Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2020
- మెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఢీ
- సెమీస్‌లో జ్వెరెవ్ సంచలన విజయం
- మెద్వదేవ్‌పై థీమ్ అలవోక గెలుపు
జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. స్టార్స్ లేని వేళ టైటిల్ ఫేవరెట్‌గా నిలిచిన జ్వెరెవ్ శనివారం నాటి సెమీఫైనల్లో 0-2తో ఓటమి దిశగా పయనించాడు. ఉత్కంఠ మ్యాచ్‌లో వేగంగా పుంజుకున్న జ్వెరెవ్ చివరి మూడు సెట్లను గెల్చుకుని సంచలన విజయం నమోదు చేశాడు. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరులో తలపడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆస్ట్రియా స్టార్ డొమినిక్ థీమ్ నాల్గోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి చేరుకున్నాడు. పారిస్‌లో నాదల్కు రెండుసార్లు, మెల్బోర్న్లో జకోవిచ్‌కు ఓ సారి గ్రాండ్‌స్లామ్ కోల్పోయిన థీమ్.. న్యూయార్క్‌లో ఏం చేస్తాడో చూడాలి.
న్యూయార్క్ (యుఎస్ఏ)
కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ప్రవేశించే అవకాశం. ప్రత్యర్థి 20వ సీడ్ స్పెయిన్ ఆటగాడు పాబ్లో కరానో బస్టా. ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పని సులువే అనిపించింది. సెమీఫైనల్లో జ్వెరెవ్ ఆట అందుకు భిన్నంగా సాగింది. తొలి రెండు సెట్లలో జ్వెరెవ్ అనామక ఆటగాడిగా కనిపించాడు. 3-6, 2-6తో వరుస సెట్లను కోల్పోయి పరాజయం ముంగిట నిలిచాడు. ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ ర్యాలీలు నెట్‌కు కొట్టిన జ్వెరెవ్ ఇంటిబాట పట్టినట్టే కనిపించాడు. తొలి రెండు సెట్లలో పేలవ ప్రదర్శనతో ఆశ్చర్యపరిచిన జ్వెరెవ్.. తర్వాతి మూడు సెట్లలో ఆటతో మరింత ఆశ్చర్యానికి గురిచేశాడు. అప్పటికే అసహనంతో కనిపించిన జ్వెరెవ్ నుంచి అద్భుత పోరాట స్ఫూర్తి ఎవరూ ఊహించలేదు. జర్మనీ స్టార్ ఊహించని అద్భుతమే చేసి చూపించాడు. మూడున్నర గంటల సెమీఫైనల్లో చివరి మూడు సెట్లను 6-3, 6-4, 6-3తో గెల్చుకుని తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ' మానసికంగా నేను పట్టువిడువలేదు. ఇదే పరిస్థితుల్లో అయితే చాలామంది ప్లేయర్లు కాడివదిలేస్తారు. సులువైన మ్యాచులంటూ ఇక ఉండవు. కొన్నిసార్లు విజయం కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఈ రోజు మరింత లోతుగా కష్టపడాల్సి వచ్చింది' అని ఫైనల్లోకి చేరిన ఆనందంలో అలెగ్జాండర్ జ్వెరెవ్ అన్నాడు. సెమీఫైనల్లో 24 ఏస్‌లు సంధించిన జ్వెరెవ్ స్పెయిన్ ఆటగాడికి చెమటలు పట్టించాడు. పాబ్లో 44 అనవసర తప్పిదాలు చేయగా.. జ్వెరెవ్ 57 అనవసర తప్పిదాలు చేశాడు. కానీ జ్వెరెవ్ 71 విన్నర్లతో పాబ్లో (37) తిరుగులేని ఆధిపత్యం సాధించాడు. ఇక పాయింట్ల పరంగా తొలి రెండు సెట్లు ఓడినా.. 149-138తో జ్వెరెవ్ ఆధిక్యంలో నిలిచాడు. జ్వెరెవ్ ఎనిమిది సార్లు పాబ్లో సర్వీస్‌ను బ్రేక్ చేయగా.. పాబ్లో ఏడుసార్లు జ్వెరెవ్ సర్వ్‌ను బ్రేక్ చేశాడు. 8 డబుల్ ఫాల్ట్స్ చేసిన జ్వెరెవ్.. నెట్ దగ్గర ఏకంగా 37 పాయింట్లు సాధించి ఔరా అనిపించాడు. పాబ్లో కేవలం 19 పాయింట్లు మాత్రమే సాధించగలిగాడు.
థీమ్ సులువుగా.. : రెండో సీడ్, ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ కెరీర్ నాల్గో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం నాటి సెమీఫైనల్లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వదేవ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. మూడు గంటల మ్యాచ్‌లో డానిల్ మెద్వదేవ్‌పై 6-2, 7-6(9-7), 7-6(7-5)తో థీమ్ అలవోక విజయం సాధించాడు. 2019 యుఎస్ ఓపెన్ రన్నరప్ డానిల్ మెద్వదేవ్ మరోసారి ఫైనల్లోకి ప్రవేశించాలనుకున్నా.. థీమ్‌ను దాటలేకపోయాడు. తొలి సెట్‌ను 6-2తో సులువుగానే గెల్చుకున్న థీమ్‌కు తర్వాతి రెండు సెట్లలో మెద్వదేవ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేకర్లకు దారితీసిన సెమీఫైనల్లో థీమ్ పైచేయి సాధించాడు. రెండో సెట్ టైబ్రేకర్‌ను 9-7తో గెల్చుకున్న థీమ్.. మూడోసెట్ టైబ్రేకర్‌ను 7-5తో ముగించాడు. వరుసగా రెండు సెట్లను టైబ్రేకర్లలో కోల్పోయిన మెద్వదేవ్ యుఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. డొమినిక్ థీమ్ 2 ఏస్‌లే కొట్టగా.. మెద్వదేవ్ 12 ఏస్‌లతో మరిశాడు. థీమ్ 33 అనవసర తప్పిదాలకే పరిమితం కాగా, మెద్వదేవ్ 44 అనవసర తప్పిదాలు చేశాడు. విన్నర్లు గెల్చుకోవటంలోనూ థీమ్ (22)ను మెద్వదేవ్ (29) వెనక్కి నెట్టాడు. మెద్వదేవ్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన థీమ్ కీలక గేములు గెల్చుకోగా.. థీమ్ సర్వీస్‌ను మెద్వదేవ్ రెండుసార్లు మాత్రమే బ్రేక్ చేయగలిగాడు. పాయింట్ల పరంగా 127-112తో డొమినిక్ థీమ్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయించాడు. నాల్గోసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటకు సిద్ధమయ్యాడు. రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో రఫెల్ నాదల్ చేతిలో టైటిల్ కోల్పోయిన థీమ్... ఈ ఏడాది ఫిబ్రవరిలో నొవాక్ జకోవిచ్ చేతిలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను చేజార్చుకున్నాడు. మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడిన అనుభవం కలిగిన డొమినిక్ థీమ్ ఆదివారం నాటి ఫైనల్లో కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఆడుతున్న అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు.
పురుషుల డబుల్స్‌లో క్రోయేషియా, బ్రెజిల్ జోడీ విజేతగా నిలిచింది. మాటె పవిక్, బ్రూనో సోరెస్ 7-5, 6-3తో క్రోయేషియా, చెక్ రిపబ్లిక్ జోడీ నికోలా మెక్టిక్, వెస్లీ జోడీపై వరుస సెట్లలో విజయం సాధించింది. పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో లారా సిగమండ్ (జర్మనీ), వెరా జ్వెనోరెవ (రష్యా) జంట 6-4, 6-4తో యిఫిన్ (చైనా), నికోలా మెలిచార్ (అమెరికా) జోడీని వరుస సెట్లలో ఓడించి మహిళల డబుల్స్ టైటిల్ గెల్చుకుంది.
మెద్వదేవ్ మళ్లీ..!
2019 యుఎస్ ఓపెన్ రన్నరప్ డానిల్ మెద్వదేవ్ (రష్యా) ఆటతో మెప్పించినా.. కోర్టులో ప్రనర్తనలో అభిమానుల మద్దతు దూరం చేసుకుంటున్నాడు. నిరుడు బాల్బారు నుంచి టవల్ లాగేసుకున్న మెద్వదేవ్ అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించి జరిమానాకు గురయ్యాడు. తొలిసారి అభిమానులు లేకుండా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లోనూ మెద్వదేవ్ తన ప్రవర్తనను మార్చుకోలేదు. తన సర్వ్‌లో చేసిన లైన్ డిసిషన్‌ను మెద్వదేవ్ అంగీకరించలేదు. పైగా నెట్ దాటి ఆవల కోర్టులోకి వెళ్లి ఎక్కడ పడిందో అంపైర్‌కు చూపించే ప్రయత్నం చేశాడు. నిబంధనల ప్రకారం నెట్ దాటి అవతలి కోర్టులోకి వెళ్లకూడదు. దీనికీ లైన్ అంపైర్‌కు మెద్వదేవ్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. ' అయ్యో నన్ను క్షమించండి. నేను ఓ వ్యక్తిని హత్య చేశాను కదూ? నెట్ దాటినందుకు యుఎస్ ఓపెన్ నిర్వాహకులకు నా క్షమాపణలు' అని మెద్వదేవ్ అన్నాడు. మెద్వదేవ్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో అభిమానులు మరోసారి విరుచుకుపడుతున్నారు.