Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్13 టైటిల్ వేటలో నాయకత్వమే కీలకం
- బయో బబుల్‌లో జట్టులో ప్రేరణ నింపటం ముఖ్యం
- బుడగ ఐపీఎల్లో కెప్టెన్సీకి కొత్త పరీక్ష
25 మంది జట్టు నుంచి తుది జట్టు కూర్పు ఓ కళ. సాధారణ ఆటగాళ్ల నుంచి అసాధారణ ప్రదర్శనను రాబట్టుకోవటం ఓ కళే. అత్యంత ఒత్తిడితో కూడిన సన్నివేశాల్లో సహచరులను ఒత్తిడి నుంచి బయటపడేసి.. గెలుపు దిశగా నడిపించటం ఓ కళే. 2008 ఐపీఎల్‌లోనే షెన్ వార్న్ తన నాయకత్వ లక్షణాలతో రాజస్థాన్ రాయల్స్‌ను విజేతగా నిలిపి సంచలనం సృష్టించాడు. 12 ఏండ్ల ఐపీఎల్ చరిత్రలో ఎం.ఎస్ ధోని, రోహిత్ శర్మ, గౌతం గంభీర్‌లు తమ అద్భుత నాయకత్వంతో అపూర్వ విజయాలు సాధించారు. బయో సెక్యూర్ బబుల్‌లో జరుగుతున్న ఐపీఎల్13లో నాయకత్వం మరింత కీలకం కానుంది. జట్టులో అనునిత్యం ప్రేరణ నింపే దళపతే ఐపీఎల్ విజయ దళపతిగా నిలువనున్నాడు.
నవతెలంగాణ క్రీడావిభాగం
అత్యుత్తమ క్రికెట్ మ్యాచులకు వేదిక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఆటలోనే కాదు నాయకత్వంలోనూ ఐపీఎల్ ప్రపంచ శ్రేణి ప్రమాణాలను అందుకుంది. 12 ఏండ్లలో షేన్ వార్న్, ఎం.ఎస్ ధోని, రోహిత్ శర్మ, గౌతం గంభీర్ సహా ఇతర నాయకులు తమ వ్యూహ ప్రతివ్యూహలతో సాధారణ బృందాలను విజేతలుగా నిలిపారు. అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్లు, అన్క్యాప్డ్ దేశవాళీ క్రికెటర్లు, అరంగ్రేట యువ క్రికెటర్లను ఓ జట్టుగా నిలిపి ఐపీఎల్ టైటిల్ విజయం దిశగా నడిపించటంలో కెప్టెన్లది అత్యంత ముఖ్యభూమిక. ఎం.ఎస్ ధోని, రోహిత్ శర్మలు ఐపీఎల్లో దిగ్గజ కెప్టెన్ కితాబు అందుకున్నారు. బయో సెక్యూర్ బబుల్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తి రేపుతోన్న వివిధ జట్ల కెప్టెన్ల నాయకత్వ శైలిలపై ఓ లుక్కేద్దామా..!.
ఎం.ఎస్ ధోని (చెన్నై సూపర్‌కింగ్స్)
నాయకుడిగా ఎం.ఎస్ ధోని ఘనమైన రికార్డు కలిగి ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 కెప్టెన్‌గా మహిని చెప్పవచ్చు. క్రికెట్ అంశాల్లో ప్రాంఛైజీ యజమాని శ్రీనివాసన్ కంటే ధోనిదే అంతిమ నిర్ణయం. ఐపీఎల్లో ప్రతి సీజన్లోనూ ప్లే ఆఫ్స్/సెమీఫైనల్స్‌కు చేరిన ఏకైక జట్టు సూపర్‌కింగ్స్ మాత్రమే. ఐపీఎల్లో ఎనిమిది సార్లు టైటిల్ పోరుకు చేరిన సూపర్‌కింగ్స్ మూడుసార్లు విజేతగా నిలిచింది. ఐపీఎల్లో అత్యంత నిలకడతో ఆడిన జట్టు చెన్నై సూపర్‌కింగ్స్.
మ్యాన్మేనేజ్మెంట్ స్కిల్స్ : జట్టులోని ఆటగాళ్లు తన శైలి అలవర్చుకునేలా చేయటంలో ధోని దిట్ట. తన వద్ద ఉన్న వనరులను వినియోగించుకోవటంలోనూ మహిది ప్రత్యేక శైలి. సూపర్‌కింగ్స్‌లో మహి కెప్టెన్సీలో ఆడిన మన్‌ప్రీత్ గోనీ, సుదీప్ త్యాగి, మోహిత్ శర్మ, దీపక్ చాహర్‌లు జాతీయ జట్టుకూ ఆడారు. నాన్నల సైన్యం ట్యాగ్‌తో 2018 ఐపీఎల్ విజేతగా నిలిచాడు.
