Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో 22 బంతుల్లోనే 55 పరుగులు
- 7 వికెట్ల తేడాతో బెంగళూర్ ఘన విజయం
- రాజస్థాన్ రాయల్స్‌కు తప్పని మరో ఓటమి
12 బంతుల్లో 35 పరుగులు. బెంగళూర్ ఛేదనలో ఇదీ సమీకరణం. క్రీజులో ఏబీ డివిలియర్స్ నిలిచినా.. మ్యాచ్ స్పష్టంగా బెంగళూర్ చేతుల్లో లేదు. కానీ మిస్టర్ 360 క్రీజులో ఉండగా.. అప్పుడే అంచనాలకు రావటం ఎంత పొరపాటో నిరూపించేందుకు సఫారీ స్టార్‌కు మూడు బంతులు సరిపోయాయి. జైదేవ్ ఉనద్కత్ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన డివిలియర్స్.. రెండు బంతులు ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. 22 బంతుల్లోనే 55 పరుగులతో ఏబీ డివిలియర్స్ మరో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.
దుబాయ్ (యుఏఈ)
మిస్టర్ 360 బెంజమిన్ డివిలియర్స్ విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. అతడు క్రీజులో ఉండగానే అప్పుడే ఓ అంచనాకు రాకూడదని మళ్లీ ఏబీ తనదైన విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెప్పాడు. 178 పరుగుల ఛేదనలో ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్, 22 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో బెంగళూర్‌కు సీజన్లో ఆరో విజయాన్ని కట్టబెట్టాడు. పరుగుల కష్టమైన దుబారు పిచ్‌పై విరాట్ కోహ్లి (43, 32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) నిష్క్రమణతో పైచేయి సాధించిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఆఖరు రెండు ఓవర్లలో చిల్చీ చెండాడిన డివిలియర్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని పూర్తి చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 177 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (57, 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (41, 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 22 బంతుల్లో అర్థ సెంచరీతో చెలరేగిన ఏబీ డివిలియర్స్ ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ఏబీ సిక్సర్ల తుఫాన్! : ఊరించే ఛేదనలో బెంగళూర్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. దేవ్‌దత్ పడిక్కల్ (35, 37 బంతుల్లో 2 ఫోర్లు) ఓ వైపు నిలిచినా.. అరోన్ ఫించ్ (14, 11 బంతుల్లో 2 సిక్స్‌లు) వికెట్ నిలుపుకోలేదు. రెండు సిక్సర్లతో మెరిసిన ఫించ్.. అదే ఊపులో శ్రేయాస్ గోపాల్ ఓవర్లో వికెట్ కోల్పోయాడు. ఫించ్ నిష్క్రమణతో కెప్టెన్ విరాట్ కోహ్లి (43, 32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి పడిక్కల్ రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడానికి తోడు పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించలేదు. దీంతో కోహ్లి, పడిక్కల్ భాగస్వామ్యం బెంగళూర్‌ను రేసులో నిలిపినా.. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. ఆఖరు 2 ఓవర్లలో 35 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్ రాజస్థాన్ వైపు మొగ్గింది. కానీ, 19వ ఓవర్లో జైదేవ్ ఉనద్కత్‌పై వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన డివిలియర్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆరు సిక్సర్లతో విశ్వరూపించిన చూపిన డివిలియర్స్ రాయల్స్ ఆశలను ఆవిరి చేశాడు. జైదేవ్ ఓవర్లో 25 పరుగులు పిండుకున్న బెంగళూర్.. ఆఖరు ఓవర్లో ఆర్చర్‌పై సులువుగా గెలుపు పరుగులు రాబట్టింది.
స్మిత్ రాణించినా.. : రాయల్స్ కీలక బ్యాట్స్‌మెన్ మళ్లీ విఫలమయ్యారు.. సంజు శాంసన్ (9), జోశ్ బట్లర్ (24, 25 బంతుల్లో 1 ఫోర్,1 సిక్స్) అంచనాలను అందుకోలేదు. ఈ ఇద్దరి డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో రాజస్థాన్ మరోసారి స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యింది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రాబిన్ ఉతప్ప (41, 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా.. బెన్ స్టోక్స్ (15, 19 బంతుల్లో 2 ఫోర్లు) వికెట్ నిలుపుకోలేదు. లెగ్ స్పిన్నర్ చాహల్ వరుస బంతుల్లో ఉతప్ప, సంజు శాంసన్‌లను వెనక్కి పంపగా.. క్రిస్ మోరీస్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (57, 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) వరుస వైఫల్యాలను బ్రేక్ వేస్తూ అర్థ సెంచరీ సాధించినా.. రాజస్థాన్ భారీ స్కోరు సాధించలేదు. ఆఖర్లో రాహుల్ తెవాటియ (19 నాటౌట్, 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ధనాధన్‌తో రాజస్థాన్ రాయల్స్ 177/6 పరుగులు చేసింది. బెంగళూర్ బౌలర్లలో క్రిస్ మోరీస్ (4/26), యుజ్వెంద్ర చాహల్ (2/34) వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు :
రాజస్థాన్ ఇన్నింగ్స్ : రాబిన్ ఉతప్ప (సి) ఫించ్ (బి) చాహల్ 41, బెన్ స్టోక్స్ (సి) డివిలియర్స్ (బి) క్రిస్ మోరీస్ 15, సంజు శాంసన్ (సి) క్రిస్ మోరీస్ (బి) చాహల్ 9, స్టీవ్ స్మిత్ (సి) అహ్మద్ (బి) క్రిస్ మోరీస్ 57, జోశ్ బట్లర్ (సి) నవదీప్ సైని (బి) క్రిస్ మోరీస్ 24, రాహుల్ తెవాటియ నాటౌట్ 19, జోఫ్రా ఆర్చర్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177.
వికెట్ల పతనం : 1-50, 2-69, 3-69, 4-127, 5-173, 6-177.
బౌలింగ్ : వాషింగ్టన్ సుందర్ 3-0-25-0, క్రిస్ మోరీస్ 4-0-26-4, ఇసురు ఉదాన 3-0-43-0, నవదీప్ సైని 4-0-30-0, యుజ్వెంద్ర చాహల్ 4-0-34-2, షాబాజ్ అహ్మద్ 2-0-18-0.
బెంగళూర్ ఇన్నింగ్స్ : దేవ్‌దత్ పడిక్కల్ (సి) స్టోక్స్ (బి) రాహుల్ తెవాటియ 35, అరోన్ ఫించ్ (సి) రాబిన్ ఉతప్ప (బి) శ్రేయాస్ గోపాల్ 14, విరాట్ కోహ్లి (సి) రాహుల్ తెవాటియ (బి) కార్తీక్ త్యాగి 43, ఏబీ డివిలియర్స్ నాటౌట్ 55, గుర్కీరత్ సింగ్ మన్ నాటౌట్ 19, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 179.
వికెట్ల పతనం : 1-23, 2-102, 3-102.
బౌలింగ్ : జోఫ్రా ఆర్చర్ 3.4-0-38-0, శ్రేయాస్ గోపాల్ 4-0-32-1, కార్తీక్ త్యాగి 4-0-32-1, జైదేవ్ ఉనద్కత్ 4-0-46-0, రాహుల్ తెవాటియ 4-0-30-1,
ఐపీఎల్లో నేడు
- హైదరాబాద్ X కోల్‌కత
అబుదాబిలో మ.3.30 నుంచి..
- ముంబయి X పంజాబ్
దుబాయ్ లో రా 7.30 నుంచి..
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..