Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-269 పరుగుల తేడాతో ఘన విజయం
-129 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
-వరుణుడు అడ్డుపడినా, ఇంగ్లాండ్ జోరు
విజ్డెన్ సిరీస్ ఇంగ్లాండ్ వశమైంది. కరీబియన్ దీవుల్లో విజ్డెన్ సిరీస్‌ను వదులుకున్న ఇంగ్లీష్ జట్టు సొంత గడ్డపై సగర్వంగా మళ్లీ విజ్డెన్ సిరీస్‌ను ముద్దాడింది. తొలి టెస్టులో ఓడి 0-1తో వెనుకంజలో నిలిచినా.. మాంచెస్టర్‌లో వరుసగా రెండు టెస్టుల్లో ఘన విజయాలు నమోదు చేసింది. 399 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ 129 పరుగులకే కుప్పకూలింది. స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ ధాటికి కరీబియన్ శిబిరం కకావికలమైంది. వెస్టిండీస్‌పై 2-1తో ఇంగ్లాండ్ విజ్డెన్ సిరీస్ సొంతం చేసుకుంది.
మాంచెస్టర్ (ఇంగ్లాండ్): స్టువర్ట్ బ్రాడ్ (4/36), క్రిస్ వోక్స్ (5/50) నిప్పులు చెరిగారు. వర్షం అంతరాయం కలిగిన మూడో టెస్టు ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్ సీమర్ల ధాటికి వెస్టిండీస్ కుదేలైంది. 37.1 ఓవర్లలోనే చేతులెత్తేసింది. విజ్డెన్ సిరీస్‌ను ఇంగ్లాండ్‌కు పువ్వుల్లో పెట్టి ఇచ్చేసింది. 399 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ 129 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విండీస్ జట్టులో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలువలేదు. హౌప్ (31), బ్రూక్స్ (22), బ్లాక్‌వుడ్ (23)లు మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు. మూడో టెస్టులో పది వికెట్లు, ఓ అర్ధ సెంచరీ సహా సిరీస్‌లో 16 వికెట్లు కూల్చిన స్టువర్ట్ బ్రాడ్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.
వర్షం అడ్డు వచ్చినా.. : విజ్డెన్ సిరీస్‌లో వరుణుడు తరచుగా ఆటంకం కలిగించాడు. రెండో టెస్టులో సైతం ఓ రోజు ఆట తుడిచిపెట్టుకుపోయినా.. ఇంగ్లాండ్ గెలిచింది. మూడో టెస్టులో వర్షంతో నాల్గో రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఐదో రోజు వర్షం సైతం ఆటంకం కలిగింది. వర్షం కారణంగా పలుమార్లు ఆటను నిలిపివేశారు. అయినా, వర్షం విరామం ఇచ్చిన సమయంలోనే ఇంగ్లాండ్ విజృంభించింది. వెస్టిండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టి ఘన విజయం అందుకుంది. విండీస్ పతనాన్ని స్టువర్ట్ బ్రాడ్ ఆరంభించగా.. క్రిస్ వోక్స్ శాసించాడు. ఐదో రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన వోక్స్ ఐదు వికెట్లు కూల్చాడు. క్రీజులో నిలదొక్కుకున్న షైరు హౌప్ (31), షమ్రా బ్రూక్స్ (22) సహా ప్రమాదకర ఆల్‌రౌండర్ జేసన్ హౌల్డర్ (12), రహీం కార్న్‌వాల్ (2), షేన్ డావ్రిచ్ (8)లను క్రిస్ వోక్స్ పెవిలియన్‌కు చేర్చాడు. స్వల్ప వ్యవధిలో వికెట్లు పడగొట్టిన వోక్స్ వెస్టిండీస్‌ను ఓటమి కోరల్లోకి నెట్టాడు. ఇంగ్లాండ్‌పై నాల్గో ఇన్నింగ్స్ స్పెషలిస్ట్ జెర్మైన్ బ్లాక్‌వుడ్ (23, 48 బంతుల్లో 2 ఫోర్లు) ప్రతిఘటించే ప్రయత్నం చేసినా మరో ఎండ్ నుంచి సహకారం దక్కలేదు. స్టువర్ట్ బ్రాడ్ బంతికి ఆఖరి వికెట్ రూపంలో బ్లాక్‌వుడ్ పెవిలియన్‌కు పయనమయ్యాడు. జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్లకు వికెట్లు దక్కలేదు. బెన్ స్టోక్స్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.
500 క్లబ్లో బ్రాడ్ : ఇంగ్లాండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మరో ఘనత సాధించాడు. సౌతాంప్టన్ టెస్టులో బెంచ్‌కు పరిమితం చేయటంతో ఆవేదన వ్యక్తం చేసిన బ్రాడ్ అచ్చొచ్చిన మాంచెస్టర్‌లో విశ్వరూపం చూపించాడు. రెండు టెస్టుల్లో ఏకంగా 16 వికెట్లు పడగొట్టి ప్రతాపం చూపించాడు. 500 టెస్టు వికెట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వేట్ వికెట్‌తో కెరీర్ 500వ టెస్టు వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాల్గో పేసర్, ఓవరాల్‌గా ఏడో బౌలర్‌గా నిలిచాడు. ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అనిల్ కుంబ్లే (619), జేమ్స్ అండర్సన్ (589), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519)లు అండర్సన్ కంటే ముందున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్లో అండర్సన్ స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ నిలిచాడు. అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా తన రికార్డును అధిగమించే సత్తా స్టువర్ట్ బ్రాడ్‌కు ఉందని అండర్సన్ సహచర పేసర్‌ను ప్రశంసించాడు.
స్కోరు వివరాలు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 369 ఆలౌట్
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : 197 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 226/2 డిక్లేర్డ్
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ : క్రెగ్ బ్రాత్‌వేట్ (ఎల్బీ) స్టువర్ట్ బ్రాడ్ 19, జాన్ కాంప్‌బెల్ (సి) రూట్ (బి) స్టువర్ట్ బ్రాడ్ 0, కీమర్ రోచ్ (సి) బట్లర్ (బి) స్టువర్ట్ బ్రాడ్ 4, షైన్ హౌప్ (సి) బ్రాడ్ (బి) క్రిస్ వోక్స్ 31, షమ్రా బ్రూక్స్ (సి) బట్లర్ (బి) క్రిస్ వోక్స్ 22, రోస్టన్ ఛేజ్ (రనౌట్) బెస్ 7, బ్లాక్‌వుడ్ (సి) బట్లర్ (బి) స్టువర్ట్ బ్రాడ్ 23, జేసన్ హౌల్డర్ (ఎల్బీ) క్రిస్ వోక్స్ 12, షేన్ డావ్రిచ్ (ఎల్బీ) క్రిస్ వోక్స్ 8, కార్న్‌వాల్ (ఎల్బీ) క్రిస్ వోక్స్ 2, గాబ్రియల్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 01, మొత్తం : (37.1 ఓవర్లలో ఆలౌట్) 129.
వికెట్ల పతనం : 1-0, 2-6, 3-45, 4-71, 5-79, 6-87, 7-99, 8-117, 9-119, 10-129.
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ 8-4-18-0, స్టువర్ట్ బ్రాడ్ 8.1-1-36-4, క్రిస్ వోక్స్ 11-0-50-5, జోఫ్రా ఆర్చర్ 10-1-24-0.