Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌పై అర్థ సెంచరీలు
- రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 163/5
దుబాయ్ : ఐపీఎల్ అరంగేట్ర బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్ (56, 42 బంతుల్లో 8 ఫోర్లు), మిస్టర్ 360 ఏబి డివిలియర్స్ (51, 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 163/5 స్కోరు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (14) సన్‌రైజర్స్‌పై మళ్లీ విఫలమయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, విజరు శంకర్, అభిషేక్ శర్మలు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆరంభంలో పడిక్కల్, ఆఖర్లో డివిలియర్స్ దూకుడుతో భారీ స్కోరుపై కన్నేసిన బెంగళూర్.. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 163 పరుగులే చేసింది.
దూకుడుగా మొదలుపెట్టి.. : టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దుబాయ్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూర్‌కు ఓపెనర్లు అరోన్ ఫించ్ (29, 27 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (56, 42 బంతుల్లో 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. ఓపెనర్లు ఇద్దరూ క్రీజులో కుదురుకోవటంతో బెంగళూర్ భారీ స్కోరుపై కన్నేసింది. యువ బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఔరా అనిపించాడు. 11 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఓపెనింగ్ జోడీ.. వరుస బంతుల్లో డగౌట్‌కు చేరింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (14) హైదరాబాద్‌పై మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. 13 బంతుల్లో 14 పరుగులు చేసిన కోహ్లి ఒక్క బౌండరీ కొట్టలేదు. కోహ్లి నిష్క్రమణ తర్వాత ఏబి డివిలియర్స్ (51) చెలరేగాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లలో కదంతొక్కిన డివిలియర్స్ బెంగళూర్‌కు మంచి స్కోరు అందించాడు. సన్‌రైజర్స్ స్టార్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్లకు వికెట్లు దక్కలేదు.
పవర్ఫుల్ పడిక్కల్ : దేశవాళీ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన యువ బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ అరోన్ ఫించ్ తోడుగా బెంగళూర్ ఇన్నింగ్స్ ఆరంభించిన పడిక్కల్.. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడాడు. ఓ ఎండ్‌లో ఫించ్ తడబడుతుండగా.. పడిక్కల్ పరుగుల వేటలో చెలరేగాడు. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, నటరాజన్‌లపై విరుచుకుపడ్డాడు. 8 ఫోర్లతో 36 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ బాదిన పడిక్కల్ విశేషంగా ఆకట్టుకున్నాడు. నాణ్యమైన బౌలింగ్‌పై ఎటువంటి తడబాటు లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించిన పడిక్కల్ అరోన్ ఫించ్ జతగా తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం జోడించాడు. దేవదత్ పడిక్కల్ రాకతో బెంగళూర్ టాప్ ఆర్డర్లో విరాట్, డివిలియర్స్‌పై భారం కాస్త తగ్గనుంది!.
స్కోరు వివరాలు :
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : దేవదత్ పడిక్కల్ (బి) విజరు శంకర్ 56, అరోన్ ఫించ్ (ఎల్బీ) అభిషేక్ శర్మ 29, విరాట్ కోహ్లి (సి) రషీద్ ఖాన్ (బి) నటరాజన్ 14, ఏబీ డివిలియర్స్ రనౌట్ (బెయిర్‌స్టో/మనీశ్‌పాండే) 51, శివం దూబె రనౌట్ (బెయిర్‌స్టో) 7, జోశ్ ఫిలిప్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163.
వికెట్ల పతనం : 1-90, 2-90, 3-123, 4-162.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-25-0, సందీప్ శర్మ 4-0-36-0, నటరాజన్ 4-0-34-1, మిచెల్ మార్ష్ 0.4-0-6-0, విజరు శంకర్ 1.2-0-14-1, రషీద్ ఖాన్ 4-0-31-0, అభిషేక్ శర్మ 2-0-16-1.