌ట్రాలు : 22, మొత్తం :(111.5 ఓవర్లలో ఆలౌట్) 369.
వికెట్ల పతనం : 1-1, 2-47, 3-92, 4-122, 5-262, 6-267, 7-272, 8-280, 9-356, 10-369.
బౌలింగ్ : కీమర్ రోచ్ 25.4-4-72-4, షెనన్ గాబ్రియల్ 23.2-5-77-2, జేసన్ హౌల్డర్ 24.5-5-83-1, కార్న్‌వాల్ 27-5-85-0, రోస్టన్ ఛేజ్ 11-3-36-2.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : క్రెగ్ బ్రాత్‌వేట్ (సి) రూట్ (బి) స్టువర్ట్ బ్రాడ్ 1, జాన్ కాంప్‌బెల్ (సి) రోరి బర్న్స్ (బి) జోఫ్రా ఆర్చర్ 32, షైరు హౌప్ (సి) జోశ్ బట్లర్ (బి) జేమ్స్ అండర్సన్ 17 , షమ్రా బ్రూక్స్ నాటౌట్ 4, రోస్టన్ ఛేజ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (25 ఓవర్లలో 3 వికెట్లకు) 59.
వికెట్ల పతనం : 1-1, 2-44, 3-58.
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ 7-2-13-1, స్టువర్ట్ బ్రాడ్ 5-0-13-1, జోఫ్రా ఆర్చర్ 6-1-16-1, క్రిస్ వోక్స్ 7-0-17-0.