Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫించ్, దేవ్‌దత్, డివిలియర్స్ అర్థ సెంచరీలు
- ఛేదనలో ఇషాన్ కిషన్, పొలార్డ్ మెరుపులు
- సూపర్ ఓవర్లో కోహ్లిసేన పైచేయి
దుబాయ్ (యుఏఈ)
బెంగళూర్ సూపర్ విక్టరీ సాధించింది. మంబయి ఇండియన్స్‌తో నిర్ణీత ఓవర్ల మ్యాచ్ స్కోర్లు సమం కాగా.. సూపర్ ఓవర్లో పైచేయి సాధించింది. ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్, 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేవ్‌దత్ పడిక్కల్ (54, 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అరోన్ ఫించ్ (52, 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో కదం తొక్కగా, బెంగళూర్ 201/3 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. శివం దూబె (27 నాటౌట్, 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో బెంగళూర్‌కు సీజన్లో తొలి భారీ స్కోరు అందించాడు. ఇషాన్ కిషన్ (99, 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), కీరన్ పొలార్డ్ (60, 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులతో ఛేదనలో ముంబయి 201/5 స్కోరు చేసింది. సూపర్ ఓవర్లో ముంబయి 7 పరుగులు చేయగా.. బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లి బుమ్రాపై రెండు ఫోర్లతో విజయాన్ని ఎగరేసుకుపోయాడు.
కిషన్, పొలార్డ్ పోరాటం : 202 పరుగుల ఛేదనలో రోహిత్ శర్మ (8), క్వింటన్ డికాక్ (14) సహా సూర్యకుమార్ యాదవ్ (0) త్వరగానే డగౌట్‌కు చేరుకున్నారు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ (99, 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), కీరన్ పొలార్డ్ (60 నాటౌట్, 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో కలిసి ముంబయిని నిలబెట్టాడు. 9 సిక్సర్లు, 2 ఫోర్లతో మెరిసిన కిషన్ శతకానికి ఒక్క పరుగు దూరంలో వికెట్ కోల్పోయాడు. పొలార్డ్ జతగా 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ కిషన్ ఆశల్లేని మ్యాచ్‌లో ముంబయిని గెలుపు దిశగా తీసుకెళ్లాడు. నిర్ణీత ఓవర్లలో 201/5 పరుగులు చేసిన ముంబయి.. బెంగళూర్‌తో సమవుజ్జీగా నిలిచింది.
కలిసికట్టుగా కొట్టారు : టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ దుబాయ్ లో ఛేదనకు ఓటేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూర్ తొలి ఓవర్ నుంచీ దూకుడుగా ఆడింది. అరోన్ ఫించ్ (52) పవర్‌ప్లేలో ధనాధన్ అనిపించాడు. 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. ఫించ్‌కు మరో ఎండ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (54) చక్కగా సహకరించాడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ రన్‌రేట్‌ను ముందుకు నడిపించాడు. ఫించ్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి (3) మళ్లీ నిరాశపరిచాడు. 11 బంతులు ఆడిన కోహ్లి.. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రోహిత్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబయిపై మంచి రికార్డున్న ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్) పడిక్కల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. దేవ్‌దత్ 2 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 37 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించగా, ఏబీ డివిలియర్స్ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 23 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేశాడు. కీరన్ పొలార్డ్ అద్భుత క్యాచ్‌తో దేవ్‌దత్ అవుటవగా.. శివం దూబె (27 నాటౌట్) శివమెత్తాడు. పాటిన్సన్ వేసిన ఆఖరు ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 10 బంతుల్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు. దూబె ధనాధన్‌తో బెంగళూర్ అలవోకగా 200 మార్క్ దాటేసింది. పడిక్కల్, డివిలియర్స్, దూబె ధాటికి ముంబయి బౌలర్లు విలవిల్లాడారు. ఆఖరు ఏడు ఓవర్లలో ఏకంగా 105 పరుగులు పిండుకున్న బెంగళూర్.. దుబాయ్ లో ముంబయి బౌలర్లకు షాకిచ్చింది.
స్కోరు వివరాలు :
బెంగళూర్ ఇన్నింగ్స్ : 201/3 (ఏబీ డివిలియర్స్ 55 నాటౌట్, దేవ్‌దత్ పడిక్కల్ 54, ట్రెంట్ బౌల్ట్ 2/34)
మంబయి ఇన్నింగ్స్ : 201/5 ( ఇషాన్ కిషన్ 99, కీరన్ పొలార్డ్ 60, ఇసురు ఉదాన 2/45)
ఐపీఎల్ నేటి మ్యాచ్
ఢిల్లీ క్యాపిటల్స్ X సన్‌రైజర్స్ హైదరాబాద్
సమయం : రాత్రి 7.30,
వేదిక : అబుదాబి