Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపర్ ఓవర్లో ఢిల్లీ గెలుపు
- మయాంక్ సూపర్ ఇన్నింగ్స్ వృథా
- మార్కస్ స్టోయినిస్ ధనాధన్
దుబాయ్ (యుఏఈ)
సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. నిర్ణీత ఓవర్ల మ్యాచ్‌లో పంజాబ్, ఢిల్లీ స్కోర్లు 157/8 సమం అయ్యాయి. కగిసో రబాడ సూపర్ ఓవర్లో పంజాబ్ 2/2 పరుగులు చేయగా... ఢిల్లీ అలవోకగా ఛేదించింది. పంజాబ్ తరఫున కెఎల్ రాహుల్ (2), నికోలస్ పూరన్ (0) సూపర్ ఓవర్లో విఫలమయ్యారు. అంతకముందు మయాంక్ అగర్వాల్ (89, 60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్‌తో పంజాబ్ గెలుపు గీత వరకూ వచ్చింది. ఆఖరు మూడు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన దశలో పంజాబ్ చేజేతులా సూపర్ ఓవర్ వరకు తెచ్చుకుంది. మార్కస్ స్టోయినిస్ (53, 21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఢిల్లీ మంచి స్కోరు సాధించింది.
మయాంక్ అదరహౌ : 158 పరుగుల ఛేదనలో పంజాబ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రాహుల్ (21), మయాంక్ అగర్వాల్ (89) తొలి వికెట్‌కు 30 పరుగులు జోడించారు. రాహుల్ నిష్క్రమణ తర్వాత మయాంక్‌కు తోడుగా ఎవరూ నిలువలేదు. కరుణ్ నాయర్ (1), నికోలస్ పూరన్ (0)లను అశ్విన్ ఒకే ఓవర్లో వెనక్కి పంపి దెబ్బకొట్టాడు. మాక్స్వెల్ (1), సర్ఫరాజ్ ఖాన్ (12)లూ ఎంతోసేపు నిలువలేదు. పంజాబ్ ఆశలు ఆవిరవుతున్న దశలో మయాంక్ గేర్ మార్చాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 60 బంతుల్లో 89 పరుగులతో పంజాబ్‌ను గెలుపుకు దగ్గరగా తీసుకొచ్చాడు. మూడు బంతుల్లో 1 పరుగు చేయాల్సిన దశలో మయాంక్ అవుటయ్యాడు. ఆఖరు బంతికి క్రిస్ జోర్డాన్ (5) సైతం క్యాచౌట్ అయ్యాడు. 157/8తో స్కోర్లు సమం అయ్యాయి.
ఔరా మార్కస్ : టాస్ నెగ్గిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మహ్మద్ షమి ధాటికి క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ నిలువలేదు. శిఖర్ ధావన్ (0) వికెట్ల వెనకాల జీవనదానం పొందినా.. అదే బంతికి రనౌట్‌గా నిష్క్రమించాడు. పృథ్వీ షా, హెట్‌మయర్‌లు షాట్ సెలక్షన్ లోపంతో సులువుగా వికెట్ పారేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రేయాష్ అయ్యర్, రిషబ్ పంత్‌లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు. నాల్గో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఢిల్లీని గౌరవ ప్రద స్కోరు దిశగా నడిపించారు. కానీ వరుస ఓవర్లలో పంత్, అయ్యర్ డగౌట్‌కు చేరుకోవటంతో ఢిల్లీ కథ మొదటికి చేరుకుంది. కానీ ఆఖర్లో మార్కస్ స్టోయినిస్ సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. షెల్డన్ కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో మెరిసిన స్టోయినిస్... క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరు ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 6, 4, 4, 4, 6తో విరుచుకుపడ్డాడు. ఆఖరు ఓవర్లో 30 పరుగులు పిండుకున్న ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 157/8తో భారీ స్కోరు సాధించింది. క్రిస్ జోర్డాన్ 0/56తో దారుణంగా విఫలమయ్యాడు.
షమి అదుర్స్ : స్టార్ పేసర్ మహ్మద్ షమి ఐపీఎల్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. గత సీజన్లో చెన్నై 2/17, ముంబయిపై 3/22 గణాంకాలను ఢిల్లీ క్యాపిటల్స్‌పై మెరుగుపర్చుకున్నాడు. నాలుగు ఓవర్లలో 3/15తో ఉత్తమ ప్రదర్శన చేశాడు. పవర్ ప్లేలో మూడు ఓవర్లు వేసిన షమి 2 వికెట్లు కూల్చి 8 పరుగులే ఇచ్చాడు. యువ పృథ్వీ షా (5), ప్రమాదకర షిమ్రోన్ హెట్మయర్ (7)లను వెనక్కి పంపాడు. షమి అద్భుత బంతులు వేసిన వేళ.. క్యాపిటల్స్ కుర్ర బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపిక సైతం పంజాబ్‌కు కలిసొచ్చింది. కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ మిడాఫ్‌లో వరుస సిక్సర్లతో ప్రమాదకరంగా పరిణమించిన తరుణంలో రాహుల్ బంతిని షమికి అందించాడు. మిడాఫ్లోనే అయ్యర్ కథకు ముగింపు పలికిన షమి.. దుబారులో మరుపురాని ప్రదర్శన చేశాడు. యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోరు ఐపీఎల్ అరంగ్రేటంలో అదరగొట్టాడు. 1/22తో విశేషంగా ఆకట్టుకున్నాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
ఢిల్లీ క్యాపిటల్స్ : 157/8 (మార్కస్ స్టోయినిస్ 53, శ్రేయాష్ అయ్యర్ 39, మహ్మద్ షమి 3/15, షెల్డన్ కాట్రెల్ 2/24)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ : 157/8 ( మయాంక్ అగర్వాల్ 89, కెఎల్ రాహుల్ 21, అశ్విన్ 2/2, రబాడ 2/28)