Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సెమీస్‌లో అజరెంకా చేతిలో ఓటమి
- యూఎస్ ఫైనల్లో ఒసాకా × అజరెంకా
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి విక్టోరియా అజిరెంకా(బెలారస్), నవోమి ఒసాకా(జపాన్) ప్రవేశించారు. గురువారం రాత్రి జరిగిన హోరాహోరీ సెమీఫైనల్ పోటీలో టైటిల్ ఫెవరేట్ సెరెనా విలియమ్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. అజరెంకా 1-6, 6-3, 6-3 తేడాతో సెరెనాపై విజయం సాధించింది. గతంలో రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన అజరెంకా.. ఏడేండ్ల తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది. 2012, 2013లో యుఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన అజరెంకా.. సెరెనా చేతిలోనే ఓడింది. అప్పుడే రిటైర్మెంట్ ఇద్దామనుకున్న విక్టోరియా ఏడేండ్ల తర్వాత ఫైనల్లోకి ప్రవేశించింది. తొలిసెట్‌ను 6-1తో సెరెనా సునాయాసంగా గెల్చుకుంది. కానీ రెండోసెట్లో అజరెంకా సత్తా చాటింది. బ్రేక్ పాయింట్లు సాధిస్తూ సెరెనాకు చెమటలు పట్టించి ఆ సెట్‌ను 6-3 తేడాతో అజరెంకా కైవసం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడవ సెట్ ఆరంభంలో అజరెండా దూకుడు ప్రదర్శించింది. ఓ దశలో ఇద్దరూ సమానం అయ్యారు. అయితే 38ఏండ్ల సెరెనాకు మడిమ పట్టేయడంతో విరామం తీసుకుంది. అజరెంకా మాత్రం సెరెనాకు కోలుకునే అవకాశమివ్వక 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆశలపై నీళ్లు చల్లింది.
రెండోసారి ఫైనల్లోకి ఒసాకా..
4వ సీడ్ నవోమీ ఒసాకా యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి రెండోసారి ప్రవేశించింది. తొలి సెమీస్‌లో ఒసాకా 7-6(7-1) 3-6 6-3 తేడాతో జెన్నిపర్ బ్రాడీ(అమెరికా)ను ఓడించింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో గెల్చిన ఒసాకా.. రెండోసెట్ మొదటి, నాల్గో గేమ్‌లను కోల్పోవడంతో ఆ సెట్‌ను 3-6తో బ్రాడీ చేజిక్కించుకుంది. ఇక మూడోసెట్లో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఒసాకా ఓ దశలో 5-3 ఆధిక్యతను సాధించి ఆ గేమ్‌ను 6-3తో ముగించి రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. 2018లో తొలిసారి యూఎస్ ఓపెన్‌ను గెల్చిన ఒసాకా శనివారం జరిగే టైటిల్ పోరులో మాజీ టాప్‌సీడ్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకాతో తలపడనుంది.