Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ చైర్మన్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం
- మనోహర్ వారసుడి వేటలో డైరెక్టర్ల కుస్తీలు
- సౌరవ్ గంగూలీ అభ్యర్థిత్వంపై అస్పష్టత
ప్రపంచం కరోనా మహమ్మారిని ఎదుర్కొవటంపై విరామం లేని పోరాటం చేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ క్రికెట్ గతి తప్పింది. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి ధనిక క్రికెట్ బోర్డులు బయో సెక్యూర్ బబుల్‌లో క్రికెట్ ఆడగలవు, కానీ చిన్న క్రికెట్ బోర్డులు ఆట పున ప్రారంభంపై స్పష్టత లేక అల్లాడుతున్నాయి. ప్రపంచ క్రికెట్ దశ దిశను నిర్దేశించాల్సిన ఐసీసీ.. ఇవేవీ పట్టనట్టు సొంత సమస్యలతో అర్థరహిత తాత్సారం చేస్తోంది. కఠిన పరిస్థితుల్లో తదుపరి చైర్మన్‌ను ఎన్నుకోవటంపై ఎనలేని జాప్యం జరుగుతోంది. శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా తప్పుకుని ఏడు వారాలు కావస్తున్నా.. తదుపరి ఐసీసీ చైర్మన్‌పై ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐసీసీ చైర్మన్‌గా వైదొలుగుతున్నట్టు జూన్ 30న శశాంక్ మనోహర్ బోర్డు డైరెక్టర్లకు రాజీనామా లేఖను పంపాడు. జులై 2న, మరో వారం రోజుల్లో శశాంక్ మనోహర్ వారసుడి ఎంపిక ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ తొలి ఇండిపెండెంట్ చైర్మన్‌గా రెండు పర్యాయాలు పదవీలో కొనసాగిన శశాంక్ మనోహర్, మరో రెండేండ్ల పాటు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ పదవి నుంచి వైదొలిగాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ తదుపరి ఐసీసీ చైర్మన్ రేసులో ముందున్నాడు. కరోనా మహమ్మారి కష్టకాలంలో ప్రపంచ క్రికెట్ గమనాన్ని నిర్దేశించాల్సిన ఐసీసీ చైర్మన్ పదవి ఎంతోకాలం ఖాళీగా ఉంచలేరు. దీంతో త్వరలోనే ఐసీసీ చైర్మన్‌పై స్పష్టత వస్తుందని అనుకున్నారు. కానీ శశాంక్ మనోహర్ తప్పుకుని నెలన్నర కావస్తున్నా, తదుపరి చైర్మన్ ఎన్నికపై ఐసీసీ బోర్డులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఐసీసీ బాస్‌ను ఎన్నుకోవటంలో ఎందుకీ తాత్సారం? ఎందుకిన్ని అవరోధాలు? ఎందుకీ అభిప్రాయభేదాలు?!
మద్దతు లేకే నిష్క్రమణ : శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా మూడో పర్యాయం కొనసాగేందుకు ప్రయత్నించాడు. బీసీసీఐ ప్రయోజనాలకు మనోహరే తూట్లు పొడవటంతో, సభ్య దేశాలు ఆసక్తిగా చూశాయి. కానీ ఇప్పుడు బీసీసీఐకి స్థిరమైన నాయకత్వం వచ్చింది. శశాంక్ మనోహర్ బీసీసీఐ తరఫు నామినీ కాదనే విషయాన్ని స్పష్టంగా తెలియజెప్పింది. తప్పని పరిస్థితుల్లోనే బోర్డు డైరెక్టర్టకు ముందుగా సమాచారం ఇచ్చి, శశాంక్ మనోహర్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఐసీసీ అసోసియేట్ సభ్యదేశం సింగపూర్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా..తాత్కాలిక ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్నాడు. వారం రోజుల్లో తేల్చాల్సిన ఐసీసీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఏడు వారాలు గడుస్తున్నా కొలిక్కి రావటం లేదు. సోమవారం నాటి ఐసీసీ బోర్డు సమావేశంలో ఎన్నికల ప్రక్రియపై ఏకాభిప్రాయం కుదరలేదు.
2/3 లేదా సాధారణ మెజార్టీ? : ఐసీసీ రాజ్యాంగం ప్రకారం చైర్మన్ పదవి చేపట్టడానికి, ఎన్నికల్లో పోటీచేసేందుకు కనీసం ఒక ఐసీసీ బోర్డు సమావేశానికి హాజరు కావాలి. ప్రస్తుత, మాజీ డైరెక్టర్లకూ ఈ నిబంధన వర్తిస్తుంది. శశాంక్ మనోహర్ తొలిసారి రహస్య బ్యాలెట్ పద్దతిలో ఎన్నికయ్యాడు. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు రెండో ఇండిపెండెంట్ చైర్మన్‌ను ఏ పద్దతిలో ఎన్నుకోవాలనే విషయంపైనే ప్రధానంగా పీటముడి కొనసాగుతోంది. ఐసీసీ బోర్డులో 17 మంది డైరెక్టర్లు ఉన్నారు. 12 మంది శాశ్వత సభ్య దేశాలు, మూడు అసోసియేట్ సభ్య దేశాలు, ఐసీసీ చైర్మన్ (ప్రస్తుత తాత్కాలిక చైర్మన్ ఇమ్రాన్ ఖవాజ అసిసోసియేట్ బోర్డు తరఫున డైరెక్టర్), ఓ ఇండిపెండెంట్ డైరెక్టర్ (ఇంద్రనూయి)లకు ఓటు హక్కు ఉంటుంది. ఐసీసీ సీఈఓ మనూ సాహ్నీకి ఓటు హక్కు ఉండదు. చైర్మన్‌ను సాధారణ మెజార్టీతో ఎన్నుకోవాలా? లేదా 2/3 వంతు మెజార్జీతో ఎన్నుకోవాలనే విషయంపై బోర్డులో ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఇక ఓటు హక్కు విషయంలోనూ కొన్ని బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇండిపెండెంట్ డైరెక్టర్ సహా అసోసియేట్ సభ్య దేశాలకు ఓటు హక్కు ఉండకూడదని కొన్ని బోర్డులు కోరుతున్నాయి. ఇప్పటికే ఓటు హక్కు అనుభవిస్తున్న డైరెక్టర్లు.. వదులుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. దీంతో ఐసీసీ తదుపరి చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
ఐసీసీ చైర్మన్‌ను రహస్య బ్యాలెట్ పద్దతిలో ఎన్నుకోవాలనే వాదన సైతం వినిపిస్తోంది. ఇతర అంశాల్లో బోర్డు ఆమోదానికి ఏకాభిప్రాయం కుదరకపోతే.. సభ్యులు చేయి పైకెత్తి తమ సమ్మతి, అసమ్మతి తెలిజేయాలి. కానీ చైర్మన్‌ను మాత్రం కచ్చితంగా రహస్య బ్యాలెట్‌లోనే ఎన్నుకోవాలని కొన్ని బోర్డులు కోరుతున్నాయి. ఐసీసీ బోర్డు డైరెక్టర్ ఒక అభ్యర్థిని నామినేట్ చేయవచ్చు. ఇద్దరు డైరెక్టర్ల మద్దతు కలిగిన అభ్యర్థి ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడు.
బలమైన అభ్యర్థి లేడే! : శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా ఆకర్షణీయంగా కనిపించాడు. మనోహర్ తర్వాత ఆ స్థాయి వ్యక్తులు చైర్మన్ రేసులో కనపడటం లేదు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నుంచి కొలిన్ గ్రేవ్స్ రేసులో నిలిచాడు. ఓ దశలో బీసీసీఐ సైతం కొలిన్కు దన్నుగా నిలిచిందనే వార్తలు వినిపించాయి. కానీ ఐసీసీ బోర్డులో కొలిన్ తగినంత మద్దతు కూడగట్టుకోలేదని తెలుస్తోంది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు సహా ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇంద్రనూయీ పేర్లు చక్కర్లు కొట్టాయి. జులై 27తో అధికారికంగా బీసీసీఐ అధ్యక్ష పదవీకాలం ముగించుకున్న సౌరవ్ గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవిపై ఆసక్తి వ్యక్తపరుచలేదు. బీసీసీఐలోనే కొనసాగేందుకు దాదా మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 17న గంగూలీ భవితవ్యంపై సుప్రీంకోర్టు తేల్చనుంది. ఆ తర్వాత గంగూలీ ఐసీసీ చైర్మన్ గిరీపై మనసులో మాట బయటపెట్టే అవకాశం ఉంది. గంగూలీ స్వయంగా బరిలోకి దిగితే ఐసీసీ బోర్డులో మద్దతు పెద్ద కష్టం కాదు.