Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోఫ్రా ఆర్చర్ సిక్సర్ల వర్షం
- స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ అర్థ సెంచరీ
- రాజస్థాన్ రాయల్స్ 216/7
ఐపీఎల్ 2020 మొదలై మూడురోజులైంది. అబుదాబి, దుబాయ్ లో రసవత్తర సమరాలు చూశాం. దుబాయ్ లో సూపర్ ఓవర్ కిక్కు సైతం అనుభవించాం. అయినా, అభిమానుల్లో ఏదో అసంతృప్తి. ఐపీఎల్లో సహజసిద్ధ భారీ స్కోర్లు, సిక్సర్ల తుఫాన్ లేని వెలితి కనిపిస్తూనే ఉంది. బుడగ ఐపీఎల్ ముచ్చటగా మూడో వేదికకు చేరుకుంది. షార్జాకు వచ్చీ రాగానే ఆ లోటు తీరిపోయింది. యువ సంచలనం సంజు శాంసన్, జోఫ్రా ఆర్చర్ సిక్సర్ల వర్షం కురిపించగా.. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్ లేకపోయినా.. సూపర్‌కింగ్స్ బౌలర్లను శాంసన్ చితకబాదటంతో రాజస్థాన్ రాయల్స్ 216/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఐపీఎల్లో ఇదే అత్యధిక స్కోరు కావటం విశేషం.
షార్జా (యుఏఈ)
సంజు శాంసన్ (74, 32 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. షార్జా ఎమిరేట్స్‌లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. కరోనా మహమ్మారితో క్రికెట్‌కు దూరమైన సంజు శాంసన్.. పరుగుల దాహాన్ని ఒక్క సూపర్కింగ్స్పైనే తీర్చుకోవాలనంతే కసితో చితకబాదాడు. శాంసన్ సిక్సర్ల తుఫాన్‌తో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (69, 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి సంజు శాంసన్ రెండో వికెట్‌కు 121 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. శాంసన్ దెబ్బకు సూపర్‌కింగ్స్ బౌలర్ల గణాంకాలు మారిపోయాయి. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (27 నాటౌట్, 8 బంతుల్లో 4 సిక్సర్లు) విశ్వరూపంతో సూపర్‌కింగ్స్‌ను ఫినీషింగ్ టచ్ ఇచ్చాడు.
షార్జాల్లో సంజూ తుఫాన్! : టాస్ నెగ్గిన సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని మరో ఆలోచనకు తావులేకుండా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కీలక ఆటగాళ్లు జోశ్ బట్లర్, బెన్ స్టోక్స్ లేకుండానే సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ బరిలోకి దిగింది. యువ సంచలనం యశస్వి జైస్వాల్ (6) ఓ ఫోర్‌తో మెరిసినా.. దీపక్ చాహర్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. జైస్వాల్ నిష్క్రమణతో రాజస్థాన్ రన్‌రేట్‌తో పాటు వికెట్ల పతనానికి నాంది పడినట్టే అనిపించింది. కానీ సంజు శాంసన్ ప్రణాళికలు పూర్తి భిన్నంగా సాగాయి. క్రీజులోకి వచ్చీ రాగానే సూపర్‌కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆరు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. బౌలర్ ఎవరైనా సిక్సర్లతోనే స్వాగతం పలికిన శాంసన్ జోరు చూసి.. ఈ సీజన్లో తొలి శతకం బాదేస్తాడనే అనిపించింది. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో దీపక్ చాహర్‌కు శాంసన్ చిక్కటంతో విధ్వంసక ఇన్నింగ్స్‌కు తెరపడింది. మరో ఎండ్‌లో స్టీవ్ స్మిత్ (69) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆరంభంలో శాంసన్‌కు సహకరించిన స్మిత్.. అనంతరం తనే దూకుడుగా రంగంలోకి దిగాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 35 బంతుల్లో అర్ధ సెంచరీ బాదిన స్మిత్ చెన్నై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. వికెట్ల మధ్య చురుగ్గా పరుగులు సాధించాడు. సంజు శాంసన్‌ను డగౌట్‌కు చేర్చి నష్ట నివారణ చేసిన చెన్నైకి.. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (27 నాటౌట్) కోలుకోలేని పంచ్ ఇచ్చాడు. లుంగి ఎంగిడి వేసిన ఆఖరు ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన ఆర్చర్.. ఫ్రీ హిట్‌ను నాల్గో సిక్సర్ గా మలిచాడు. ఆర్చర్ అరివీర భయంకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ అలవోకగా 200 పరుగుల మైలురాయిని దాటేసింది. డెవిడ్ మిల్లర్ (10), రాబిన్ ఉతప్ప (5), రియాన్ పరాగ్ (6), టామ్ కరన్ (10 నాటౌట్)లు పెద్ద ప్రభావం చూపలేదు. సూపర్‌కింగ్స్ బౌలర్లలో శామ్ కరన్ (3/33) మూడు వికెట్లతో మెప్పించాడు. తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్న లుంగి ఎంగిడి ధారాళంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా 40, పియూశ్ చావ్లాలు 55 పరుగులు సమర్పించుకున్నారు. దీపక్ చాహర్ కాస్త పొదుపుగా 31 పరుగులే ఇచ్చాడు.
స్కోరు వివరాలు :
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి,బి) దీపక్ చాహర్ 6, స్టీవ్ స్మిత్ (సి) కేదార్ జాదవ్ (బి) శామ్ కరన్ 69, సంజు శాంసన్ (సి) దీపక్ చాహర్ (బి) లుంగి ఎంగిడి 74, డెవిడ్ మిల్లర్ రనౌట్ (రుతురాజ్/జాదవ్) 0, రాబిన్ ఉతప్ప (సి) డుప్లెసిస్ (బి) పియూశ్ చావ్లా 5,. రాహుల్ తెవాటియా (ఎల్బీ) శామ్ కరన్ 10, రియాన్ పరాగ్ (సి) ధోని (బి) శామ్ కరన్ 6, టామ్ కరన్ నాటౌట్ 10, జోఫ్రా ఆర్చర్ నాటౌట్ 27, ఎక్స్‌ట్రాలు : 09, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 216.
వికెట్ల పతనం : 1-11, 2-132, 3-134, 4-149, 5-167, 6-173, 7-178.
బౌలింగ్ : దీపక్ చాహర్ 4-0-31-1, శామ్ కరన్ 4-0-33-3, లుంగి ఎంగిడి 4-0-56-1, రవీంద్ర జడేజా 4-0-40-0, పియూశ్ చావ్లా 4-0-55-1.