Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధనాధన్ డికాక్
- నైట్‌రైడర్స్‌పై ముంబయి మళ్లీ గెలుపు
అబుదాబి (యుఏఈ)
కోల్‌కత నైట్‌రైడర్స్‌పై ముంబయి ఇండియన్స్ ఆధిపత్యం మరింత పెరిగింది. ఆ జట్టుపై సీజన్లో వరుసగా రెండో విజయం సాధించిన ముంబయి ఇండియన్స్ ఓవరాల్ రికార్డును 21-6కు పెంచుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ ( 78 నాటౌట్, 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగటంతో 149 పరుగుల ఛేదనను ముంబయి ఇండియన్స్ 2 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. రోహిత్ శర్మ (35), హార్దిక్ పాండ్య (21 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో ముంబయి ఇండియన్స్ మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అంతకుముందు 61/5తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కోల్‌కతను టెయిలెండర్ పాట్ కమిన్స్ (53 నాటౌట్, 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)ఆదుకున్నాడు. కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (39 నాటౌట్, 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి పాట్ కమిన్స్ ఆరో వికెట్‌కు అజేయంగా 87 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరు రాణించటంతో కోల్‌కత నైట్‌రైడర్స్ 148/5తో గౌరవప్రద స్కోరు సాధించింది.
డికాక్ దంచుడు : స్వల్ప ఛేదనలో ముంబయికి తిరుగులేని ఆరంభం లభించింది. వికెట్ కీపర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ తొలి బంతి నుంచీ ఎదురుదాడి చేశాడు. ఓ ఎండ్‌లో డికాక్ చెలరేగటంతో మరో ఎండ్‌లో రోహిత్ శర్మ (35, 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సహకారం అందించాడు. 9 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరిసిన డికాక్ 78 పరుగులు చేశాడు. రోహిత్, సూర్యకుమార్ (10) వెంటవెంటనే అవుటైనా.. హార్దిక్ పాండ్య (21 నాటౌట్, 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లాంఛనం వేగంగా ముగించాడు. పాండ్య జోరుతో 16.5 ఓవర్లలోనే ముంబయి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
చాహర్ మ్యాజిక్ : టాస్ గెలిచిన కోల్‌కత తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (7) నిరాశపరచగా.. రెండు ఫోర్లతో జోరందుకున్న శుభ్‌మన్ గిల్ (21, 23 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజులో కుదురుకున్నట్టే కనిపించాడు. నం.3 బ్యాట్స్‌మన్ నితీశ్ రానా (5)ను నాథన్ కౌల్టర్ నైల్ వచ్చీ రాగానే అవుట్ చేశాడు. పవర్ ప్లే అనంతరం రాహుల్ చాహర్ మ్యాజిక్ చూపించాడు. పరుగుల కట్టడి చేసిన రాహుల్‌పై వినూత్న షాట్లు ఆడేందుకు వెళ్లి కోల్‌కత నష్టపోయింది. వరుస బంతుల్లో శుభ్‌మన్ గిల్, దినేశ్ కార్తీక్ (4)లను సాగనంపిన చాహర్ కోల్‌కతను ఒత్తిడిలో పడేశాడు. కెప్టెన్సీ వదులుకుని తొలి మ్యాచ్‌లో ఆడుతున్న కార్తీక్ నిరాశపరిచాడు. పది ఓవర్లలోపే క్రీజులోకి వచ్చిన అండ్రీ రసెల్ (12, 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)ను బుమ్రా అవుట్ చేశాడు. అంచనలకు అందని బౌన్సర్‌తో రసెల్‌ను సాగనంపాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో జతకలిసిన పాట్ కమిన్స్ హిట్టింగ్తో చెలరేగాడు. ఐదు ఫోర్లు, రెండు ఫోర్లతో మెరిసిన కమిన్స్ కోల్‌కతను ఆదుకున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో కమిన్స్ అర్థ సెంచరీ సాధించగా.. ఆఖరు ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన మోర్గాన్ స్కోరును 150కి చేరువ చేశాడు. ఆఖరు ఓవర్లో కౌల్టర్ నైల్‌పై 21 పరుగులు పిండుకున్న మోర్గాన్ బౌలర్లకు పోరాడగలిగే స్కోరు అందించాడు. ముంబయి బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీసుకోగా.. బుమ్రా, బౌల్ట్, కౌల్టర్నైల్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు :
కోల్‌కత ఇన్నింగ్స్ : 148/5 (పాట్ కమిన్స్ 53, ఇయాన్ మోర్గాన్ 39, రాహుల్ చాహర్ 1/18, బుమ్రా 1/22)
ముంబయి ఇన్నింగ్స్ :149/2 (క్వింటన్ డికాక్ 78 , రోహిత్ శర్మ 35 , హార్దిక్ పాండ్య 21, వరుణ్ చక్రవర్తి 1/23)
ఐపీఎల్ నేటి మ్యాచ్
రాజస్థాన్ X బెంగళూర్
దుబాయ్ లో మ. 3.30 నుంచి..
చెన్నై X ఢిల్లీ క్యాపిటల్స్
షార్జాలో రా.7.30 నుంచి..
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం