Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు సూపర్‌కింగ్స్‌తో రాజస్థాన్ ఢ
- రెండో విజయంపై ధోనీసేన గురి
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
షార్జా (యుఏఈ) : ఐపీఎల్ 2020 యుఏఈలోని మూడో వేదికకు మారుతోంది. అబుదాబిలో ఆరంభమైన ఐపీఎల్ 13 సీజన్.. రెండు రోజులు దుబారులో అలరించింది. ఇప్పుడు మూడో ఆతిథ్య వేదిక షార్జాకు చేరుకుంటోంది. 2008 ఐపీఎల్ ఫైనలిస్ట్‌లు, మాజీ చాంపియన్లు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌లు నేడు షార్జాలో తలపడనున్నాయి. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబయి ఇండియన్స్‌పై అదిరే విజయం సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్ నేడు రాజస్థాన్ రాయల్స్‌పై మరో విజయాన్ని ఆశిస్తోంది. నేడు రాత్రి 7.30 గంటలకు చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ ఆరంభం కానుంది.
చెన్నైకి ఎదురుందా? : డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌పై విజయంతో సూపర్‌కింగ్స్ జోరుమీదుంది. షార్జాలో ధోనీసేన మ్యాచ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఓపెనర్ మురళీ విజరు స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన షేన్ వాట్సన్ ఇక్కడ తనదైన ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. అంబటి రాయుడు, డుప్లెసిస్, రవీంద్ర జడేజా, శామ్ కరన్ సహా కేదార్ జాదవ్, ఎం.ఎస్ ధోనిలు ఫామ్‌లో ఉన్నారు. లుంగి ఎంగిడి, దీపక్ చాహర్, పియూశ్ చావ్లాలతో బౌలింగ్ విభాగం మెరుగ్గా కనిపిస్తోంది.
రాయల్ గా ఆడతారా? : ఇద్దరు స్టార్ క్రికెటర్లు లేకుండా రాజస్థాన్ తన తొలి మ్యాచ్‌లో రాయల్‌గా ఆడుతుందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. జోశ్ బట్లర్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. స్టార్ ఆల్‌రౌండర్ జట్టుతో చేరాల్సి ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న జోశ్ బట్లర్ లేకపోవటం రాయల్స్‌కు ఇబ్బందే. యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్‌లపై రాయల్స్ ఆశలు పెట్టుకుంది. పేసర్ జోఫ్రా ఆర్చర్ నాయకత్వంలో బౌలింగ్ విభాగం బాగానే ఉంది. జైదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, శ్రేయాష్ గోపాల్‌లు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు.
ఇక్కడ భారీ స్కోర్లు? : యుఏఈ పిచ్‌లు స్వల్ప స్కోర్లకు చిరునామా. కానీ అబుదాబి, దుబారులకు భిన్నమైన వేదిక షార్జా. అక్కడ సగటున 150-160 పరుగులు నమోదైతే షార్జాలో 170-180 పరుగులు నమోదు అవుతాయి. ఇక్కడి పిచ్ స్పిన్నర్లు, పేసర్లకు సమానస్థాయిలో అనుకూలించనుంది. కానీ పరుగుల వేటలో బ్యాట్స్‌మెన్ మరింత స్వేచ్ఛగా చెలరేగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో నేటి మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
రాజస్థాన్ రాయల్స్ : రాబిన్ ఉతప్ప, యశస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజు శాంసన్, డెవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, శ్రేయాష్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, జైదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే/ టామ్ కరన్.
చెన్నై సూపర్‌కింగ్స్ : షేన్ వాట్సన్, రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, అంబటి రాయుడు, ఎం.ఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), కేదార్ జాదవ్, శామ్ కరన్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, పియూశ్ చావ్లా, లుంగి ఎంగిడి.