అంతఃప్రేరణ? గణాంకాలు? : ధోని అంతఃప్రేరణతో నిర్ణయాలు తీసుకునే నాయకుడిగానే చెబుతారు. సునీల్ నరైన్‌ను పవర్‌ప్లేలో నిలువరించేందుకు అన్ని జట్లు ఆపసోపాలు పడుతుంటే.. హర్బజన్సింగ్ను ప్రయోగించి పరిష్కారాన్ని చూపాడు. వికెట్ కీపర్‌గా పిచ్‌ను మంచిగా అర్థం చేసుకోవటంలో మిగతా కెప్టెన్లతో పోల్చితే ధోనికి అనుకూలత ఎక్కువ. బ్యాట్స్‌మన్, పిచ్ ఆధారంగా ఫీల్డింగ్ మొహరింపులు చేస్తాడు. జట్టు సమావేశాల్లో గణాంకాలను పెద్దగా పట్టించుకోడని సూపర్‌కింగ్స్ వర్గాలే తెలిపాయి.
మరువజాలమా..! : దిగ్గజం ధోని నాయకత్వ గొప్పతనాన్ని ఓ సంఘటనతో చెప్పలేం. కానీ ధోని వ్యూహలు అంచనాలకు అతీతంగా ఉంటాయి. 2018 ఐపీఎల్లో అంబటి రాయుడిని ఓపెనర్‌గా దింపి అద్భుత ఫలితం రాబట్టాడు. ఆ సీజన్లో రాయుడు 602 పరుగులు చేశాడు. అదే సీజన్లో ముఖ్యమైన క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌పై స్టార్ స్పిన్నర్ హర్బజన్ సింగ్‌కూ ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. ' నా దగ్గర చాలా కార్లు, బైక్‌లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఒకేసారి నడుపలేను' అని మీడియా సమావేశంలో అన్నాడు. అసహజ సందర్భాల్లో ధోని అడుగులు అంచనాలకు దగ్గరగా ఉన్నాయనే విమర్శ ఉంది, కానీ కెప్టెన్సీలో ధోని ధోనీయే.
రోహిత్ శర్మ (ముంబయి ఇండియన్స్)
2013లో ముంబయి ఇండియన్స్ సారథ్య పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ.. రికార్డు స్థాయిలో నాలుగు ఐపీఎల్ టైటిళ్లు సాధించాడు. వ్యూహల పరంగా కెప్టెన్సీలో ధోని తర్వాతి స్థానం రోహిత్‌శర్మదే. ధోని మాదిరిగానే రోహిత్ శర్మ కెప్టెన్‌గా ప్రశాంత నిర్ణయాలు తీసుకోవటంలో దిట్ట. ధోని అంత్ణప్రేరణతో నిర్ణయాలు తీసుకుంటే.. రోహిత్ గణాంకాలను పెద్దగా నమ్ముకుంటాడు.
మ్యాన్మేనేజ్మెంట్ స్కిల్స్ : రోహిత్ శర్మ నాయకత్వ శైలి సింప్లిసిటీ. సచిన్ టెండూల్కర్, లసిత్ మలింగ, కీరన్ పొలార్డ్, హర్బజన్ సింగ్, పాండ్య బ్రదర్స్, బుమ్రా సహా ఇతర క్రికెటర్లను హ్యాండిల్ చేశాడు. అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు సహచరులకు గౌరవం కల్పిస్తాడు. జట్టు ఒక తాటిపై నిలిచేలా చేస్తాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో విశ్వాసం నింపటంలో రోహిత్‌ది అందెవేసిన చేయి.
అంతఃప్రేరణ? గణాంకాలు? : రోహిత్ శర్మ గొప్ప వ్యూహకర్త. ప్రణాళికలు వేయటంలో దిట్ట. ఒక్కో బ్యాట్స్‌మన్‌కు ప్రణాళిక వేసేందుకు జట్టు అనలిస్ట్‌తో ప్రత్యేకంగా కూర్చుంటాడు. పిచ్, వేదిక, బ్యాట్స్‌మన్, మ్యాచ్ సందర్భం ఆధారంగా ఏ బౌలర్‌ను ప్రయోగించాలో తేల్చుకుంటాడు.
