Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కండ్లన్నీ యువ బ్యాట్స్‌మెన్‌పైనే..
- బుడగ ఐపీఎల్లో సత్తా చాటేందుకు రెఢీ
- ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి..
ప్రపంచ స్థాయి పోటీతత్వం. ప్రపంచ టోర్నీ తరహా ఉత్కంఠ. మెగా ఈవెంట్లలో ఎదురయ్యే కఠినమైన మ్యాచ్ సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). 12 ఏండ్ల ఐపీఎల్లో దేశ, విదేశీ క్రికెటర్లు సత్తా చాటారు. గట్టి పోటీఉండే జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న దేశవాళీ కుర్రకారు ఐపీఎల్ వేదికగానే ప్రపంచ క్రికెట్‌కు పరిచయం అవుతున్నారు. ఐపీఎల్ ప్రదర్శనలతోనే జాతీయ జట్టులోకి ప్రవేశిస్తున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ యుఏఈలో జరుగుతోంది. ఐపీఎల్ 2020లో ప్రభంజనం సృష్టించేందుకు ఈసారీ దేశవాళీ కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే అత్యుత్తమ అవకాశాల వేదిక. ఐపీఎల్ వేదికగా ఎంతోమంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ కెరీర్‌ను గాడిలో పడేసుకున్నారు. విలువైన ఆత్మవిశ్వాసం సొంతం చేసుకుని, జాతీయ జట్ల తరఫున అద్భుతంగా రాణిస్తున్నారు. దేశవాళీ క్రికెటర్లు సైతం ఐపీఎల్లో మెరుపులతో వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్ 13వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్లో తమదైన ముద్ర వేసేందుకు మన దేశవాళీ కుర్రాళ్లు కసిగా ఎదురుచూస్తున్నారు. దేశవాళీ సీజన్లో రాణించి, ఐపీఎల్‌తో అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. బయో బబుల్ ఐపీఎల్లో ప్రభావం చూపనున్న భారత అన్క్యాప్డ్ బ్యాట్స్‌మెన్‌పై లుక్కేద్దామా..!
బ్యాట్స్‌మన్ : రుతురాజ్ గైక్వాడ్
జట్టు : చెన్నై సూపర్‌కింగ్స్
ప్రత్యేకత : దేశవాళీ సర్క్యూట్లో నియంత్రిత దూకుడు కలిగిన బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్. గత రెండేండ్లలో భారత్-ఏ తరఫున అత్యధిక లిస్ట్-ఏ పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ గైక్వాడే. 15 ఇన్నింగ్స్‌ల్లో 843 పరుగులు చేశాడు. తెలివైన క్రికెట్ బుర్ర కలిగిన క్రికెటర్‌గా లెజెండ్ ఎం.ఎస్ ధోని నుంచి కితాబు అందుకున్నాడు.
ప్రభావం : సురేశ్ రైనా స్థానంలో నం.3 బ్యాట్స్‌మన్‌గా ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ధోని తర్వాత సూపర్‌కింగ్స్ బాధ్యతలు అందుకునే ఆశావహుల జాబితాలో రుతురాజ్ పేరు సైతం వినిపిస్తోంది. ఈ సీజన్లో గైక్వాడ్ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోనున్నాడు.
బ్యాట్స్‌మన్ : దేవదత్ పడిక్కల్
జట్టు : రాయల్ చాలెంజర్స్ బెంగళూర్
ప్రత్యేకత : గత సీజన్లో విజరు హజారె ట్రోఫీ (50 ఓవర్లు), సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీల్లో పడిక్కల్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 20 ఏండ్ల పడిక్కల్ 175.75 స్ట్రయిక్‌రేట్‌తో 580 పరుగులు పిండుకున్నాడు. సగటున ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు ఓ అర్థ సెంచరీ సాధించాడు.
ప్రభావం! : బెంగళూర్‌లో అరోన్ ఫించ్, జోశ్ ఫిలిప్ ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్నారు. పార్థీవ్ పటేల్‌తో మరో స్థానానికి పడిక్కల్ పోటీపడుతున్నాడు. ఏబీ డివిలియర్స్ వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగితే పడిక్కల్‌కు లైన్ క్లియర్ అవుతుంది. దూకుడు, సహనం, సంయమనం, టెక్నిక్, టెంపర్మెంట్ కలిగిన పడిక్కల్ ఈ సీజన్లో పంజా విసిరే అవకాశం మెండు. టాప్ ఆర్డర్లో పడిక్కల్‌ను ప్రయోగించేందుకు విరాట్ కోహ్లి సైతం ఆసక్తిగా ఉన్నాడు.