మరువజాలమా..! : గ్లెన్ మాక్స్‌వెల్‌కు బుమ్రాను, ఏబీ డివిలియర్స్‌కు కృనాల్ పాండ్యను ప్రయోగించటంలోనే రోహిత్ శర్మ తను ఎంత చక్కగా ప్రణాళికలు రచిస్తాడో తెలుపుతాయి. ఎక్స్ ఫ్యాక్టర్ ఎంపికలతో ప్రత్యర్థులను ఆశ్చర్యానికి గురిచేస్తాడు. 2018లో లెగ్‌స్పిన్నర్ మయాంక్ మార్కెండెకు అవకాశం ఇచ్చి అద్భుతాలు రాబట్టాడు. అదే మార్కెండెను 2019లో రాహుల్ చాహర్‌తో భర్తీ చేశాడు. 2019 ఐపీఎల్ ఫైనల్లో సూపర్‌కింగ్స్ టెయిలెండర్ షార్దుల్ ఠాకూర్‌కు స్లో బాల్‌ను వేసి..అందరికీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఐపీఎల్లో రోహిత్ కెప్టెన్సీకి ఇది మచ్చుతునక. నాయకుడిగా రోహిత్ మెరుగవ్వాల్సింది ఏమైనా ఉందంటే.. అది అతడి బ్యాటింగే.
విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూర్)
నాయకత్వ పటిమను టైటిళ్లలో కొలిస్తే ఐపీఎల్లో విరాట్ కోహ్లి సాధించింది సున్నా. రాయల్ చాలెంజర్స్ తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్, ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ కోహ్లి. కెప్టెన్‌గా జట్టు సహచరులను మునివేళ్లపై నిలబెట్టాలని తపిస్తాడు. మైదానంలో ఎనర్జిటిక్‌గా ఉంటూ జట్టునూ అలాగే ఉంచాలని చూస్తాడు. టైటిల్ నెగ్గకపోయినా, బెంగళూర్‌ను నాయకుడిగా ముందుండి నడిపాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు.
మ్యాన్మేనేజ్మెంట్ స్కిల్స్ : 'బలీయమైన లక్ష్యం' విరాట్ కోహ్లి తరచూ జట్టు సమావేశాల్లో ఉచ్చరించే పదం. విరాట్ కోహ్లి తరహాలోనే తన సహచరులూ అదే రీతిలో ఉండాలని కోరుకుంటాడు. ఫిట్నెస్, క్రికెట్ స్కిల్స్ మెరుగుపర్చుకునేందుకు జట్టును జిమ్, నెట్స్‌లో శ్రమించేలా చూస్తాడు. ఉత్కంఠ సమయాల్లో బౌలర్లపై నమ్మకం ఉంచటంలో కోహ్లి ముందుంటాడు. తుది జట్టులో చోటుపై సహచరుల్లో విశ్వాసం కల్పించటంలో కోహ్లి ఓ అడుగు వెనుకే ఉన్నాడని చెప్పాలి.
అంతఃప్రేరణ? గణాంకాలు? : మ్యాచ్‌ను చక్కగా చదవగలిగే అతి కొద్ది మందిలో విరాట్ కోహ్లి ఒకరు. ఫలితాన్ని ముందే ఊహించి అందుకు తగినట్టు మార్పులు చేసుకుంటాడు. గణాంకాలను కోహ్లి పెద్దగా పట్టించుకోడు. సహచర క్రికెటర్లు, మ్యాచ్ సందర్భాలను బట్టే కోహ్లి నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రత్యర్థి బౌలర్లు బలహీనతలు, బాదాల్సిన బంతులు, ఫీల్డింగ్ మొహరింపులు వంటి విషయాలను జట్టు సమావేశంలో చర్చిస్తాడు.
మరువజాలమా..! : విరాట్ కోహ్లి బ్యాట్స్‌మన్‌గా ఆత్మవిశ్వాసం కలిగిన ఆటగాడు. కెప్టెన్‌గా కోహ్లి అదే రీతిలో కనిపిస్తాడు. మ్యాచ్‌లో జరుగుతున్న మార్పులకు అతి త్వరగా ప్రణాళికలను మార్చుకోవటంలో కోహ్లి కాస్త మెరుగవ్వాలి. 2019 ఐపీఎల్లో కోహ్లి మెరుగైన కెప్టెన్‌గా దర్శనమిచ్చాడు. యుజ్వెంద్ర చాహల్‌ను విదేశీ బ్యాట్స్‌మెన్‌పైకి, నవదీప్ సైనిని దేశవాళీ బ్యాట్స్‌మెన్‌పైకి ప్రయోగించి విజయవంతమయ్యాడు. బెంగళూర్‌లో సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో ధోనిపైకి ఏడో ఓవర్లోనే సైనికి ప్రయోగించాడు. ఇన్‌స్వింగర్‌తో నవదీప్ ధోనిని అవుట్ చేసినంత పని చేశాడు. కట్టుదిట్టమైన బంతులతో చాహల్ ఒత్తిడి పెంచాడు. ధోని స్కోరింగ్ సామర్థ్యంపై దెబ్బకొట్టాడు. ఇక కెప్టెన్‌గా కోహ్లి ఎంతో మెరుగవ్వాలి. ఐపీఎల్లో ఇతర కెప్టెన్ల మాదిరిగా కాకుండా కోహ్లి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తాడు. బౌలర్లతో సంప్రదింపులకు ఇది విఘాతం. జట్టు నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టుకోవటం కోహ్లికి తెలియాలి. అప్పుడే ఐపీఎల్ టైటిల్ కొట్టగలడు.
డెవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా నియమితులైన వార్నర్.. 2016లో ఆరెంజ్ ఆర్మీకి తొలి టైటిల్ అందించాడు. 2017లోనూ సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. సన్‌రైజర్స్ ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా సహచరుల గౌరవాన్ని చూరగొన్నాడు. యాజమాన్యంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. జట్టులోని యువ క్రికెటర్లకు డెవిడ్ వార్నర్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రెండేండ్ల విరామం అనంతరం వార్నర్ తిరిగి నాయకుడిగా వస్తున్నాడు.
మ్యాన్మేనేజ్మెంట్ స్కిల్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ శిబిరంలో ఎప్పుడూ సీనియర్ క్రికెటర్లు లేకపోవటం వార్నర్‌కు మేలు చేసింది. యువ క్రికెటర్లకు వార్నర్ రోల్‌మోడల్‌గా నిలిచాడు. బ్యాట్స్‌మన్‌గా, ఫీల్డర్‌గా వార్నర్ మైదానంలో ఎనర్జిటిక్‌గా కదులుతాడు. ఆరెంజ్ ఆర్మీలో రషీద్ ఖాన్ సహా మహ్మద్ సిరాజ్, ముస్తాఫిజుర్ రెహమాన్, సిద్దార్థ్ కౌల్ వంటి యువ క్రికెటర్లను ప్రోత్సహించాడు.
అంతఃప్రేరణ? గణాంకాలు? : అంత్ణప్రేరణ, గణాంకాలను డెవిడ్ వార్నర్ సమన్వయం చేసుకుంటాడు. బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసేందుకు గణాంకాల వైపు చూసిన సందర్భాలు ఉన్నాయి. 2016 ఐపీఎల్లో ఆరోన్ఫించ్పై భువనేశ్వర్ కుమార్‌ను, అదే సీజన్ ఫైనల్లో ఏబీ డివిలియర్స్పైకి అన్క్యాప్డ్ బిపుల్ శర్మను ప్రయోగించి ఈ రెండు లక్షణాలను తనలో చూపించాడు.
మరువజాలమా..! : 2016 ఐపీఎల్ ఫైనల్లో వార్నర్ అద్భుత నాయకత్వ వ్యూహ చతురతను ప్రదర్శించాడు. ఆ సీజన్లో విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారీ స్కోర్లను బెంగళూర్ అలవోకగా ఛేదించింది. చిన్నస్వామి స్టేడియంలో తొలుత ఫీల్డింగ్ చేయటం మేలు చేసేదే. ఇక సన్‌రైజర్స్‌కు స్కోర్లను కాపాడుకోవటంలో మంచి రికార్డుంది. దీంతో సొంత బలాన్ని నమ్ముకోవడానికే మొగ్గుచూపాడు. ఆ మ్యాచ్‌లో 140/1తో బెంగళూర్ గెలుపు దిశగా సాగుతోంది. దీంతో వార్నర్ తీసుకున్న నిర్ణయంపై అనుమానాలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లి నిష్క్రమించగానే.. ముస్తాఫిజుర్ రెహమాన్, బిపుల్ శర్మలకు బంతి అందించిన వార్నర్ ప్రమాదకర డివిలియర్స్‌ను సాగనంపాడు. ఇక ఆ తర్వాత అంతా టైటిల్ చరిత్రే. కెప్టెన్‌గా డెవిడ్ వార్నర్‌కు పెద్దగా ప్రతికూలతలు లేవు. కానీ రెండు సీజన్ల విరామం తర్వాత నాయకత్వ పగ్గాలు అందుకుంటున్నాడు. గత రెండు సీజన్లలో విలియమ్సన్ కెప్టెన్సీ వహించినా నాయకత్వ బృందంలో(నిషేధంతో ఆడని 2018 సీజన్లో సైతం) వార్నర్ కొనసాగాడు. ఆరెంజ్ ఆర్మీ డ్రెస్సింగ్‌రూమ్‌ను నడిపించటం వార్నర్‌కు పెద్ద సమస్య కాదు.