బ్యాట్స్‌మన్ : యశస్వి జైశ్వాల్
జట్టు : రాజస్థాన్ రాయల్స్
ప్రత్యేకత : యశస్వి జైశ్వాల్ ప్రభావం చూపని పరిమిత ఓవర్ల ఫార్మాట్, స్థాయి క్రికెట్ అంటూ లేదనే చెప్పాలి. లిస్ట్-ఏ మ్యాచుల్లో 70.81 సగటుతో ఆరుసార్లు 50 ప్లస్ స్కోరు చేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీ ఉంది. అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
ప్రభావం : రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌గా జోశ్ బట్లర్ స్థానం సుస్థిరం. రాబిన్ ఉతప్ప, మనన్ వోహ్రాతో మరో స్థానం కోసం జైశ్వాల్ పోటీపడుతున్నాడు. నం.3 స్థానంలో రావాలనుకుంటే సంజూ శాంసన్తోనూ పోటీ నెలకొంది. తిరుగులేని టెక్నిక్, పరుగుల వరద పారించే రికార్డుతో కోరుకున్న ఓపెనింగ్ స్థానంలోనే జైశ్వాల్ ఆడే అవకాశం ఉంది. అన్ని ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసినట్టే ఐపీఎల్‌లోనూ జైశ్వాల్ చెరగని ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.
బ్యాట్స్‌మన్ : సర్ఫరాజ్ ఖాన్
జట్టు : కింగ్స్ ఎలెవన్ పంజాబ్
ప్రత్యేకత : సర్ఫరాజ్ ఖాన్ గతంలోనే ఐపీఎల్లో ఓ మెరుపు మెరిసే ప్రయత్నం చేశాడు. కొన్ని కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ స్యీయ తప్పిదాలు, జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాలతో కెరీర్ వెనక్కి వెళ్లింది. 22 ఏండ్ల సర్ఫరాజ్ తాజాగా 301, 226, 78, 25, 177 పరుగుల ఇన్నింగ్స్‌లతో అత్యుత్తమ ఫామ్‌లోకి వచ్చాడు. సహజసిద్ధంగానే సర్ఫరాజ్ ఖాన్ దూకుడైన బ్యాట్స్‌మన్. టీ20 ఫార్మాట్లో సర్ఫరాజ్ ఆకాశమే హద్దుగా ఆడతాడు.
ప్రభావం : 2019 ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఎనిమిది ఇన్నింగ్స్‌లో ఆడాడు. మిడిల్ ఆర్డర్లో భిన్నమైన స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఈ సీజన్లోనూ మిడిల్లోనే రానున్నాడు. ఆఖరు ఓవర్లలో సర్ఫరాజ్‌ను బరిలోకి దింపి భారీ స్కోర్లపై పంజాబ్ కన్నేయనుంది. జట్టు ప్రణాళికల్లో సర్ఫరాజ్ ఈ సీజన్లో కీలకభూమిక కానున్నాడు.
బ్యాట్స్‌మన్ : అబ్దుల్ సమద్
జట్టు : సన్‌రైజర్స్ హైదరాబాద్
ప్రత్యేకత : దేశవాళీ సర్క్యూట్లో అబ్దుల్ సమద్ మ్యాచ్ ఫినీషర్. వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యేక చొరవతో సమద్‌ను సన్‌రైజర్స్‌లోకి తీసుకున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో నిర్ధాక్షిణ్యంగా సిక్సర్లు బాదటంలో సమద్ స్పెషలిస్ట్. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటకను కంగుతినిపించినంత పని చేశాడు. గత రంజీ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 112.97 స్ట్రయిక్‌రేట్ సమద్ సొంతం.
ప్రభావం : మనీశ్ పాండే నం.4 స్థానంలోనే కొనసాగితే లోయర్ బ్యాటింగ్ ఆర్డర్లో రెండు స్థానాలు ఖాళీగా ఉంటాయి. విరాట్ సింగ్, మహ్మద్ నబి, ఫబియన్ అలెన్‌లతో అబ్దుల్ సమద్ తుది జట్టులో చోటు కోసం పోటీపడుతున్నాడు. బలమైన టాప్ ఆర్డర్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అబ్దుల్ సమద్ రూపంలో మ్యాచ్ ఫినీషర్ను సిద్ధం చేసుకునే పనిలో పడింది.